కడిగిపారేసేందుకు కొత్త కోర్ కమిటీ
posted on Aug 28, 2012 @ 4:47PM
కడిగిపారేసేందుకు కొత్త కోర్ కమిటీ రాష్ట్ర రాజకీయాల పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ పరువు ప్రతిష్టలు ఇప్పటికే మురుక్కాలవలో కలిసిపోయాయ్. కుర్చీల కుమ్ములాటలతో పార్టీ రోజురోజుకీ దిగజారిపోతోంది. బెదిరిపోయిన హై కమాండ్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలనుంచి ఎప్పటికప్పుడు కోర్ కమిటీకి ఆదేశాలందుతాయి. 2014 వరకూ పార్టీని ఇలాగే నడపడం బెస్టని తల్లీకొడుకులు గట్టిగా భావిస్తున్నారని పార్టీలో సీనియర్లు అనుకుంటున్నారు. ధర్మాన కమిటీ చేసిన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని.. కోర్ కమిటీ వాటి ప్రకారం ముందుకెళ్తుంది. ఎఐసిసి సమావేశంలో ఈ విషయాలన్నీ చర్చకొచ్చాయి. నియమకాలు, విభేదాలు, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్న విషయాన్ని స్పష్టంగా అందరికీ తెలిసేలా చేయాలనికూడా హై కమాండ్ భావిస్తోంది. కోర్ కమిటీలో జానారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీనివాస్ లకు స్థానం కల్పించాలని అధిష్ఠానం అనుకుంటోంది. ఈ నలుగురితో కమిటీని సమర్ధంగా నడపొచ్చని రాహుల్ గాంధీ కూడా అన్నట్టు భోగట్టా.. పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా కడిగిపారేసి ముత్యంలా మెరిపించడానికి ఇంతకంటే మంచి మార్గం లేదని హై కమాండ్ గట్టిగా భావిస్తున్నట్టు సమాచారం. ఈ కోర్ కమిటీమీదకూడా పట్టుసాధించేందుకు కిరణ్, బొత్స మళ్లీ కొత్త పోరాటం మొదలుపెడతారేమోనన్న అనుమానంకూడా కాంగ్రెస్ పెద్దలకు లేకపోలేదు.