కార్యకర్తలే కాంట్రాక్టర్లుగా చెలామణి
posted on Aug 25, 2012 @ 9:31AM
రాష్ట్రంలో పనికి ఆహార పధకం క్రింద గ్రామీణ ప్రాంతాలలో 100 రోజుల పనులను కేంద్రం చేపట్టటం తెలిసిందే . దీనికి గానూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నిధులను కెటాయించి ఆయా జిల్లాల మండల కేంద్రాలలో పనులు చేయిస్తుంటారు. అయితే దీన్ని అధికార పార్టీ చేతుల్లో ఉండటంవల్ల ఆయా మండలాలలో కార్యకర్తలే కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతున్నారు .దీంతో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి, అభివృద్ది పధకాల పేరిట అధికార పార్టీ కార్యకర్తలు కాంట్రాక్టులు దక్కించుకోవడంతో అడిగేవారు లేరనే ధీమాతో నాణ్యతలేని పనులుచేసి, నిధులు బొక్కేస్తున్నారన్నారు. ఎందుకూ పనికి రాని రోడ్లువేసి నాయకులు దోచుకు తింటున్నారని ప్రజలు వాపోతున్నారు. నాణ్యతలేని రోడ్లు, తూతూ మంత్రంగా నాణ్యతలేని కంకరతో నిర్మించడంవల్ల వేసిన నెలకే అస్ధవ్యస్దంగా తయారవుతున్నాయి. దీంతో వర్షాకాలంలో వర్షాలకు స్ధానికులు ఆరోడ్లనుండి వెళ్లటానికి నానా అవస్దలూ పడుతున్నారు.ఇవేకాకుండా చెరువులు, కంకరరోడ్లు,గ్రావెల్‌రోడ్లు, మెటల్‌రోడ్ల మరమ్మతుల పేరు చెప్పి ఎన్‌ఆర్‌జిసి నిధులు దొడ్డిదారిని కాంట్రాక్టర్లు,ప్రభుత్వాధికారలు దోచేస్తున్నారని గ్రామీణులు వాపోతున్నారు. దీని పై ఆయా జిల్లా అధికారులు పర్యవేక్షించి నాణ్యతలేని పనులను సమీక్షించి సంబంధిత అధికారలపై చర్యలు తీసుకొని ప్రభుత్వ నిధులు గోల్‌మాల్ కాకుండా ప్రజలకు ఉపయోగ పడేవిధంగా చర్యలు చేపట్టాలని స్ధానికులు కోరుతున్నారు.