ప్రత్యేక కోర్టుకి ఎమార్ ఎండీ వినతి
posted on Aug 22, 2012 @ 8:13PM
సీబీఐ చార్జ్ షీట్ లో 15వ నిందితుడిగా ఉన్న ఎమార్ ఎంజీఎఫ్ ల్యాండ్ ఎండీ శ్రవణ్ గుప్తా తనను విచారణ జరిపేటప్పుడు వీడియో తీయించాలని ప్రత్యేక కోర్టుకి విన్నవించుకున్నారు. విచారణ పారదర్శకంగా జరగాలన్న ఆశతోనే తను ఇలా కోరుతున్నానని శ్రవణ్ కోర్టుకి తెలిపారు. ఆగస్ట్ 24 నుంచి నిందితుడిని సీబీఐ ప్రశ్నించే అవకాశముంది. సీబీఐ మాత్రం ఈ వాదనను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. స్థలాల్ని అమ్ముకుని సొమ్ముచేసుకోవడంలో ఆరితేరిన చాకచక్యం చూపించిన నిందితుడి వాదనకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సీబీఐ డెప్యూటీ లీగల్ అడ్వయిజర్ రవీంద్రనాథ్ వాదించారు. విచారణ జరిగేటప్పుడు తన న్యాయవాది పక్కనే ఉండాలంటూ శ్రవణ్ అర్జీపెట్టుకోవడంకూడా హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు. మహామేధావి అయిన శ్రవణ్ కు విచారణ సమయంలో లాయర్ అవసరం లేదన్నారు. ఇప్పటికే సీబీఐ శ్రవణ్ ని విచారించేందుకు ఓ ప్రశ్నావళిని సిద్ధం చేసిందని, ఆయన ఆ ప్రశ్నలకు సమాధానం చెబితే సరిపోతుంది కనుక వీడియో తీయించడం లేదా విచారణ జరిగేటప్పుడు వ్యక్తిగత న్యాయవాదిని అనుమతించడంలాంటి సౌకర్యాలు అవసరం లేదని సీబీఐ లీగల్ అడ్వయిజర్ ప్రత్యేక న్యాయస్థానానికి విన్నవించారు.