ఏపిబీసిఎల్ షాపులకు ఆదిలోనే హంసపాదు?
posted on Aug 23, 2012 @ 12:17PM
రంగారెడ్డి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పొరేషను లిమిటెడ్ మద్యం దుకాణాల ఏర్పాటుకు స్థలం కొరత ఆటంకంగా ఏర్పడిరది. మొత్తం 21దుకాణాలకు 14స్థలాల కోసం ధరఖాస్తులు వచ్చాయి. ఆరుగురు విశ్రాంత ఉద్యోగులు ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వాటికి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా రిక్రూట్‌మెంట్లు చేయాలని కార్పొరేషను నిశ్చయించుకుంది. ఈ మేరకు ఔట్‌సోర్సింగు ఏజెన్సీలకు పిలుపులు కూడా ఇచ్చింది. ఈ ఏజెన్సీలకు ఉద్యోగుల అవసరాన్ని తెలియజేసి దానికి తగ్గట్టుగా కోడ్ చేయాలని కార్పొరేషను ఆదేశాలు కూడా ఇచ్చింది.
వాస్తవానికి జిల్లా మొత్తం 390 మద్యం దుకాణాలు మంజూరయ్యాయి. వీటిలో నగరశివారుల్లో 96షాపులకు ధరఖాస్తులు అందలేదు. ఇక్కడ దుకాణం ఏర్పాటు చేయాలంటే ఒక్కొక్కదాని విలువ రూ.1.04కోట్లు. అంతవెచ్చించి దుకాణం ఏర్పాటు చేశాక లాభం వస్తుందా? లేదా? అన్న అంశంపై చాలా మంది వెనక్కితగ్గారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్పొరేషను స్వయంగా దుకాణాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఈ 96 దుకాణాల స్థానంలో 21ఏపీబిసీఎల్ షాపులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ 96 దుకాణాల సెంటర్లకు మధ్యస్థంగా ఉండేలా ఈ 26దుకాణాలను ఎంపిక చేశారు. స్వయంగా కార్పొరేషను నడిపే ఈ దుకాణాలు గురించి ఎన్ని ప్రకటనలు చేసినా విశ్రాంతి ఉద్యోగులు కూడా అంతగా స్పందించలేదు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో ఔట్‌సోర్సింగ్ సహాయంతో దుకాణాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. అలానే రెండో ఫేజ్ కింద మరో మూడు దుకాణాలకు శాఖ కమిషనర్ సమీర్‌శర్మ ఆదేశాలు ఇచ్చారు.