అంతా మా ఇష్టం
posted on Aug 26, 2012 @ 2:06PM
తాము కోరిన పదవి ఇవ్వలేదనో, తామడిగిన పనిచేయించలేదనో... వంటి కారణాలతో ఒకరో, ఇద్దరో మంత్రులు రాజీనామాలు చేయడం మనదేశంలో పరిపాటి. అయితే రాష్ట్రంలో గత ఆరేళ్ళకాలంలో అధిక సంఖ్యలో ఎం.ఎల్.ఎ.లు రాజీనామా చేశారని తెలిసి బ్రిటీష్ పార్లమెంటరీ ప్రతినిధుల బృందం ఆసక్తిని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఎంపి సర్ అలెన్ హసల్ హర్ట్స్ నేతృత్వంలో 11 మంది ప్రతినిధుల బృందం అసెంబ్లీ సందర్శించి, కమిటీ హాలులో శాసనమండలి ఛైర్మన్, స్పీకర్, పలు పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశమయింది. అసెంబ్లీ చరిత్ర, ప్రత్యేకతలను తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో గత ఆరేళ్ళలో 60 ఉప ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళితో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని చెప్పగా... అన్నిసార్లుఎందుకు జరిగాయంటూ బ్రిటీష్ ప్రతినిధులు ఆరా తీశారు. ఆయా కారణాలను వారు చెప్పగా తమ దేశంలో ఒకే ఒక్కసారి ఒక ఎం.పి. రాజీనామా చేస్తేనే అంతా ఆశ్చర్యపోయారంటూ బ్రిటీష్ ప్రతినిధులు మరింత ఆశ్చర్యంగా అన్నారట...!
ఎన్నుకున్నది పాపం పిచ్చి ప్రజలం మేమే అయినా.. ఎన్నికైన తర్వాత అంతా గెలిచిన మా అభ్యర్ధి ఇష్టం. అడిగే అధికారం లేదు! అడిగే ధైర్యం లేదు...! రాజీనామా చేసి ఉప ఎన్నికను కోరడానికి గల కారణాలు సముచితమైనా, కాకపోయినా.. అదంతా వారి ఇష్టమే. వారు రాజీనామా చేసిన మరుక్షణం మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టాల్సిందే..! గెలిచేందుకు వారు వారి డబ్బులు ఎలాగైనా ఖర్చుపెడతారు ` గెలుపే ప్రధానలక్ష్యంగా...! అయితే ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరించాలి...! ఇదీ ప్రజాస్వామ్య తీరు...! ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు అంటారు కాని.. అసలు నిర్ణయాలు ముందే అయిపోతే... ఇక ప్రజా నిర్ణయమేంటీ...వారి ఆకాంక్షలేంటీ...!? `పెద్ద భేతాళప్రశ్నేమరి! ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన వారు, వారి బంధు గణాలే ప్రజలు. మిగిలిన సామాన్యులు అంతా వారి వారి చేతుల్లో ఆటబొమ్మలే..! ఇవన్నీ తెలియకుండా, తెలుసుకోకుండా బ్రిటన్ ప్రతినిధుల బృందం అంత ఆశ్చర్యపోతే ఎలా!