రాష్ట్ర విభజనపై గవర్నర్‌తో కిరణ్ చర్చలు?
posted on Aug 29, 2012 @ 11:31AM
సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. వీరి భేటీ సుమారు గంటకు పైగా సాగింది. విద్యుత్ సంక్షోభం, ధర్మాన రాజీనామా, యస్‌సి, యస్టీ సబ్ ప్లాన్, రాష్ట్ర విభజన లేదా సమైఖ్యతా వాదం ముందుకొస్తే జరిగే పరిణామాలపై ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురవుతాయో అన్న విషయాలపై చర్చించినట్లు తెలిసింది. విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి వివరిస్తూ ఎన్.టి.పి.సి. ఛైర్మన్ అనూప్ అగర్యాల్ తో మాట్లాడి 335 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్రానికి అందించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ధర్మాన రాజీనామా విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తుందని, ప్రతిపక్షాలకు, ప్రజలకు ఎటువంటి అపోహలకు తావివ్వకుండేందుకు సరైన నిర్ణయం తీసుకుంటామని తెలియచేశారు. ఎస్‌సి, ఎస్టీ సబ్ ప్లాన్ విషయాలను వివరించి దానిని చట్టబద్దత కల్పించే దిశగా చేపడుతున్న మార్గాల గురించి వీరిరువురూ చర్చించినట్లు తెలిసింది.
అలాగే ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజుల నిర్ణయం, 78 కాలేజీల ఫీజు పెంపు కూడా వారి మద్య చర్చకు వచ్చింది. ఫీజును అధికంగా పెంచిన కాలేజీలలో టాస్క్‌ఫోర్సు తనిఖీలు జరిపితే చాలావరకు కాలేజీలలో అన్ని వసతులు లేవన్న విషయం బయటపడుతుందని తద్వారా కేవలం 24 కాలేజీలు మాత్రమే అధికఫీజులు రాబట్టే కాలేజీలుగా ఉంటాయని, యాజమాన్య సీట్ల భర్తీని కూడా ఆన్‌లైన్‌లోనే జరిపే విధంగా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే సమైఖ్యరాష్ట్రంగా ప్రకటించినా లేదా రెండుగా విభజించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంటే తలెత్తే సమస్యలు దానికి తీసుకునే చర్యలు కూడా వారిరువురూ మాట్లాడినట్లు తెలిసింది.