ఏం పలుకులవిలే... అయ్యారే!
posted on Aug 23, 2012 @ 2:39PM
‘ఆహారపదార్ధాల ధరల పెరుగుదల యూపిఎకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది. పప్పు, ధాన్యం, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలతో రైతులకు లబ్ది చేకూరుతోంది. దీని పట్ల యూపిఎ ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది’ అని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణి ప్రసాద్ వర్మ ధరల పెరుగుదలపై పాత్రికేయులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ జవాబిచ్చారు. అయ్యారే! ఏం సెలవిచ్చారు. ఇంకా ఏమైనా అడిగితే మా పాలన స్వర్ణయుగమని, మాది కృష్ణదేవరాయల పాలనని ఇలా... వారిని కూడా తీసుకువచ్చేస్తారు. ధరల పెరుగుదలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ... దానివల్ల రైతులకు లబ్ది చేకూరునుందని పొంతన లేని జవాబులిచ్చారు. ఇంకా..ధరల పెరుగుదలపై మీడియా అతి చేస్తోంది. ధరల పెరుగుదలతో రైతులకే లాభం చేకూరుతోంది. రైతులకు మేలుచేయడమే మా ప్రభుత్వ లక్ష్యం..’ అని అన్నారు.
ఈ మంత్రిగారి వరస చూస్తుంటే ధరలు పెరిగితే రైతులకు మేలు జరుగుతుందని చెప్పినట్లుగా ఈ శాఖకు సంబంధించిన సరుకుల, ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆయా పారిశ్రామిక వేత్తలకు లాభం, దానివల్ల సంబంధిత పారిశ్రామికవేత్తలకు లాభాలు వస్తాయని, వారు మరిన్ని కంపెనీలు పెడతారని.. కూడా అంటారు. రైతులకు లాభాలు రావాలంటే వారు పంటలు పండిరచేందుకు కావలసిన ఎరువులు, విత్తనాలు, విద్యుత్, పంటరుణాలను వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, నిజాయితీగా వారికి అందజేయడం, ప్రకృతి విపత్తుల వల్ల పంటనష్టం వస్తే.... వారికి చేయూతనిస్తే చాలు. అయినా... మంత్రిగారి మాటలు కాని.. రైతులకు లాభాలు ఎలా అందుతాయి..? మధ్య డేగల్లాగా దళారులుంటే...?! కనుక లాభాలు వచ్చినా అవి రైతులకు వరకు చేరడమన్నది ఓ వింతే. రైతులు కూడా సామాన్యుల లాగానే మార్కెట్లో కొనుక్కొవలసిందే. అటువంటప్పుడు రైతులు ఎలా సంతోషంగా ఉంటారు.? సదరు మంత్రిగారు గ్రామంలోని ఓ సామాన్య రైతుకుటుంబం ప్రక్కనే కేవలం ఓ పదివేల జీతంతో (ఈ డబ్బు ఎక్కువే అనుకోండి) కుటుంబంతో సహా నివాసముంటూ ఇంటిల్లిపాదిని ఓ మూడునెలలు పోషించినట్లయితే తెలుస్తుంది ధరలు ఎంత మండుతున్నాయో.. సామాన్యుడి కడుపు ఎంత మండిపోతోందో..! రైతన్న ఓ సామాన్యుడు.. నేతల మాటలకు, అధికారుల హామీలకు మోసపోవడం మాత్రమే పాపం అతనికి తెలుసు.