హరిత బయోప్లాంట్ ఆఫీసును ధ్వంసం చేసిన స్థానికులు
posted on Jun 27, 2012 @ 5:12PM
కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకున్న సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఇక్కడి హరిత బయోప్లాంట్ ఆఫీసుపై దాడి జరిగింది. బిస్కట్ కంపనీ కి బదులుగా బయో ప్రాడక్ట్స్ కంపనీ ని నెలకొల్పారని ఆగ్రహించిన పర్లపల్లి వాసులు ఈ దాడికి పాల్పడ్డారు.
ఆందోళనకారులు హరిత బయోప్లాంట్ ఆఫీసు పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అక్కడ వున్న వాహనాల అద్దాలను పగులగొట్టి వాటిని ఎత్తిపడేసి ధ్వంసం చేసారు. ఆఫీసులోని ఫర్నిచర్, కంప్యూటర్లను ముక్కలు ముక్కలుగా చేసారు. అయితే, ప్రజల ఆగ్రహానికి కారణం బయో ప్రాడక్ట్స్ కి సంబంధించిన ఈ కంపనీని జనావాసాల మధ్య నెలకొల్పడమేనని, ఎన్ని సార్లు అధికారులకు పిర్యాదు చేసినా ఈ కంపనీ ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందినదై వుండడం వల్ల అధికారులు పట్టించుకోలేదని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్లాంట్ కారణంగా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. తాము అనారోగ్యం పాలవుతున్నామని, చర్మవ్యాధులు వస్తున్నాయని వారు చెప్పారు. ఫ్యాక్టరీని మూసివేసేవరకు తమ ఆందోళన విరమించేదిలేదన్నారు. కలెక్టర్ వచ్చి ప్లాంట్ని సీజ్ చేసేవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు.