అంతా అమ్మదయే!
posted on Aug 28, 2012 @ 4:57PM
రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా బలహీనపడిపోయింది. అధిష్ఠానం ఆజ్ఞల్ని శిరసావహిస్తూ, సోనియా అడుగులకు మడుగులొత్తుతూ ఉండేవాళ్లు మాత్రమే పదవుల్లో ఉంటారన్న విషయం అందరికీ అర్థమైపోయింది. అందుకే ఎవరూ ఏం మాట్లాడ్డంలేదు. ఢిల్లీకెళ్లి చేతులు కట్టుకుని నిలబడ్డం తప్ప స్టేట్ లీడర్లు సాధించగలిగేదేం లేదన్న విషయం ప్రజలక్కూడా పూర్తిగా అర్థమైపోయింది. ఎలాంటి మార్పులు చేర్చులు జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నట్టుగా అంతా అన్నింటికీ సిద్దపడే కూర్చున్నారు. కాకుంటే ఎవరి కుర్చీని కాపాడుకోవడానికి వాళ్లు ఢిల్లీ చుట్టూ పదిసార్లు ప్రదక్షిణలు చేసి అమ్మదయకోసం పాకులాడుతున్నారు. పైకిమాత్రం మేకపోతు గాంభీర్యం.. మంత్రులతో కిరణ్ రెండుసార్లు సమావేశమయ్యారు. పిసిసి చీఫ్ బొత్స మూడసార్లు పార్టీలోని కీలక నేతల్నికలిసి మాట్లాడారు. డెప్యూటీ సీఎం, చిరంజీవితో ఓసారి, ముఖ్యమంత్రితో ఓ సారి మాట్లాడారు. సీఎం, పిసిసి చీఫ్ గవర్నర్ తో విడివిడిగా భేటీ అయ్యారు. ఇన్ని భేటీల తర్వాత తేలిన విషయం ఏంటయ్యా అంటే మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో త్వరలో పెద్దఎత్తున మార్పులు చేర్పులు జరుగుతాయన్న ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయో, అధిష్ఠానం ఎవరికి అవకాశమిస్తుందో, ఎవరికి ఎర్త్ పెడుతుందో తెలియక అంతా జుట్లు పీక్కుంటున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఒకళ్లతో ఒకళ్లు బాధను పంచుకుంటూ పైకిమాత్రం అవేవో పేద్ద ప్రాముఖ్యమున్న భేటీల్లా ఫోజులిస్తున్నారు. ఎవరేమనుకున్నా చివరికి అమ్మచెప్పిన మాటే ఫైనల్. ఎవరెన్ని తిట్టుకున్నా చివరికి అమ్మ తీసుకున్న నిర్ణయమే ఫైనల్.. అంతా అమ్మదయమీదే ఆధారపడుంది.