బోర్డు తిప్పేస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థలు!
posted on Aug 5, 2012 7:30AM
అమెరికాలో ఉన్న భారతసాఫ్ట్‌వేర్ సంస్థలు ఎలా మాంద్యంలో కొట్టుమిట్టాడు తున్నాయో రాష్ట్రపరిస్థితిని పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇటీవల కాలంలో అనుకున్నంత స్పందన రాక, నష్టాలు భరించలేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ షేర్‌హోల్డర్స్‌కు కూడా చెప్పకుండానే బోర్డులు తిప్పేస్తున్నాయి. దీంతో హతాశులైన వాటాదారులు పోలీసులను ఆశ్రయించి తాము మోసపోయిన విధానాన్ని తెలియజేసి కేసులు పెడుతున్నారు. సాఫ్ట్‌వేర్ బూమ్ లేకపోవటం వల్ల ఇటీవల కాకినాడలో టెక్నికల్‌సెజ్‌లో ఎటువంటి నిర్మాణం జరగలేదు. అందుకే అక్కడ భూమి ఖాళీగానే ఉంది. ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌కు దగ్గరలో ఉన్న ఈ సెజ్‌లో నిర్మాణానికి ఏ కంపెనీ కూడా ముందుకురావటం లేదని తెలుస్తోంది.
కేంద్ర మంత్రి పళ్లంరాజు విజ్ఞప్తి మేరకే ఈ సెజ్‌ను నెలకొల్పారే మినహా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగంతో భవిష్యత్తు ముడిపడి ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో అనుకున్నంత అభివృద్థి సాధించలేకపోతున్నామని ప్రపంచ సాఫ్ట్‌మార్కెట్ విజేత మైక్రోసాఫ్ట్ ఉన్నత ఉద్యోగి ఒకరు స్పష్టం చేశారు. అందుకే సాఫ్ట్‌వేర్ కంపెనీలు మూతపడుతున్నాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌రోడ్డులో ఆర్చీస్‌ఐటీ ప్రాజెక్టు సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో ఆగ్రహించిన బాధితులు ఆ కంపెనీ యజమాని చిరునామా తెలుసుకుని ఆయన్ని నిలదీసిన తరువాత సరైన సమాధానం రాలేదని చితకబాదారు.పైగా, యజమానిని పోలీసులకు అప్పజెప్పారు. అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా స్ఫూర్తి ఉండదు కాబట్టి యజమానులు అన్నీ సర్దుకుని వెళ్లిపోతున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందని సాఫ్ట్‌వేర్ నిపుణులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.