పడకేసిన గురుకులాలు
posted on Aug 25, 2012 9:13AM
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో జ్వరాలు విజృంభించడం వల్ల విద్యార్దులు జ్వరాలకు తట్టుకోలేక ఇళ్లకు వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న వారిలో సగం మంది జ్వరంతో ఉన్నారు. ఇరుకు గదులు, వర్షం వస్తే అన్నీ ధారలుగా కురవాల్సిందే. అయినా చేసేదేమీ లేక ఒక్కోగదిలో దాదాపు 20 మంది చిన్నారులను కుక్కుతున్నారు. దానికి తోడు కిటికీ అద్దాలు పగిలి రాత్రిళ్లు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. తాగేందుకు రక్షిత మంచి నీరులేదు. ఆవరణలో ఉన్న బోరింగో లేదా చెరువులో గతి. వారానికి ఒక్కసారి కూడా క్లోరినేషన్ చేసే దిక్కులేదు. హాస్టల్ పరిసరాలు కూడా అపరిశుబ్రంగా ఉన్నాయి.ఒక్కసారి హాస్టల్ భవనాన్ని చూస్తే భూత్‌బంగాళాగా కనిపిస్తుంటాయి. ఇటీవలే ఇందిరమ్మబాటకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, ఖమ్మంజిల్లా హాస్టల్‌లో ఒక్కరోజు భోజనం చేసి అక్కడే బస చేశారు. వసతి గృహంలో ఇబ్బందులను తొలగించాలని అధికారులకు ఆదేశించారు అయినా ఫలితం శూన్యం. రాష్ట్రంలోని గురుకులాల్లో జ్వరాల బారిన పడిన పిల్లలను క్రిందనే పడుకోబెడుతున్నారు. మంచాలన్నీ తుప్పుపట్టి వాటిపై దుప్పట్లు లేకుండా ఉండటమే దానికి కారణం. నిబంధనల ప్రకారం ప్రభుత్వవైదునితో ప్రతినెలా గురుకులాల్లోని విద్యార్దులకు వైద్య పరీక్షలు చేయాలి.అయితే ఇంతవరకు అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. మైదాన ప్రాంత గురుకులాల్లోనూ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ విద్యార్దుల పరిస్దితి ఇలాగే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు చేపట్టాలని విద్యార్ధులు కోరుతున్నారు