విశాఖ ఉక్కుకు విద్యుత్తు దెబ్బ! ఆగిన ఉత్పత్తి?
posted on Aug 23, 2012 @ 11:36AM
ప్రపంచప్రఖ్యాత విశాఖ ఉక్కుకర్మాగారాన్ని విద్యుత్తుకోతలు దెబ్బతీస్తున్నాయి. ఈ కోతల కారణంగా బ్లాస్‌ఫర్నేస్ 1,2,3 యూనిట్లు పని చేయటం లేదు. దీని వల్ల ఆ మూడు యూనిట్ల ఉత్పత్తి ఆగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్టులో భారీ డిమాండు ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం విద్యుత్తు సంక్షోభం వల్ల నష్టాల దిశగా పయనించే అవకాశాలున్నాయని యాజమాన్య ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూడు యూనిట్ల ప్రభావం వల్ల ఇతర ప్రాంతాలకు ఉక్కు ఉత్పత్తి ఆగిపోతుందంటున్నారు. ప్రత్యేకించి కర్మాగారంలో పని చేసే కార్మికులకు వేతనం చెల్లించటం కూడా వృథా అనే పరిస్థితి విద్యుత్తుసంక్షోభం వల్ల ఏర్పడుతోంది. ఆ మూడు యూనిట్లు ఆగిపోవటం వల్ల తమ ఉపాథిని ప్రభుత్వమే దెబ్బ తీసిందని విశాఖ ఉక్కుకార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలుగువన్.కామ్’ ప్రతినిధితో మాట్లాడుతూ విద్యుత్తు సంక్షోభం ముదరితే పరిశ్రమలో పని చేసే కార్మికులందరికీ ఉపాథి సమస్య తప్పదంటున్నారు. ఉత్పాదనే లేకపోతే ఎగుమతులు అసాధ్యమని యాజమాన్యం ఆందోళనతో ఉందన్నారు. ప్రత్యేకించి పెద్దపరిశ్రమలకు విద్యుత్తు సరఫరా చేసే అంశం గురించి రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నారు. పరిశ్రమ సజావుగా నిర్వహించే అవకాశం ప్రభుత్వం కల్పించాలని డిమాండు చేస్తున్నారు.