ఇక పాతకాలమే బెటర్!
posted on Aug 23, 2012 @ 2:53PM
సామాన్యుడిపై మరోసారి ఇంధనభారం మోపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వచ్చే నెలలో పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయసంస్థలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లీటర్‌పెట్రోల్‌కు 3 రూపాయలు, డీజిల్‌పై 4నుండి 5 రూపాయలకు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు వంటగ్యాస్ ధరలను కూడా 50 నుండి 100 రూపాయల లోపు పెంచే అవకాశం ఉంది. అలాగే సబ్సిడీపై ఇచ్చే సిలిండర్ల సంఖ్యను నాలుగుకు పరిమితం చేసే అవకాశం ఉంది. అయితే ఏం ఆలోచనలో ఉందో పాపం.. కిరోసిన్‌ను మాత్రం ఈ ధరల పెంపునుండి మినహాయించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం వరస చూస్తుంటే సామాన్యుడు వినియోగించే గ్యాస్‌అంటేనే వారికి ఎంతో ప్రేమ అనిపిస్తోంది. నష్టాలనో, ఆదాయం లేదనో ఇలా.. పలు కారణాలు చెప్పి వడ్డించేస్తున్నారు. ప్రభుత్వంలో ఎందరో ఆర్ధిక మేధావులున్నారు. సామాన్యులు వాడే గ్యాస్ తదితరాలను పెంచకుండా ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలో వారిని అడిగితే చెబుతారు.
యేరులై పారుతున్న నల్లధనాన్ని పట్టి ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలపై భారంపడకుండా దాన్ని ఉపయోగించవచ్చు. ఇలా ఏడాదికి నాలుగైదు సార్లు పెట్రోలు, గ్యాస్, కరెంట్ ధరలు పెంచుతూ పోతే ఇక సామాన్యుడు .. తిరిగి పాతకాలంలోనే వెళ్ళవస్తుంది. అదేనండీ.. ఎడ్లబండ్లు, గుర్రపుబండ్లు, కట్టెలపొయ్యిలు, తదితరాలు. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సామాన్యుడు అదే బెటర్ అనుకుంటాడు. అప్పుడు ప్రభుత్వానికి ఏ ఖర్చు ఉండదు. అంతా ఆదాయమే. మంత్రివర్గంలో ఎంతమందినైనా చేర్చుకోవచ్చు. ఎన్ని సౌకర్యాలైనా కల్పించవచ్చు. ఎన్ని కుంభకోణాలైనా చెయ్యవచ్చు... సామాన్యుడు ఏమైపోతే వారికేం...! వారు చల్లగా ఉంటే చాలు...