కొల్లేరులో మృత్యువాతపడ్డ రూ.50లక్షల విలువైన చేపలు
posted on Jun 29, 2012 @ 11:20AM
కొల్లేరు అభయారణ్యంలో రూ.50లక్షల విలువైన చేపలు మృత్యువాతపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న సమీపగ్రామాల వారు ఆ చేపలను ఏరుకుంటున్నారు. ఒక్కసారిగా భారీసంఖ్యలో గ్రామీణులు రావటంతో అటవీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇంత మంది ఒకేసారి రావటం వల్ల పలు అందమైన పక్షులు ఉండే పిట్టలదొడ్డిలో పక్షులు ఎగిరిపోతున్నాయి. రకరకాల రంగులతో ఆకర్షణకు మారుపేరుగా నిలిచే ఈ పక్షులు పర్యావరణానికే కొత్త అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. అటువంటి పక్షులే లేకపోతే కొల్లేరు వృథా అని ఇక్కడి స్థానికులు చెప్పుకుంటారు. అంతటితో ఆగక కొల్లేరు అందాలను చూడటానికి వచ్చే పర్యాటకులకు తమవంతు సహాయాన్ని అందిస్తారు. అయితే మృతి చెందిన చేపలను పట్టుకెళ్లటం కోసం వీరు ఎగబడుతున్నారు. ఇలా మృతిచెందిన చేపలు తీసుకువెళ్లటం కూడా నేరమేనని రేంజర్ వి.రత్నకుమార్ హెచ్చరిస్తున్నారు. పిట్టలదొడ్డిలో ఇంకా విలువైన మత్స్యసంపద ఉందన్నారు. వందలాది మంది రావటంతో వలసపక్షులు బెదిరిపోతున్నాయని తెలిపారు. డిఆర్‌ఓ, నలుగురు బీట్‌ఆఫీసర్లు, ఇద్దరు సెక్షను ఆఫీసర్లు, బేస్‌క్యాంప్ సిబ్బంది, మొబైల్ టీమ్ కొల్లేరు పరిరక్షణ కోసం గస్తీ నిర్వహిస్తారని వివరించారు.