విస్తరిస్తున్న మాఫియా రంగం

అదేదో విభిన్నమైన రంగం విస్తరిస్తోంది అన్నట్లుగా ‘మాఫియా రంగం’ అనేది మరో రంగం అనుకుంటున్నారా? అదేంకాదు. ప్రతి రంగంలోను అక్రమాలు చోటుచేసుకోవడం, నిలువరించే ప్రయత్నంలో దానికి విరుద్దంగా అందలి మనుషులు మాఫియాలా వ్యవహరించడం జరుగుతోంది. వంగూరు మండలంలోని డిరడి చింతపల్లిలో కుప్పలుగా పోసిన ఇసుక డంప్‌లను సీజ్‌ చేయడానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారిని హెచ్చరించారు. అలాగే డిరడిచింతపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న మాఫియాను అడ్డగించిన ఓప్రభుత్వ అధికారిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపుతామని హెచ్చరించారట. అధికారులని లేదు, మీడియా అని లేదు, ఎవరైనా వారికి ఒకటే. వారి దందాకు అడ్డు వస్తే కష్టాలు తప్పవు. ఇలాంటి సంఘటనలు ఎన్నో. రాష్ట్రంలో ఇసుకమాఫియా పెరిగిపోతోంది. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నట్లో ప్రజలకు అర్ధంకావడంలేదు. ఇటువంటివారి ఆస్తులను స్వాధీనం చేసుకుని ఖజానాకు జమచేసుకుంటే ప్రజలపై కరెంటు, గ్యాస్‌ వంటి నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని కొద్దిగానైనా తగ్గించవచ్చు కదా? అన్నది సామాన్యుడి సందేహం. అయినా` ప్రభుత్వ నేతలే అవినీతి, అక్రమ సంపాదనలను పెంచిపోషిస్తున్నారన్న ఆరోపణలతో కేసులతో సతమతమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాందాందార్లను కట్టడిచెయ్యడం రాష్ట్ర సర్కారుకు సాధ్యంకాని పనంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.

ఇప్పటికైతే... ఓ.కె.!

ఈ మధ్యకాలంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా అంతా ఊగిసలాటధోరణే. ఏ క్షణంలో పడిపోతుందో తెలియదు, ఏ క్షణంలో ఎవరు అండగా వుంటామని వచ్చి చేతికి చేయూత ఇస్తారో తెలియదు. సినిమాలో ఒక్కరే అని పాత్రలు వేస్తే ఎలా వుంటుందో అలా అంతా గందరగోళం. ప్రజా సంక్షేమం, ప్రజాసేవ కంటే తమ ప్రభుత్వం నిలబడటానికి ఎంతమంది కావాలో లెక్కాపద్దులు చూసుకోవడంతోనే సరిపోతోంది కేంద్రప్రభుత్వానికి...! ఇదంతా ఎందుకంటే.. స్వయంకృతాపరాధాలే!   ప్రజాభిప్రాయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ప్రభుత్వంలో మిత్రపక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. గతంలో రిటైల్‌ మార్కెట్‌లోకి ఎఫ్‌డిఐలను అనుమతించడం వంటి చర్యను ఉపసంహరించుకోవాలని అందుకై ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. అయినా ఎటువంటి స్పందన రాకపోవడంతో తన మద్దతును ఉపసంహరించుకుంది. తృణమూల్‌ మద్దతు ఉపసంహరించుకున్నా తమ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నారు. తృణమూల్‌ మద్దతు ఉపసంహరించుకున్నా మిత్రపక్షాలతో పాటు బయటనుండి మద్దతు ఇచ్చే మరో మూడు పార్టీల సంఖ్యాబలం కలుపుకుంటే సాధారణ మెజారిటీకంటే అధికబలం ఉన్నట్లే అవుతుంది. సంఖ్యాపరంగా బాగానే ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇచ్చి తమ మనుగడను మిగతా పార్టీలు ప్రశ్నార్ధకం చేసుకుంటాయో, లేదా మేము ప్రజాపక్షమని అందుకే ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మద్దతు ఉపసంహరించుకున్నామని ప్రజలకు నిజాలను చెప్పే ప్రయత్నం చేస్తాయో.. వేచి చూడాల్సిందే...! ప్రభుత్వ నేతలు మాత్రం పరిపాలన విషయాలను పక్కనపెట్టి తమ ప్రభుత్వ మనుగడ కోసం చిట్కాలెక్కలతో కాలం గడిపేస్తున్నారన్నది విమర్శకుల విశ్లేషణ...!

సంక్షోభంలో యుపిఎ సర్కార్‌

అనుకున్నంతా జరిగింది....! ఆడ్డగోలు నిర్ణయాలతో ప్రజాజీవనాన్ని కష్టాల్లోకి యుపిఎ సర్కార్‌ నెట్టేస్తోందంటూ కళ్ళెర్రజేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర సర్కార్‌కు తన మద్దతు పూర్తిగా ఉపసంహరించుకుంది. డీజిల్‌ ధరను బాగా పెంచడంతో బాటు భారత్‌ భావిప్రయోజనాలకు విఘాతం కల్పిస్తూ ఎఫ్‌డిఐకి అనుమతి ఇవ్వడంపట్ల మమత మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు సామాన్యుడిని మరిన్ని సమస్యలకు గురి చేస్తాయనీ, కాబట్టి ఎఫ్‌డిఐకి అనుమతి ఇచ్చే విషయాన్ని పూనరాలోచించి తక్షణమే   ఆ నిర్ణయాలను రద్దు చేసుకోవాలంటూ మమత హెచ్చరించింది. భాగస్వామ్య పార్టీలు హఠం చేసినప్పుడ్‌ల్లా నిర్ణయలు మార్చుకోటే పరసతి పోతుందనుకున్న సర్కార్‌ తన నిర్ణయానికే కట్టుబడిరది. అంతేకాకుండా పార్లమెంటులో తృణమూల్‌కు ఉన్న బలం 19 మంది ఎంపిలు కాగా, వీరు వైదొలగినా తమకు 307 మంది ఎంపిల బలం ఉంటుంది కాబట్టి తమ సర్కార్‌ కొచ్చిన ఇబ్బందేంలేదని యుపిఎ భరోసాగా ఉంది. నిజానికి 276 మంది ఎంపిలు కాంగ్రెస్‌ బలంకాగా, ఎస్పీ, బిఎస్పీ, జనతాదళ్‌ సెక్యులర్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీలు బయట నుంచి ఇస్తున్న మద్దతుతో ఆ బలం 307 అవుతుంది. ఇది అధికారంలో కొనసాగేందుకు అవసమైన ఎంపీల సంఖ్యకంటే 35 ఎక్కువ. కాబట్టి తమ సర్కార్‌కు ఢోకాలేదంటూ కాంగ్రెస్‌ నేతలు పైకి చెబ్తున్నా రాజకీయ చదరంగంలో అద్భుతంగా పావులు కదపగలిగే మేధాశక్తి ఉన్న మమత మళ్ళీ ఏం ఎత్తులు వేస్తుందో అనుకుంటూ భయంభయంగానే ఉన్నట్లు వార్తలోస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ నేతల భయాలను నిజం చేస్తున్నట్లుగా` మమతా బెనర్జీ ఇప్పటికే యుపిఎ భాగస్వామ్య పక్షాలతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరో సంవత్సరకాలంలో ఎన్నికలు ఎదుర్కోవలసి ఉన్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్‌ తీసుకునే అనాలోచిత నిర్ణయాలకు మద్దతు పలికితే అందుకు పరిహారం వచ్చే ఎన్నికల్లో మనం చెల్లించుకోవలసి వస్తుందంటూ మమత హెచ్చరిస్తున్నారట ! ఇది నిజమేనని అంగీకరించిన ఇతర భాగస్వామ్య పక్షాలు మమతతో చేతులుకలిపి మద్దతు ఉపసంహరణ దిశగా ఆలోచనలు సారిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎటు నుంచి ఎటు వచ్చినా తమకే లాభం అనుకుంటూ బిజిపి పక్షాలు జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి !

రాహుల్‌ అంతర్జాతీయనేత..! సోనియా విశ్వమాత...!

ఎవరి గొప్ప వారు చెప్పుకోవడంలో ఎవరికెవరూ తీసిపోరని మోడీ. రాహుల్‌ స్థాయిల విషయంలో చోటు చేసుకున్న మాటల యుద్ధం రసపట్టుగా మారింది! వ్యక్తి పూజకే అగ్రతాంబూల మిచ్చే కాంగ్రెస్‌లో పొగడ్తలు శృతి మించిపోతున్నాయ్‌! బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మన్మోహన్‌ రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటును స్తంభింపజేసిన బి.జె.పి అంటే కాంగ్రెస్‌ నేతలు గుర్రుగానే ఉన్నారన్నది నిజం! తమ నాయకుల మనసులో చెలరేగి పోతున్న అలజడిని గమనించిన కొందరు కార్యకర్తలు ఆ కచ్చను గుజరాత్‌ ముఖ్య మంత్రి నరేంద్ర మోడిపై వెళ్ళగక్కడానికి ప్రయత్నిస్తూ తమ నేత రాహుల్‌ గాంధీ జాతీయ నాయకుడైతే, మోడీ కేవలం ప్రాంతీయ నాయకుడంటూ తమ నాయకుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు! అందుకు మోడీ స్పందిస్తూ `తాను నిజంగానే ప్రాంతీయ నాయకుడినేనని ఒప్పేసుకుంటూ రాహుల్‌ గాంధీ మాత్రం అంతర్జాతీయ నాయకుడనీ, ఆయన ప్రపంచంలో ఎక్కడినుంచైనా పోటీ చేస్తారనీ, అవసరమైతే ఇటు భారత్‌, అటు ఇటలీ ఎన్నికల్లోనూ పోటీ చేసెయ్యగల రంటూ సెటైర్‌ విసిరారు! ఆ వ్యాఖ్యకు ఎలాస్పందించాలో ఆర్థం కాక తల నెరసిన పెద్ద నాయకులు తలలు పట్టుకుకూర్చుంటే `ఛోటా నాయకులు మాత్రం మోడీ వ్యాఖ్యలపై స్పందించకపోతే తమ పరువేంగావాలనుకున్నారో ఏమో గానీ `రాహుల్‌ గాంధీ ప్రపంచ దేశాలను ప్రభావితం చెయ్యగల అంతర్జాతీయ నాయకుడేనని చెప్పేస్తున్నారు! ఇంతటితో వీళ్ళు ఊరుకుంటారా...? లేక మరో అడుగు ముందుకేసి సోనియమ్మ విశ్వమాతంటూ కితాబిచ్చి `ఆమె ఏ గ్రహంలోనైనా పోటీ చేసేస్తారంటూ చెప్పేస్తారో వేచిచూడాల్సిందే! ఉరుమురిమి ఎక్కడో పడ్డట్టు మోడీపై చెళుకు లెయ్యాలని ప్రయత్నిస్తే సోనియా విదేశీయత వివాదం మరోసారి తెరమీదికి తెస్తున్నట్లవుతోంది కదూ...!

క్షమాభిక్ష కోరుతూ కసబ్ పిటిషన్

ముంబాయిలో దాడులకు తెగబడిన పాకిస్తానీ ఉగ్రవాది అజ్మల్ కసబ్ తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పిటిషన్ దాఖలు చేశారు. కాగా ముంబైలో నరమేధం సృష్టించిన కసబ్‌కు ఉరిశిక్షే సరైనదని 15 రోజుల క్రితం భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజ్ హోటల్లో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక ఉగ్రవాది కసబ్. కసబ్ కేసు విషయంలో 11వేల పేజీలతో దర్యాఫ్తు సంస్థ ఛార్జీషీట్ దాఖలు చేసింది. 13 నెలల పాటు దర్యాఫ్తు సంస్థ ఈ కేసును విచారించింది. 3192 సాక్ష్యాధారాలను పరిశీలించింది. 2009 ఏప్రిల్ 15వ తేదిన కసబ్ కేసు ప్రారంభమైంది. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. దేశంలోని ఉగ్రవాదుల కేసులలో అత్యంత వేగంగా పూర్తయిన కేసు కసబ్‌దే. ప్రస్తుతం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద 11 క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హంతకుడు బల్వంత్‌సింగ్ రాజోనా క్షమాభిక్ష పిటిషన్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వద్ద ఉండగా, పార్లమెంటుపై దాడుల కేసులో దోషి అయిన అఫ్జల్ గురు క్షమాభిక్ష సహా 11 పిటిషన్‌లు రాష్ట్రపతి భవన్‌లో నిరీక్షిస్తున్నాయి. సమాచార హక్కుచట్టం ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

సింగరేణి దొంగలకు తాళాలు అప్పగిస్తున్న ప్రభుత్వం?

దొంగలకే తాళాలు అప్పగిస్తే అనే పెద్దల మాటను తూ.చ. తప్పకుండా ప్రభుత్వం అనుసరిస్తోంది. సింగరేణి పరిశ్రమలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన వారందరికీ పదోన్నతులు కల్పించి బదిలీ చేసిన ఘనత కూడా ప్రభుత్వానికే దక్కింది. సిఎండి సంతానం, శాస్త్రి పని చేసిన కాలంలో అతిపెద్ద కుంభకోణాలు వెలుగుచూశాయి. వీరిద్దరూ ప్రధానపాత్రధారులనీ తేలింది. అప్పట్లో ప్రభుత్వం నియమించిన రాంరెడ్డి కమిషన్‌ నివేదిక ఇప్పటిదాకా వెలుగుచూడలేదు. 1995లో గోదావరి ఖని ఓసీ`2లో టెక్నాలజీ కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపణ వచ్చింది. దీనిపై శాసనసభాకమిటీ వేశారు. ఆ కమిటీ 150మంది అధికారులపై ఆరోపణలను విచారించి 27మందిని దోషులుగా తేల్చింది. ఇప్పటి వరకూ ఆ దోషులపై చర్యలు తీసుకోలేదు. సింగరేణి డైరెక్టర్‌ పర్సనల్‌గా అయ్యంగార్‌ సీఎస్‌ఎల్‌ ట్యూబ్‌లైట్ల కొనుగోలులో కోట్లరూపాయల కుంభకోణం వెలుగుచూసింది. ఆయన్ని బదిలీ చేశారు. ఆ తప్పుపై కనీసం విచారణ కూడా నిర్వహించలేదు. గోదావరి ఖని 7ఎల్‌ఈపీ, జీడీకే 8ఏ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయిన ఘటనలపై జస్టిస్‌ బిలాల్‌ నక్వీ విచారణ కూడా వెలుగులోకి రాలేదు.   తాజాగా సత్తుపల్లి ఓసీలో బొగ్గుగ్రేడ్‌ మార్చి అమ్మిన కుంభకోణం 2005`2011 మధ్యన వెలుగుచూసింది. దీనికి కారణమైన డైరెక్టర్‌ సింగరేణి వదిలి వెళ్లిపోయారు. దర్జాగా విదేశాల్లో ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఇదే కుంభకోణంలో పాత్రధారులైన కొందరికి పదోన్నతులు లభించాయి. గోదావరి ఖని మేడిపల్లి ఓసీలో వెలుగుచూసిన మరో కుంభకోణంపై ప్రధుత్వ ప్రధానకార్యదర్శి విచారణ ప్రారంబించారు. ఈ విచారణ న్యాయంగా జరగాలని కోరుతూ తానేమీ నేరం చేయలేదని ఒక డైరెక్టర్‌ ఇటీవలే సీఎస్‌కు రాశారని సమాచారం. భూపాలపల్లిలో సత్తుపల్లి తరహాలోనే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిలో దోషులనైనా శిక్షిస్తారో? క్షమిస్తారో వేచి చూడాలి. అసలు ఇన్ని కుంభకోణాలు వరుసగా వెలుగులోకి వచ్చినా దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారో అన్న అంశంలోనే దొంగలకు తాళాలు అప్పగించే వైఖరి బయటపడుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిరు అభిమానులకు తప్పని ఎదురుచూపు!

రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయతెరంగేట్రం చేసినా ఊహించని పదవి ఏదీ ఆయన్ని వరించలేదని అభిమానులు నిరాశపడుతున్నారు. సినిమాల్లో ఉన్నత స్థాయిని వదులుకుని ప్రజాసేవ పేరిట పీఆర్పీని ఏర్పాటు చేయటమే చిరంజీవి మొదటితప్పని ఇప్పుడు బాధపడు తున్నారు. పైగా, కాంగ్రెసులో ఆ పార్టీని విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వం పొందిన చిరంజీవి కేంద్రమంత్రి అవుతారని వీరు ఆశపడ్డారు. ఇంకా విషయం తేలకపోవటంతో నిరాశపడుతున్నారు. అంతేకాకుండా పుండు మీద పుట్రలా వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి కాంగ్రెసులో విలీనం అయితే తమ హీరోను కాంగ్రెసు పట్టించుకోదని వాపోతున్నారు. జగన్‌పార్టీ కాంగ్రెసులో విలీనం అయితే తొలినష్టం తమ హీరోకే జరుగుతుందని మాత్రం స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల రీత్యా భవిష్యత్తులో చిరంజీవి సిఎం అభ్యర్థి అనే బ్యానర్‌తో 2014 ఎన్నికలు జరగవచ్చని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ పరిశీలకుల అభిప్రాయానికి ఒక చిన్నబ్రేక్‌ ఏమిటంటే అది జగన్‌ పార్టీ విలీనం. దీంతో ఈ విలీనం త్వరలోనే ఉండవచ్చనే అంచనాలు కూడా ఊపిరి పోసుకుంటున్నాయి.   దీంతో కాంగ్రెసు గూటిలో చేరిన పీఆర్పీ, వైకాపా నేతల మధ్య ఘర్షణలు జరిగే అవకాశాలున్నాయి. తాము గొప్పంటే తామే అన్న వాతావరణం ఈ రెండు పార్టీలకు ఉండవచ్చని భావిస్తున్నారు. అసలే కాంగ్రెసు పార్టీలో గ్రూపురాజకీయాలు ఎక్కువ. అటువంటిది కొత్తగా జగన్‌ గ్రూపు కాంగ్రెసులో చేరితే నేరుగా ఘర్షణలు ఎక్కువవ్వొచ్చని సీనియర్లు అంటున్నారు. పీఆర్పీ, వైకాపా నేతలు బాహాబాహీ తలపడుతుంటే ఇప్పటి వరకూ గ్రూపుల ఆధారంగా కొట్టుకునే కాంగ్రెసు ప్రేక్షకపాత్ర పోషించవచ్చు. అసలు ఈ వీలినం అనే ముసలం తప్పితే బాగుంటుందని చిరు అభిమానులు కోరుకుంటున్నారు. తమ హీరోకు మంచి జరగాలని ఇటీవల ద్రాక్షారామ భీమేశ్వరాలయంలోనూ, మరికొన్ని దేవాలయాల్లో పూజలు చేయించారట. అసలు మొండివాడైన జగన్‌ కాంగ్రెసులోకి రాకుండా చూడమని కూడా అభిమానులు దేవుడిని వేడుకుంటున్నారట. ఏదేమైనా రాజకీయతెరపై హీరో ఈమధ్య పెద్దగా తెరపై హడావుడి చేయటం లేదు. ఏదైనా పదవి వస్తే మాత్రం అభిమానులతో కలిసి చిందేయవచ్చని భావిస్తున్నారు.

మంత్రుల కోసం తాను ఓడి సిబిఐని గెలిపించిన కాంగ్రెస్‌?

ప్రభుత్వంలో మంత్రులు లేకపోతే పాలన స్తంభిస్తుందా? స్తంభించదు కానీ, పనిభారం సిఎంపై పడుతుంది. ఈ పనిభారానికి వెరసి మంత్రులను మినహాయించి మనుగడ సాగించటమే కష్టమన్న ధోరణి అథికార కాంగ్రెస్‌ అవలంబిస్తోంది. దీని పర్యావసానమే తనపై ఆరోపణలు వచ్చినందుకు రాజీనామా చేసినా రెవెన్యూశాఖామంత్రిగా ధర్మానప్రసాదరావు కొనసాగటమే. తాను రాజీనామాకే కట్టుబడి ఉన్నా రాష్ట్రప్రభుత్వం దాన్ని ఆమోదించలేదని ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్‌ప్రభుత్వం డొల్లతనం వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళంలో బయటపడినట్లు అయింది. స్వయంగా తన సమర్థతను ప్రచారం చేసుకోవటంలో ధర్మాన ఒరకంగా సక్సెస్‌ అయినట్లే. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీనామా ఆమోదించకపోయినా వాన్‌పిక్‌ కేసులో ఈయన ప్రధాననిందితుడు. సిబిఐ ఛార్జీషీటులో ఈయన పేరు నమోదు చేసింది. దీని విచారణ నిమిత్తం ఈ నెల 25న సిబిఐకోర్టుకు హాజరుకావాలని ధర్మానకు సమన్లు పంపించారు. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి చరిత్ర లేని నేతలను మంత్రులుగా నియమించటంలో వైఫల్యం చెందిందని విమర్శలను ఎదుర్కొంటోంది. ఒకరకంగా ధర్మాన రాజీనామాను ఆమోదించకపోవటం ప్రభుత్వ ఓటమిని చాటుతోంది. ఛార్జిషీటు దాఖలు చేసి తదనంతరం సిబిఐ కోర్టులో బలమైన వాదనలను అందించటం ద్వారా సిబిఐ ఒకరకంగా తన గెలుపును చాటుకుంటోంది. కాంగ్రెస్‌ ఓడిపోయి సిబిఐను గెలిపించటం ఒకరకంగా స్పోర్టీవ్‌స్పిరిట్‌గా తీసుకోవాలంటే ఇది ఆట కానేకాదు. మరి కాంగ్రెస్‌ ఎందుకు ఓడిపోయినట్లు నటిస్తోంది.

లక్ష్మీపార్వతికి విలువే లేదా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సతీమణిగా యావత్తు రాష్ట్రానికి పరిచయమైన లక్ష్మీపార్వతికి ఆది నుంచి అస్సలు విలువ ఇచ్చేవారే కరువయ్యారు. ఆమె మాటతీరు కూడా అంతగా బాగుండ దని పరిచయస్తులు స్పష్టం చేస్తుంటారు. అంతేకాకుండా లక్ష్మీపార్వతి మాటలో కూడా గ్రామీణయాస కొట్టొచ్చినట్లు వినిపిస్తుంది. చదువులో ఎంత ఉన్నతస్థాయి సాధించినా ఆమె మాటతీరు మారకపోవటం వల్ల అదే కొంత వరకూ ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టిందని అనుకోవచ్చు. అయితే నందమూరి కుటుంబం మొదటి నుంచి ఈమెను దూరంగా పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈమె మాత్రం వారిని దగ్గర చేసుకునేందుకు కృషి చేస్తూనే ఉంటారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనూ ఈమెకు పరాభవం తప్పలేదు. ఎన్టీఆర్‌ మరణానంతరం ఆమెను దాదాపుగా వెలి వేసినట్లే లెక్క. ఎన్టీఆర్‌ బతికి ఉన్నంత కాలమే ఈమె కొంత సౌఖ్యాన్ని అనుభవించారు. అప్పట్లో ప్రారంభమైన నిరసనలు ఇప్పటికీ లక్ష్మీపార్వతిని వెంటాడుతూనే ఉన్నాయి.   ఎన్టీఆర్‌ను గుర్తించిన ప్రజలు తనను అభిమానిస్తారన్న నమ్మకంతో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అధికారం కోసం పోరాడి భంగపడ్డారు. ఎన్టీఆర్‌ అంత్యకాలంలో దగ్గరగా ఉన్న సన్నిహితులందరూ లక్ష్మీపార్వతికి మద్దతు ప్రకటించారు. మామను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకున్న చంద్రబాబుతో ఈమె ప్రత్యక్షపోరు సలిపారు. ఎన్టీఆర్‌ మరణానికి చంద్రబాబే కారణమని ఈమె చేసిన వ్యాఖ్య అప్పట్లో సంచలనమైంది. ఆ తరువాత కాలం కలిసివస్తుందని ఆశించారు. అయితే ఆమె నిరాశే అయింది. ఎన్టీఆర్‌తెలుగుదేశం పార్టీని అంతగా ఆదరించలేదు. అయితే కుటుంబపరంగా ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వదులుకోవటానికి లక్ష్మీపార్వతి ఎప్పుడూ సిద్ధంగా లేదు. ఆమె ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత. ఇటీవల ఉప ఎన్నికల్లో వైకాపా తరుపున అన్ని నియోజకవర్గాల్లోనూ లక్ష్మీపార్వతి ప్రచారం చేశారు.   మొదటి నుంచి ఎవరు విన్నా వినకపోయినా తాను చెప్పుకుపోవటానికి అలవాటు పడ్డ లక్ష్మీపార్వతి నందమూరి కుటుంబానికి సంబంధించి ఎటువంటి చిన్న సమస్య వచ్చినా స్పందిస్తుంటారు. ఒక అభిమానిగా ఎన్టీఆర్‌కు పరిచయమై అర్థాంగిగా మారినా, ఎన్టీఆర్‌ ప్రసంగశైలిని దగ్గర నుంచి గమనించి పిహెచ్‌డి పొందినా లక్ష్మీపార్వతి వైఖరి మారక పోవటం గమనార్హం. ధీటుగా స్పందించే గుణమున్నా ఆకట్టుకునే ఆహార్యం అస్సలు ఈమెకు లేదు. నవ్వును, ఎడుపును, తన భావనలను ఏమీ దాచుకోని లక్ష్మీపార్వతి తాజాగా నందమూరి కుటుంబంపై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్‌ వారసుడు హరికృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయంపై ఆమె నిప్పులు చెరిగారు. వాస్తవానికి తమ గురించే మాట్లాడుతున్నా సరే, లక్ష్మీపార్వతిని నందమూరి కుటుంబమే పట్టించుకోదు. అందువల్ల ఈమె ఎన్టీఆర్‌ అభిమానులకూ దూరమయ్యారు. పైగా, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నేతగా మారటంతో తెలుగుదేశం పార్టీ ఈమె వ్యాఖ్యలపై కిందిస్థాయి కార్యకర్తలతో సమాధానాలిప్పిస్తోంది. ప్రత్యేకించి చంద్రబాబు ఎక్కడ ప్రసంగించినా లక్ష్మీపార్వతి ప్రస్తావన వస్తే ఘాటైన పదజాలంతో వాడైన విమర్శనాస్త్రాలను సంధిస్తుంటారు. తాజాగా లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్య కూడా ఇలాంటిదే. చంద్రబాబు వారసుడు నారా లోకేష్‌ కోసం హరికృష్ణ కుమారుడు ఎన్టీఆర్‌ను పక్కన పెట్టారని ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమాధానం ఇవ్వమని సినీనటుడు బాలకృష్ణను చంద్రబాబు ఆదేశిస్తారని ఆ పార్టీశ్రేణులు చెబుతున్నాయి.

బాబు నిర్ణయాలకు ‘దేశం’ బలి?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలకు ఆ పార్టీ బలపీఠం ఎక్కనుంది. పార్టీని పటిష్టం చేసే కంగారులో చంద్రబాబు ఎస్సీల్లో మాదిగలకు మద్దతు ప్రకటించారు. వర్గీకరణకు అనుకూలంగా ఓటేశారు. దీంతో ఒక వర్గానికైనా దగ్గరయ్యామని చంద్రబాబు చంకలుగుద్దుకున్నారు. తాజాగా మాదిగదండోరా రాష్ట్ర అధ్యక్షుడు మందాకృష్ణమాదిగ సొంతంగా రాజకీయపార్టీని నెలకొల్పనున్నారు. దీని కోసం ముమ్మరంగా ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. అయితే మాలలు తెలుగుదేశం పార్టీకి దూరం కావాలని నిశ్చయానికి వచ్చారు. వీరిని కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఆకర్షిస్తున్నాయి.   దీంతో తెలుగుదేశం పార్టీకి మాలల ఓటుబ్యాంకు దూరమైంది. అయితే ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు మాదిగలను వర్గీకరణ పేరుతో దగ్గర చేసుకునేందుకు కసరత్తులు చేశారు. దీనిలో భాగంగానే వారితో కలిసి ఆందోళనకార్యక్రమాలు సాగిస్తున్నారు. అయితే మందాకృష్ణ పెట్టబోయే పార్టీలో అభ్యర్థులందరూ మాదిగలే. పైగా, దండోరా జిల్లా కమిటీల సహాయంతో పార్టీని నిర్మిస్తున్నారు. అందువల్ల మాదిగలు వర్గీకరణ కోసమని చంద్రబాబుకు మద్దతు పలికినా, తిరిగి తమ పార్టీలోకి వెళ్లిపోతారు. కేవలం తెలుగుదేశం పార్టీలో ఏళ్ల నుంచి కొనసాగుతున్న మాదిగ సామాజికనేతలే మిగులుతారు. మాదిగల ఓటుబ్యాంకు మొత్తం మందాకృష్ణ వెనుకే నిలవాలని నిశ్చయించుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ వర్గీకరణ వైపు మొగ్గు చూపి ఒకవైపు మాలలకు, మరోవైపు మాదిగలకు దూరమయ్యే స్థితిలో ఉంది. దీన్ని పట్టించుకోకుండా చంద్రబాబు తమ వెనుక మాదిగలున్నారని భావించారు. వర్గీకరణ నిర్ణయాన్ని బలపరిచి చంద్రబాబు పార్టీని బలి చేశారని మాలలు అంటున్నారు. తమ మందాకృష్ణ మాట దాటి అడుగుకూడా కదపబోమని మాదిదిగలు చెబుతున్నారు. ఎస్సీల్లో కీలకమైన ఈ రెండు సామాజికవర్గాలూ దూరమయ్యాక మిగిలిన సామాజికవర్గాలు ప్రభావం అంతగా కనిపించదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

యూపీఏ-2 మంత్రివర్గం నుంచి టీఎంసీ మంత్రులు వైదొలగుతారా?

దేశీయ చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీకి నచ్చలేదు. డీజిల్ ధరలు పెంచడం, గ్యాస్ సిలిండర్లపై పరిమితిని విధించడంకూడా దీదీకి కోపాన్ని తెప్పించాయ్. యూపీయే సర్కారుపై అలిగిన ఫైర్ బ్రాండ్ మమత  ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించారు. మమత విధించిన డెడ్ లైన్ సోమవారంతో ముగుస్తోంది. మన్మోహన్ ప్రభుత్వం దిగిరాకపోతే తృణమూల్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని దీదీ నిర్ణయించారు. యూపీఏ 2 ప్రభుత్వానికి బైటినుంచి మద్దతుని కొనసాగించాలన్నది మమతాబెనర్జీ యోచన. ఒకవేళ పరిస్థితి విషమిస్తే మధ్యంతర ఎన్నికలకుకూడా తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటన చేసిన ఆమె ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపుకూడా ఇచ్చారు. 

పినిపే పేదవాడే, అబ్బాయి మాత్రం చాలా రిచ్

మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి తప్పతాగి కారు తోలుతూ పోలీసులకు చిక్కాడు. మంత్రిగారబ్బాయి తోలుతున్న కారుని చూస్తే ఆయనగారి జోరెంతో స్పష్టంగా తెలుస్తోందని అంతా ముక్కున వేలేసుకున్నారు. మంత్రిగారబ్బాయ్ కదా... ఆ మాత్రం దర్పం ఉండాల్లే అని కొంతమంది అనుకున్నారు.     ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి పినేపే విశ్వరూప్ చూపించిన మొత్తం ఆస్తుల విలువ దాదాపు కోటీ 13 లక్షల 80 వేల రూపాయలు. అఫిడవిట్ చెబుతున్న లెక్కల ప్రకారం అబ్బాయిగారి పేరుమీద ఓ ఎల్లైసీ పాలసీతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సెక్రటరియేట్ బ్రాంచ్ లో ఓ వెహికల్ లోన్ కూడా ఉంది. అంతా బాగానే ఉంది కానీ.. మంత్రిగారబ్బాయ్ పేరుమీద ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవని అఫిడవిట్ లో చూపించారు.      సార్.. ఆస్తుల మొత్తం విలువ దగ్గర దగ్గరగా కోటి రూపాయలు మాత్రమే ఉంది. కానీ.. మంత్రి గారబ్బాయ్ మాత్రం లేటెస్ట్ బ్రాండ్ మోడల్ వోల్వో కారులో తిరుగుతున్నారు. ఇంత తక్కువ ఆస్తులున్న మంత్రిగారు, అబ్బాయికి 35 లక్షల విలువచేసే కాస్ట్లీ కారుని కొనిచ్చారా, లేక వెహికల్ లోన్ కింద చూపిస్తున్న డబ్బుతోనే అంత ఖరీదైన కారుని కొన్నారా.. లేక.. చూపించిన ఆస్తులు మాత్రమే కాక లోపల్లోపల ఇంకా చాలా ఆస్తులూ గట్రా ఉన్నాయా..? అని చాలామందికి అనుమానం కలుగుతోంది.     ఒక వేళ లోన్ తీసుకుని అంత ఖరీదైన కారుని కొనుక్కున్నట్టైతే ఇంత తక్కువ ఆస్తులతో, అస్సలు సంపాదనే లేని, ఆస్తి పాస్తుల్లేని అబ్బాయిగారు (అఫిడవిట్ లో చూపించిన దాని ప్రకారం) ఆ లోన్ ఎలా తీర్చగలరో ఏమో అన్న సందేహం కూడా సామాన్యులకు కలుగుతోంది. ప్రజా సంక్షేమంకోసం అహరహం పాటుపడుతున్న మంత్రిగారి భుజాలమీద.. ప్రజలకు ఈ విషయంలో కలుగుతున్న కొత్త కొత్త అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యతకూడా ఉందని నలుగురూ గట్టిగానే అనుకుంటున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో పినిపే చూపించిన ఆస్తుల వివరాలు

పెట్టుబడి పేరుతో మొత్తం కాజేస్తారు

రిటైల్‌రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో భారీగా నిరసనలు ప్రతిధ్వనిస్తున్నాయి. యుపిఎలోని మిత్ర పక్షాలు సైతం ప్రతిపక్షాలతో పాటు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.  తృణముల్‌ దీనిపై 72 గంటల్లో పునరాలోచించుకోవాలని వార్నింగ్‌ కూడా ఇచ్చింది.  రిటైల్‌రంగంలో ఎఫ్‌డిఐని అనుమతించడం భారత విఫణి, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం  చూపి,  భారత ఆర్థికవ్యవస్థను  దెబ్బతీస్తుందనీ, రిటైల్‌ వ్యాపారులు, రైతులు ఆర్థికంగా దెబ్బతింటారని  ఎస్‌పి అధికార ప్రతినిధి  రాజేంద్రచౌదరి వ్యాఖ్యానించారు. ఇలా అన్ని పక్షాలు దీనిపై ముక్తకంఠంతో విమర్శలు సంధిస్తున్నాయి.  ఈ పెట్టుబడులను స్వాగతిస్తే.. భవిష్యత్‌లో మీ ఇంటికి, పొలానికి కొన్న సిమెంట్‌, ఇటుకలు, ఎరువులు మా పెట్టుబడితోనే కొన్నారు కనుక అది కూడా మాదే’ అని కూడా అనేసి ఆక్రమించేస్తాయి ఆ పెట్టుబడి భూతాలు. గతంలో విదేశీయులను నమ్మి వందల సంవత్సరాలు మోసపోయిన చరిత్రను పాలకులు మరచిపోయినా.. ప్రజలు మరచిపోలేదు.  ఇలా ప్రతిరంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ పోతే  ప్రభుత్వానికి అవసరమైన సలహా, సహకారాలు, దేశానికి కావలసిన పెట్టుబడులు అందిస్తున్నాం కాబట్టి ఇది మాదే అని కూడా అనేస్తారు.  మన పాలకుల తీరు కోతికి కొబ్బరి దొరికిన చందంగా ఉంటే ఈ పెట్టుబడుల మిషతో వచ్చేవారంతా  ‘తాము శెనగలు తింటూ అవి ఉలవలని చెప్పి పత్తివిత్తులు చేతిలో పెట్టే’ వారే. దీని ప్రతిఘటించకపోతే భవిష్యత్‌ భారతంలో మరో స్వాతంత్య్ర సమరం పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.

గ్యాస్ డీలర్ల నిలువుదోపిడీ..

గ్యాస్‌ సిలెండర్ల పంపిణీపై కేంద్రం ఆంక్షలు విధిస్తూ చేసిన ప్రతిపాదనింకా అమల్లోకి రానేలేదు..! అయినా.. కొన్ని గ్యాస్‌ కంపెనీలు మాత్రం ఇప్పటికే ఆరు సిలెండర్లు పూర్తయిన వినియోగదారులకు ఏడో సిలెండర్‌ను మార్కెట్‌రేటుకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి! ఈ విషయమై గ్యాస్‌ వినియోగదారుల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలను పరిగణనలోకి తీసుకున్న పౌరసరఫరాల శాఖ, కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ ఆంక్షలు అమలు కావంటూ స్పష్టంచేసింది. దీన్ని అతిక్రమించి ఎవరైనా ‘ఏడో సిలెండ్‌రు నిబంధన’ అమలు చేస్తే కఠినచర్యలు  తీసుకుంటామని హెచ్చరించింది. ఇందువల్ల ప్రభుత్వ ‘ఆంక్షల’ ప్రతిపాదనను అత్సుత్సాహంతో  అమలు చేసేందుకు  ప్రయత్నించే గ్యాస్‌ కంపెనీల యాజమాన్యాల దూకుడుకు కళ్ళెంపడినట్లయ్యిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వినాయక మంటపాలకు అనుమతుల గొడవ

వినాయక చవితి పందిళ్ళు వేసుకోవాలంటే ఆయా ప్రాంత పోలీసుల నుంచి అనుమతిని విధిగా పొందాల్సిందేనంటూ పోలీసులు ఒక పక్క  హుకుంజారీ చేస్తుంటే ` మరోపక్క భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి మాత్రం ఎటువంటి అనుమతులూ పొందవలసిన అవసరంలేదంటున్నారు. ఈ మేరకు తాము ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి హామీ కూడా పొందామని ఆయన చెప్పారు. పోలీసుల నుంచి అనుమతి పొందాలన్న నిబంధన ముఖ్యోద్దేశం హిందువుల ఐక్యతను దెబ్బతీయడమే అవుతుందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి తాము రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి పోలీసులు అమలుచేస్తున్న నిర్బంధ నిబంధనల గురించి వివరించగా ‘అనుమతుల పేరుతో ఎవరినీ వేధించవద్దంటూ’ సూచించారన్నారు. ఇదిలా వుంటే ` చవితి పందిళ్ళ ఏర్పాటు విషయంలో ముందస్తు అనుమతులు పొందాలన్న ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేయకున్నప్పటికీ పోలీసులు మాత్రం అనుమతులు తప్పనిసరిగా పొందవల్సిందేనంటూ స్పష్టం చేస్తున్నారు. గణేష్‌ ఉత్సవ ఏర్పాటుకు సంబంధించి అనుమతులు పొందడం వల్ల` ఉత్సవ సమయంలో ఎటువంటి అవాంఛనీయసంఘటనలూ జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వినాయక ఉత్సవాల పేరు చెప్పి స్థానికులనుంచి  బలవంతంగా చందాలు వసూలు చేస్తున్నా, లౌడ్‌స్పీకర్లతో శబ్దకాలుష్యం సృష్టించి స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నా కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమతుల విషయం ఎలా ఉన్నప్పటికీ ` ఇప్పటికే ప్రజల నుంచి చవితి చందాల కోసం పందిరి నిర్వాహకుల ఒత్తిడి బాగా పెరిగిందన్నది నిజం!

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఐదురోజులు

సోమవారంనుంచి శనివారం వరకూ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్ని జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి సందర్భంగా బుధవారం రోజున మాత్రం సెలవు దినంగా ప్రకటించారు. వర్షాకాల సమావేశాల పనిదినాల్ని తగ్గించినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంనుంచి వాకౌట్ చేసింది. ఈ సమావేశాల్లోనైనా తెలంగాణపై సభలో ప్రత్యేక తీర్మానం చేయాలని టిఆర్ ఎస్ సభ్యులు గట్టిగా పట్టుబడుతున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీజులు, కరెంట్, రైతుల సమస్యలు, కరువు లాంటి అంశాలమీద ఈ ఐదురోజుల్లో సభలో చర్చ జరగబోతోంది.

మీడియాపై చిరంజీవి చిర్రుబుర్రు

“అసలే కాంగ్రెస్ వాళ్లు కూరలో కరేపాకులా తీసిపారేస్తున్నారు. అవసరానికి వాడుకుని ఇప్పుడు ఎవర్ని కలవాలన్నా ముఖం చాటేస్తున్నారు. పార్టీలో ఉండలేక, బైటికి పోలేక చిరు చాలా అవస్థలు పడుతున్నాడు. కాలమే ఇలాంటి పెద్ద పెద్ద గాయాలకు సరైన పరిష్కారం చూపిస్తుందన్న ఆశావాదం తప్ప చిరంజీవిదగ్గర ఏం మిగల్లేదు. మన్మోహన్ క్యాబినెట్ విస్తరణ జరిగితే ఓ మంత్రి పదవి ఇస్తారేమోనన్న ఆశ తప్ప కనుచూపుమేరలో కాంగ్రెస్ వల్ల చిరంజీవికి ఒరిగేదేం లేదు.” ఇదీ చాలాకాలంగా చిరంజీవి మీద చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. వినీవినీ విసుగుపుట్టింది. ఏదో రాసుకుంటున్నారు, చెప్పుకుంటున్నారులే అని ఇన్నాళ్లూ ఓపిక పట్టిన చిరంజీవి ఉనట్టుండి మీడియామీద విరుచుకుపడ్డారు. “అసలు ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు. నేనేమైనా చెప్పానా లేక పార్టీ పెద్దలెవరైనా చెప్పారా.. అన్నీ మీకు మీరే ఊహించుకుని, మీకు తోచిన కథల్ని మీరే సృష్టించుకుని ఎలా పడితే అలా రాసేస్తే ఎలా.. అంటూ క్లాస్ పీకారు.“ తనమీద జరుగుతున్న అర్థం పర్ధం లేని ప్రచారాలతో విసిగిపోతున్నానని మెగాస్టార్ అంటున్నారు.