తూర్పు, విశాఖ ఏజెన్సీలను వీడని గంజాయిసాగు?
posted on Aug 5, 2012 7:23AM
తూర్పుగోదావరి, విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు గంజాయి సాగుకు అడ్డాగా మారుతున్నాయి. దీనిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎక్సయిజ్‌శాఖ దాడులు చేయటం లేదు. అమాయక గిరిజనులను మాఫియాముఠాలు లొంగదీసుకుని మరీ ఈ సాగు చేయిస్తున్నాయని తెలుస్తోంది. పేదగిరిజనులు మాఫియా ముఠాల వలలో పడి గంజాయిసాగు చేస్తూ దాని రవాణా సమయంలో ఎవరైనా దాడి చేస్తే నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కువ డబ్బు వస్తుందన్న సాకు చూపి మాఫియా వీరిని లొంగదీసుకుందని బాధితకుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మన్యంతో పాటు సబ్‌ప్లాన్ ఏరియా కూడా గంజాయి సాగుకు అనుకూలంగా ఉంటుంది.
అందుకే ఈ సబ్‌ప్లాన్‌ఏజెన్సీలో కూడా సాగు చేస్తున్నారు. ఇటీవల కత్తిపూడి వద్ద సబ్‌ప్లాన్ ఏజెన్సీలో పండిన గంజాయి భారీస్థాయిలో దొరికింది. తాజాగా సబ్‌ప్లాన్ పరిధిలోని ఆంధ్రాశబరిమలై ప్రాంతంలో కూడా గంజాయి సాగు జరుగుతోందని వదంతులు వ్యాపించాయి. ఇక్కడ సాగు చేసిన గంజాయిని రహస్యంగా పొరుగురాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. విశాఖ నగరంలోని పాడేరు వద్ద 50కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖజిల్లాలోని అరకులోయ, పాడేరు, గిరిజన లోతట్టు గ్రామాల్లో రహస్యంగా సాగు జరుగుతోందని స్పష్టమైన సమాచారం ఉన్నా రాజకీయప్రాబల్యం వల్ల ఆ ప్రాంతాలకు ఎవరూ వెళ్లటం లేదని తెలుస్తోంది. దీనిపై ఇకనైనా దృష్టి సారించి అమాయకగిరిజనులను గంజాయిసాగు నుంచి తప్పించాలని పలుగిరిజన, ఆదివాసీ సంఘాలు రాష్ట్రప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాయి.