రాహుల్ మార్క్ పిసిసి ప్రెసిడెంట్
posted on Aug 28, 2012 @ 4:55PM
కాంగ్రెస్ లో రాబోయే తరానికి కాబోయే మహారాజుగా చెలామణీ అవుతున్న రాహుల్ గాంధీ.. రాష్ట్ర రాజకీయాలమీదకూడా అప్పుడప్పుడూ దృష్టి సారిస్తున్నారు. ఆరునెల్లపాటు గట్టిగా శోధించి పీసీసీ పీఠానికి సరిపోయే వ్యక్తిని ఆయన ఎంపిక చేశారు. ఎవరికి అవకాశం దక్కబోతోందన్న విషయాన్ని మాత్రం ఆయన సీక్రెట్ గా ఉంచారు. ఎంతమంది ఎన్నిరకాలుగా తలల పగలగొట్టుకుని ఆలోచించినా రాహుల్ మదిలో ఉన్న ఆ కొత్త పిసిసి చీఫ్ ఎవరన్న విషయం మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. ముద్దులకొడుకు ఏపీ రాజకీయాలపై ఇంతగా పట్టుసాధించిన విషయం తెలుసుకున్న సోనియా తెగ మురిసి పోతున్నారు. సమర్ధుడైన నేత ఉండాలో చెప్పేందుకు రాహుల్ పీకుతున్న క్లాసులుకూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తెగ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కొందరైతే నేరుగా ఢిల్లీలోనే మకాంపెట్టి రాహుల్ మనసును గెలుచుకున్న ఆ మరో నేత ఎవరన్న విషయాన్ని తెలుసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అదృష్టం అడ్డదారిలో కలిసొచ్చి రాహుల్ తమపేరు చెబుతాడేమోఅన్న ఆశ చాలామంది నేతలకు రోజురోజుకీ పెరగిపోతోంది.