సాంప్రదాయంగా గొర్రెపొట్టేళ్ల పందేలు?
posted on Aug 22, 2012 @ 3:59PM
భారతీయసాంప్రదాయం ఎంతో ప్రాచీనమైంది. ఆ ప్రాచీన సాంప్రదాయంలోనే ధనవంతులు కోరినట్లు పోటీలు, పందేలు జరిగేవి. భారీగా డబ్బును ఈ పందేల్లో పెట్టడం కూడా ఆనవాయితీ అయింది. అటువంటి కోవలోనే గొర్రెపొట్టేళ్ల పందేళ్లు జరుగుతుండేవి. ఇంకా ప్రాచీన సాంప్రదాయాన్ని పాటించే ప్రాంతాల్లో ఈ పందేళ్లు జరుగుతుంటాయి. ధనవంతులు తమ ఇళ్లల్లో పెంచిన గొర్రెపొట్టేళ్లతో ఇతర గ్రామాల పెద్దలను పందేనికి పిలిచే ఆనవాయితీ ఇంకా వెనుకబడిన జిల్లాల్లో కొనసాగుతూనే ఉంది.
ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమగోదావరి వంటి జిల్లాల్లో ఎడ్లపందేలు, గుర్రపుపందేలు, కోళ్లపందేలు, గొర్రెపొట్టేళ్ల పందేలు తరుచుగా వార్తలకెక్కుతుంటాయి. ఈ నాలుగైదు జిల్లాల్లో డబ్బున్న వారి ఈ పందేలు చూసేందుకు గ్రామీణులు ప్రేక్షకులు అవుతుంటారు. అలానే కొందరు కాపరులు ఈ పందేల కోసం గొర్రెపొట్టేళ్లకు శిక్షణలు కూడా ఇస్తుంటారు. తాజాగా విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఎన్.నర్సాపురంలో గొర్రెపొట్టేళ్ల పోటీ పందెం జరిగింది. దీనిపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 30మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 50వేల రూపాయలు, 20సెల్‌ఫోన్లు, ఆరుఆటోలు స్వాధీనపరుచుకున్నారు. ఈ దాడికి వచ్చిన పోలీసులను గుర్తించి కొందరు పందెం స్థలం నుంచి పారిపోయారని తెలుస్తోంది.