అలజడిలో ఇంజనీరింగు విద్యార్థులు?
posted on Aug 6, 2012 @ 4:54PM
ఇంజనీరింగు, మెడికల్ విద్య ఫీజులను యాజమాన్యాలు తమ నిర్వహణ ఆథారంగా నిర్ణయించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అథికారుల కమిటీ రాష్ట్రంలో 134రకాల ఫీజులను అమలు చేయాల్సి ఉంటుందని విశదీకరించింది. 133 ఇంజనీరింగుకళాశాలలకు ఒక తరహా ఫీజు, 569కాలేజీల్లో ఒకేరకమైన ఫీజు అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ఇంజనీరింగు విద్యార్థి కనిష్టఫీజు 31వేల రూపాయలు, మెడికల్ విద్యార్థి కనిష్టఫీజు రూ.50వేలు అని ఈ కమిటీ వెల్లడి చేసిన సమాచారం ఆథారంగా అర్థమవుతోంది. తమ కళాశాలల్లో యూజిసి నిర్ణయించిన విధంగా లెక్చరర్లకు వేతనాలు ఇస్తున్నామని 133కాలేజీలు తెలియజేయటంతో సుప్రీంకోర్టు ఫీజుల విషయంలో నిర్ణయాథికారం ఆ సంస్థలకు ఇచ్చింది. దీంతో మరో రెండేళ్లలో ఫీజులు మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బడ్జెట్‌లో మరో రెండేళ్లలో రూ.3,500కోట్ల నుంచి ఆరువేల కోట్ల రూపాయల వరకూ ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎపిఎఫ్‌ఆర్‌సికి వేతనాల అఫిడవిట్ ఇవ్వని 569కాలేజీల్లో ఒకేరకమైన ఉమ్మడి ఫీజులు అమలు చేస్తారు. మహారాష్ట్రలో వాతావరణం గమనిస్తే సంఘ్వి ఇంజనీరింగు కాలేజీలో ట్యూషన్‌ఫీజు 9,579రూపాయలు, షిండే ఇంజనీరింగు కాలేజీ ట్యూషన్‌ఫీజు రూ.28,037, సౌమ్య ఇంజనీరింగు కాలేజీలో 70,200రూపాయలు ట్యూషన్‌ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కాలేజీని బట్టి ట్యూషన్‌ఫీజు మారుతోంది కాబట్టి ఆంథ్రప్రదేశ్‌లోని 569 ఇంజనీరింగ్‌కాలేజీల ఉమ్మడిఫీజు రూ.50,200గా నిర్ణయించాలని అథికారుల కమిటీని ఆ కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నాయి.
ఈ పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం ఇంజనీర్లుగా పని చేస్తున్న వారు కూడా తమ పిల్లలను భవిష్యత్తులో ఇంజనీరింగు చదివించలేమంటున్నారు. పెరిగే ట్యూషన్‌ఫీజులు సామాన్యులు, మథ్యతరగతి వర్గాలను ఇంజనీరింగు, వైద్యవిద్యకు దూరం చేస్తాయని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.