ఊ కొట్టేదెవరో... ఉలిక్కిపడేదెవరో...!
posted on Aug 25, 2012 @ 9:37AM
రాజకీయాలంటే చదరంగం లాంటివని కొందరంటే... వైకుంఠపాళి ఆటలాంటిదని మరికొందరంటారు. ఎవరేమన్నా.. జనవాక్యం మాత్రం ఈ రెండు ఆటలు కలిపితేనే రాజకీయా లంటుంది. ఎన్నికల సమయంలో వైకుంఠపాళి ఆటలాంటిది. ప్రత్యర్ధుల బలాబలాలను బేరీజువేసుకుని నిచ్చెనల ఎక్కుతూ ఎవరు గెలుస్తారో.. ఇతరుల బలాబలాలను అంచనా వేయకుండా ఓటమి పామునోట్లో చిక్కి ఎవరు ఓడిపోతారో.. అదంతా పరమపదసోపానమే! రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తే తప్ప లేకుంటే... పెత్తనమంతా కేంద్రంలోవుండే అధినాయకుల చేతల్లో, చేతుల్లోనే ఉండి పాలన సాగుతుంది.
తుమ్మినా, దగ్గినా ఢల్లీకి ప్రయాణం కట్టాల్సిందే. ఇలాంటి ప్రయాణాలకే రాష్ట్ర ఖజానాలో సొమ్ము సగం ఖర్చవుతుందే మోనని సామాన్యుల అనుమానం. అసలు సంగతేమిటయ్యా అంటే.. ధర్మానగారి రాజీనామా నేపథ్యంలో సి.ఎం. మొదలు మంత్రులు, రాష్ట్ర అధ్యక్ష పదవుల వరకు ఎవరూ ఉంటారో, ఎవరు ఊడతారో... తెలియదు. అధిష్టానం వద్ద తమ పలుకుబడిని ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తే వారికే ఆయా పదవులు అన్నది జగద్విదితం. మహాభారతంలోని రాజకీయ ఘట్టాలకు ఏ మాత్రం తీసిపోవు హస్తిన రాజకీయాలు. బొత్సకు ఉద్వాసన...? సిఎం. స్థానానికి ఎసరా? కొత్తగా పిసిసి చీఫ్‌గా ఎవరు ఎన్నికవుతారు? మంత్రుల్లో ఎవరికి ఉద్వాసన..? ఇవన్నీ ప్రజలకు కాకపోయినా కాంగ్రెస్‌పార్టీలోని నాయకులను వేధిస్తున్న యక్షప్రశ్నలు...!
ఇవి ఇప్పుడే రావడానికి ప్రధాన కారణాలు ‘తెలంగాణా ఉద్యమ తీవ్రత, జగన్‌పై సిబిఐ కేసుల వ్యవహారం, పెద్దాయన మంత్రివర్గంలో వున్న పలువురు మంత్రులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణల గోల.. తదితరాలు. ఎంత మెజారిటీతో ఎన్నికైనా స్వంత వ్యక్తిత్వమంటూ లేకుండా తుమ్మినా.. దగ్గినా రాజధాని విమానమెక్కేయడం... ఎన్నికయ్యేందుకు... ఎన్నికైన తర్వాత కృతజ్ఞతలు తెలిపేందుకు.. వచ్చిన పదవిని కాపాడుకునేందుకు విమాన ప్రయాణాలు...! ఇంట్లో తనకిష్టమైన కూరచేయించుకు తినాలన్నా.. అమ్మదయ కావాల్సిందే... అన్నట్లుగా ఉంటున్నాయి కాంగ్రెస్ పార్టీలోని నేతల తీరు! అమ్మ చెప్పిన దానికి ఎంతమంది నేతలు ఊ కొడతారో... అమ్మనిర్ణయానికి ఎంతమంది ఊలిక్కిపడతారో... వేచిచూడాల్సిందే..!