పెరిగిన ఆటోఛార్జీలతో విసిగిన ప్రజలు?
posted on Aug 23, 2012 @ 11:10AM
ఒక్కసారిగా ఆటోఛార్జీల కనీస రుసుం రూ.16కు చేరుకుంది. 1.6కిలోమీటర్ల వరకూ ఈ 16రూపాయల ఛార్జీపై ప్రయాణం చేయవచ్చు. ఆపై ప్రతీ కిలోమీటరుకు రూ.9 లెక్కన చెల్లించాలి. ఇలా ఆటోఛార్జీ 10 కిలోమీటర్లకు రూ.92.50కు చేరుకుంది. ఇప్పుడు చెల్లిస్తున్న ఆటోఛార్జీలు చాలవని డ్రైవర్లు చేసిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఛార్జీలను మార్చింది. దీంతో ఆటోల కన్నా బస్సు ఛార్జీలే తక్కువ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇరవైరూపాయల్లోపు ఛార్జీతో బస్సులో ప్రయాణించే దూరానికి 92.50 రూపాయలు చెల్లించటం అవసరమా అని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు.
ఆటోఛార్జీలు భారీగా పెంచటం తమ వంటి నిత్య ప్రయాణీకులకు ఇబ్బందికరంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినమమ్ రూ.16చెల్లించి ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న తమ కార్యాలయానికి చేరుకోవటమూ అదనపు భారంగా ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం అర్థరాత్రి నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయి. దీన్ని తక్షణం అమలు చేసేస్తామని ఆటోడ్రైవర్లు అంటున్నారు. ఈ అర్ధరాత్రి తరువాతే ఈ ఛార్జీలను అమలు చేయాలని రవాణా శాఖాధికారులు కోరుతున్నారు. ఆటోడ్రైవర్లు ప్రభుత్వం తమ మొరవిని ఛార్జీలు పెంచినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రయాణీకులు మాత్రం తమకు ఆటోసౌకర్యం లేకుండా చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలానే మధ్యలో ఎక్కడైనా ఆటో ఆపితే వెయిటింగ్‌ఛార్జి నిమషానికి 25పైసల చొప్పున చెల్లించాలి. గరిష్టంగా వందకిలోల లగేజీని అనుమతించారు. దాన్ని దాటితే ప్రతీ వస్తువుకు 25పైసలు చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. ఈ పెంపుదలకు అనుగుణంగా మీటర్లలో మార్పులు చేయాలని సిఎం రవాణాశాఖా ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు.