కోడిమాంసంపై మార్కెట్టుసెస్ ఎత్తివేత
posted on Aug 23, 2012 @ 11:59AM
ఎట్టకేలకు గుడ్డు, కోడిమాంసంపై రాష్ట్రప్రభుత్వం విధించే మార్కెట్టుసెస్‌ను ఎత్తివేసింది. ఈ సెస్ వల్ల ధర పెరిగి వినియోగదారునిపై అదనపు భారం పడుతోందన్న ఉత్పాదకుల సూచనను రాష్ట్రప్రభుత్వం పరిశీలించింది. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దీనిపై స్పందించి మార్కెట్టుసెస్(సుంకం) ఎత్తివేయాలని ఆదేశించారు. అలానే మత్స్య, కోళ్ల రంగాలకు నాలా రద్దు చేసి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలుగా గుర్తించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ఈ రెండు రంగాలు అభివృద్థి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని సిఎం ఆదేశించారు.
దీంతో ఈ రెండు రంగాలకు బ్యాంకు రుణాలు లభించే అవకాశాలూ మెరగుపడ్డాయి. ప్రత్యేకించి ఈ రంగం విస్తరించేందుకు ఈ ఉత్తర్వులు దోహదపడతాయని ఈ రంగ పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. గుడ్డు, కోడిమాంసం ధరలను నియంత్రించేందుకు మార్కెట్టుసెస్ ఎత్తివేత ఉపయోగపడుతోందని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వపథకాలు తమ రంగానికి అందుబాటులోకి తెస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సిఎం దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు. రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే గుడ్డు, కోడిమాంసం వినియోగం పెరిగిందని, దానికి తగ్గట్టుగా తాము ఏర్పాట్లు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం గుడ్డుపై చేసే ప్రచారం ఇంకా పెంచితే ప్రజలకు అది పౌష్టికాహారమన్న విషయంపై అవగాహన కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.