కిరణ్ అసమర్ధత వల్లే రాష్ట్రం తరలిపోతున్న గ్యాస్
posted on Aug 5, 2012 7:04AM
ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసి మహారాష్ట్ర పొట్టనింపారని కేంద్రం చేసిన గ్యాస్ కేటాయింపులపై దుమారం లేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌క అవసరమైన విద్యుత్తు తయారీకి గ్యాస్‌ను కేటాయించకుండానే కేంద్రం మహారాష్ట్ర సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిందని విమర్శలు మిన్నంటుతున్నాయి. అసలు ఒక రాష్ట్రానికి అన్యాయం చేస్తూ పక్క రాష్ట్రానికి న్యాయం చేసే ఈ ఆలోచన వెనుక ఎవరి హస్తముందన్న దానిపై ఆంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రస్థాయిలో తాము చేసింది అన్యాయమని గుర్తించినందునే వివరణలు ఇస్తూ మంత్రిత్వశాఖ ప్రకటనలు గుప్పిస్తోందని మేథావులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర రత్నగిరి ప్లాంట్‌కు గ్యాస్ కేటాయింపు అనేది ఒక విధానం ప్రకారం జరిగిందేనని మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది. 2008లో నిర్ణయించిన గ్యాస్ వినియోగ విధానం ప్రకారమే రత్నగిరికి కేటాయింపులు చేశామని స్పష్టంగా ప్రకటనలో తెలియజేసింది. ఎరువుల కర్మాగారానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ గ్యాస్ ఇచ్చామని పెట్రోలియం మంత్రిత్వశాఖ తన ప్రకటనలో సరిపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎరువుల కర్మాగారాలు, చిన్న పరిశ్రమలు, విద్యుత్తు ఆథారిత వ్యాపారాలు మూతపడుతున్నాయి. దీనికి కారణం విద్యుత్తు సరఫరాలో కోతను పెంచటం, తయారీ తగ్గటం అనే అంశాలే అని గుర్తించారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌కు కూడా ఈ రెండు అంశాలపై రాష్ట్రప్రభుత్వం విన్నవించుకుంది.
ఈ సమస్యను ఖచ్చితంగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవార్ తన పవర్‌ను ఉపయోగించలేదని విమర్శలు మిన్నంటుతున్నాయి. ఇదేకాకుండా ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెడుతున్న గ్యాస్‌ను మళ్లించి విద్యుత్తు తయారీకి కేటాయింపులు చేయాలన్న సూచనలనూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ పక్కన పెట్టింది. అందుకే మహారాష్ట్ర రత్నగిరి ప్లాంట్‌కు గ్యాస్ కేటాయింపు చేసేసి ఇక్కడి సమస్యను మరిచిపోయింది. ఫలితంగా ఆంథ్రప్రదేశ్‌లో 400మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి గండిపడిరది. రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సామరస్యపూర్వకంగా విద్యుత్తు సమస్యను పరిష్కరిద్దామని కేంద్రంపై ఎటువంటి నిరసన గళం విప్పలేదు. అందుకే అంత యథేశ్ఛగా ఇక్కడి గ్యాస్ గుజరాత్‌కు చేరుతోందన్నది జగమెరిగిన సత్యం.
అతితక్కువ డిమాండు వ్యత్యాసం ఉన్నా రాష్ట్రం దాన్ని పూడ్చలేకపోవటం వెనుక సిఎం మెతకదనం ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కేంద్ర నాయకత్వం దృష్టికి సమస్య తీసుకెళితే పరిష్కారం అవుతుందని సిఎం భావించారే కానీ, ఎటువంటి చొరవ తీసుకోలేదన్నది ప్రస్తుత వాతావరణం నిరూపిస్తోంది. కనీసం దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి కేంద్రస్థాయిలో తీవ్రమైన కృషి ఈ నెలరోజుల్లో చేసి ఉంటే ఈపాటికి సమస్య పరిష్కారమయ్యేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా కెటిపిఎస్ విద్యుత్తు సాంకేతిక లోపం కూడా కోతల వేళలను పెంచేందుకు దోహదపడుతోందని సమాచారం. ఇలానే పరిస్థితి కొనసాగితే తెలుగుదేశంపై అథికారం కోసం కాంగ్రెస్ పార్టీ అప్పట్లో చేపట్టిన విద్యుత్తుదీక్షల యుద్ధం తిరిగి ప్రారంభమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిరసన గళాలు విప్పితేకానీ, విద్యుత్తు సమస్య పరిష్కారం కాదని ఇప్పటికే పలు పార్టీలు భావిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం తప్పిదం వల్ల కోత వచ్చింది కాబట్టి ఇది చేతకాని ప్రభుత్వం అని ప్రతిపక్షాలు నిరూపించేందుకు తగిన వాతావరణం ఇప్పుడుంది. దీన్ని గుర్తించైనా సిఎం, రాష్ట్రప్రభుత్వం వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని, పరిశ్రమలకు జరుగుతున్న వందల కోట్ల నష్టం భవిష్యత్తులో జరగకుండా చూడాలని రాజకీయపరిశీలకులు సూచిస్తున్నారు.