విజయమ్మ దీక్ష ఓ ఎత్తుగడేనా?
posted on Aug 5, 2012 @ 11:33AM
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి అలియాస్ విజయమ్మ బోధనాఫీజులపై ఏలూరులో చేపట్టిన నిరాహారదీక్ష వెనుక ఏమైనా ఎత్తుగడ ఉందా? ఈ ప్రశ్న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమవుతోంది. కేవలం ఎన్నికల సమయంలోనూ, అడపాదడపా ఆందోళనలు చేస్తున్న విజయమ్మ ఒక్కసారి విద్యార్థుల బోధనాఫీజుల గురించి ఆందోళన చేపట్టడం వెనుక బలీయమైన రాజకీయ కారణం ఉండే ఉంటుందని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పైగా రాష్ట్రప్రభుత్వం ఏకీకృత ఫీజుల విధానం గురించి తర్జనభర్జన పడుతున్న సమయంలో ఈ ఆందోళన చేపట్టడం పలువురి దృష్టిని ఆకర్షించటానికే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం లేనందు వల్ల దాన్ని ఏర్పాటు చేసుకునేందుకు వైకాపా అథ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఉస్మానియాయూనివర్సిటీని గతంలో టార్గెట్ చేశారు. ఇప్పుడు విజయమ్మ అన్ని జిల్లాలకు మధ్యస్తప్రాంతమైన ఏలూరులో దీక్ష చేపడుతున్నారు. ఇక్కడ దీక్ష చేపడితే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేయటం పెద్దపని కాదని ఆమె నమ్ముతున్నారు.
అందుకే ఈనెల 12,13తేదీల్లో దీక్ష చేస్తున్నామని ప్రకటించారు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన బోధనాఫీజుల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుకారుస్తోందని ఆమె విమర్శిస్తున్నారు. అర్హులైన పేదవిద్యార్థులకు ఫీజురీయంబర్స్‌మెంట్ వర్తింపజేయాలని డిమాండు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల మెస్‌ఛార్జీలు పెంచాలని డిమాండు చేశారు. ఈ డిమాండ్ల ఆధారంగా మైనార్టీ విద్యార్థులను, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ఆకర్షించేందుకు వైకాపా ఎత్తుగడ వేసిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.