పోలీసుశాఖను పీడిస్తున్న నకిలీల బెడద!
posted on Aug 5, 2012 7:11AM
నకిలీ ఎస్‌ఐలు, సిఐలు పోలీసుశాఖను పీడిస్తున్నారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో వీరి ఆగడాలు భరించలేక పోలీసుశాఖను కొందరు ఆశ్రయించినప్పుడే అసలు భాగోతం బయటపడుతోంది. దొంగడబ్బు సంపాదించే వారిని లక్ష్యంగా చేసుకుని పుట్టుకొచ్చిన ఈ నకిలీలు పొరపాటుగా సక్రమ సంపాదన ఉన్నవారిని వేధిస్తున్నపుడు మాత్రమే పోలీసుశాఖకు వీరి గురించి తెలుస్తోంది. లేకపోతే అసలు సమాచారమే దొరకటం లేదు. అంతేకాకుండా ఇటీవల చెక్‌పోస్టుల ముందు కూడా ఇటువంటి నకిలీల హంగామా పెరిగిందనీ, సినీఫక్కీలో వాహనాలను ఆపి డబ్బు దోచుకుని వెళ్లిపోతున్నారని పలురకాల కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు పోలీసు శాఖ ఇంత వరకూ ఐడెంటీకార్డుల ఆధారంగా పని చేయకపోవటమే సమస్యకు మూలమని కొందరు సీనియర్లు తేలుస్తున్నారు. పోలీసులే ఐడెంటీకార్డులు చూపించుకుంటూ తిరిగితే వారిపై ఉన్న రక్షణ, భద్రత అనే బాధ్యతలకు అర్థం లేకుండా పోతుందని కొందరు వాదిస్తున్నారు. వీరి వాదనలకు ప్రతిఫలంగా నకిలీభారం కూడా పోలీసుశాఖ మోయాల్సివస్తోంది.
హైదరాబాద్ హయత్‌నగర్‌లో సిఐని అని చెప్పుకుంటూ తిరుగుతున్న నకిలీ సిఐ శ్రీనివాసులు అలియాస్ ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ అనే పేరిట ప్రశాంత్ అనేకరకాల మోసాలకు పాల్పడ్డారని అనేక ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈయనలాగానే తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ నకిలీల సమస్యను ఎదుర్కొన్నారని సమాచారం. ఈ బెడద గురించి రాష్ట్రహోంశాఖ కానీ, మంత్రి కానీ దృష్టిసారించిన దాఖలాలు లేవు. ఒక్కసారి దృష్టిసారిస్తే ఇటువంటి మోసాలు అరికట్టడం ఎంతో కష్టమైతే కాదు. మరి పోలీసుశాఖ ప్రయత్నమైనా చేస్తే సామాన్యులు బాధపడనక్కర్లేదు.