కిరణ్ కుమార్ రెడ్డేమైనా హరిశ్చంద్రుడా?
posted on Aug 26, 2012 @ 1:53PM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వై.ఎస్ .ఆర్ కాంగ్రెస్ పార్టీ వీలుచిక్కినప్పుడల్లా దుమ్మెత్తి పోస్తోంది. జగన్ కి అధికార పీఠ ం దక్కేవరకూ నిద్రపోయేదిలేదన్న రీతిలో ఆ పార్టీలో ఉన్న వందిమాగధులు సమయం చిక్కినప్పుడల్లా చిక్కటి విమర్శల్ని కుప్పపోసి అవతలివాళ్లమీద గుమ్మరించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇలాంటి పనులు చేయడంలో సిద్ధహస్తుడైన అంబటి రాంబాబు మాటల తూటాలు పేలుస్తూ సీఎంని మరింత ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి.. రోమ్న నగరం తగలబడుతున్నప్పుడు ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని అంబటి రాంబాబు తాజాగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రం అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి, మంత్రులు పదవులు కాపాడుకునేందుకు ఢిల్లీచుట్టూ చక్కర్లు కొడుతున్నారని ప్రతిపక్షాలతోపాటు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకూడా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. జగన్ కి బెయిల్ రాకుండా చూసేందుకు కాంగ్రెస్ నేతలు గల్లీనుంచి ఢిల్లీదాకా తిరుగుతూ విశ్వప్రయత్నం చేస్తున్నారని జగన్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకు తమ పదవులు కాపాడుకోవడంకంటే జగన్ బైటికి రాకుండా చూడడమే పెద్ద ఎజెండాగా మారిందని జగన్ పార్టీ నేతలు అంటున్నారు.