ఏమిటీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అక్రమంగా నడుపుతున్నారా?
posted on Aug 25, 2012 8:56AM
ఈ ప్రశ్న విలేకరులను ఆర్‌టిఓ కార్యాలయంలో అధికారులు రివర్సుగేరులో తరుచుగా వదులుతుంటారు. అయితే ఈసారి అందరూ రవాణాశాఖాధికారులను ఈ ప్రశ్న అడగవచ్చు. ఎందుకంటే వారు తాజాగా హైదరాబాద్ నగరశివార్లలో బెంగుళూరు జాతీయరహదారిపై తనిఖీలు చేపట్టి ఐదు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. ఇవి నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్నారని అధికారులే స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా ఆ బస్సులను స్వాధీనం కూడా చేసుకున్నారు. అంటే అక్రమపద్దతి కొనసాగుతోందని రవాణాశాఖాధికారులు కూడా అంగీకరించినట్లే కదా! ఒక వేళ అంగీకరించకపోయుంటే ఆ బస్సులు స్వాధీనం చేసుకునేవారే కాదు కదా! ఇంత కాలం వారికి కనిపించని ఈ ఉల్లంఘనలు ఇప్పుడు ఎందుకు రవాణాశాఖాధికార్లకు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి దాడుల్లోనే గుర్తించేంతలా రవాణాఅధికారుల ఐక్యూ ఎప్పుడు పెరిగింది? రాష్ట్రంలోని కీలకమైన కొన్ని జిల్లాల్లో రవాణాశాఖాధికారులను ఏ విలేకరి అయినా ప్రశ్నిస్తే పాపం! ప్రైవేటు ట్రావెల్స్ వారు తమ పొట్ట నింపుకోవటానికి నానాపాట్లు పడుతున్నారని అంటుండేవారు. అలా కాదండీ బాబూ ఒకే బస్సు నెంబరుతో రెండేసి ట్రావెల్స్ బస్సులు బయటకు వెళుతున్నాయంటే బతుకుదెరువు కద సార్! అనేవారు. మరి రవాణాశాఖాధికారులు ఎందుకు ఇంత నిర్దయగా మారిపోయారు? ఎవరికీ చెప్పలేని అవసరాల వల్ల రవాణాశాఖాధికారులు లొంగిపోయారా? ఈ ప్రశ్నలకు ఆ శాఖాధికారులే సమాధానాలు రాబట్టుకుంటే బాగుంటుంది.