బోగస్ చిట్ ఫండ్ కంపెనీల లిస్ట్
posted on Aug 28, 2012 @ 5:04PM
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఆర్‌పిఎన్ సింగ్ త్వరలో జనానికి టోపీపెట్టబోతున్న చిట్ ఫండ్ కంపెనీల వివరాల్ని రాజ్యసభకు సమర్పించారు. ఆ లిస్ట్ లో మా కంపెనీ పేరు కూడా ఉందేమోనన్న భయం ఇప్పుడు రాష్ట్రంలో జనానికి కుచ్చు టోపీ పెడుతున్న చాలా చిట్ ఫండ్ కంపెనీలకు ఎక్కువైపోయింది. ఏదోఒకటి జరిగేలోపే జెండా ఎత్తేస్తే అసలు ఏ సమస్యా ఉండదని భావిస్తున్న కంపెనీలు ఇప్పటికే ఆ పనిలో బిజీగా ఉన్నాయ్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ బోగస్ చిట్ ఫండ్ కంపెనీల హవా మూడుపూలూ ఆరుకాయలుగా సాగుతోంది. వీటిల్లో చాలాకంపెనీలకు కనీసం రిజిస్ట్రేషన్ కూడా ఉండదు. కొందరైతే బాహాటంగానే ప్రైవేట్ దందా నడిపించేస్తుంటారు. వాళ్లమీద పూర్తి నమ్మకంతో డబ్బులిచ్చి అడ్డంగా బుక్కైపోయిన జనం తమకు ఇబ్బంది ఎదురైనప్పుడు మాత్రం నెత్తీ నోరూ కొట్టుకుంటారు. అంతా అయిపోయాక ఆకులు పట్టుకున్నట్టు, బోగస్ కంపెనీల చేతిలో మోసపోయిన జనం చివరికి లబోదిబోమని ఏడుస్తారు. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా కొత్త డ్రైవ్ ని చేపట్టింది. అనుమతి లేకుండా వ్యాపారం చేస్తున్న చిన్నాచితకా ప్రైవేట్ కంపెనీల చిట్టాని తయారుచేసి రాజసభకు సమర్పించింది. పూర్తిస్థాయిలో అవకతవకలకు పాల్పడి రేపో మాపో జెండా ఎత్తేయబోతున్న చిట్ ఫండ్ కంపెనీలు 87 ఉన్నాయని మంత్రి రాజ్యసభకు నివేదించారు. వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అంతా గుర్తించారు. ఆ లిస్ట్ లో తమ పేరు ఉందేమోనన్న భయంతో కొన్ని కంపెనీల యజమానులు తప్పించుకుతిరిగేందుకు దేశమంతా కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు.