ఎన్నికల్లో నొక్కేసింది కక్కేయమంటున్న మంత్రి ధర్మాన
posted on Jun 27, 2012 @ 11:38AM
నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మాన రామదాసు ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమితో కలత చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో తమ్ముడు వై.కా.పా. తరుపున ధర్మానకృష్ణదాస్ గెలుపొందారని ఆనందించలేకపోతున్నారు. పైగా, తాను ప్రతిష్టాత్మకంగా భావించి డబ్బులు కుమ్మరిస్తే కొంచెం ఓటర్లకు పంచి మిగిలింది నొక్కేసిన కాంగ్రెస్ నేతల గురించి ఆరాతీశారు. ఎంత పంచారో ఎంత నొక్కారో ఓ అంచనాకు వచ్చిన తరువాత మంత్రి ధర్మాన ప్రసాదరావు నొక్కేసింది కక్కమంటున్నారట. దీంతో హతాశులైన కాంగ్రెస్ నేతలు ఏమి చెప్పాలో తెలియని అయోమయంలో పడుతున్నారు. తన వద్ద వివరాలు ఉన్నాయి కాబట్టి తీయమని మంత్రి డిమాండు చేస్తున్నారు.
చివరికి ఒక్కసారి లెక్క తేల్చేయమని ధర్మాన ప్రసాదరావు నేతలను కోరుతున్నారు. ఇచ్చిందెంత? పంచిందెంత? లెక్క చెప్పాలి కదా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. ధర్మాన రికవరీ స్టంట్ చూసిన కొందరైతే ఆయనకు కనబడకుండా తప్పించుకునే ప్రయత్నాలూ ప్రారంభించారు. ఈ రికవరీ విషయం తెలిసిన నేతలు కొందరు తాము ఊర్లో లేమనీ, త్వరలో వచ్చిన తరువాత లెక్కలు చెబుతామని ఫోనులో చెప్పేస్తున్నారు. ఏమైనా సరే! ఎప్పుడొచ్చినా ఒక్కసారి లెక్క చెప్పేసి వెళ్లమ్మా అంటూ ధర్మాన వారిని మళ్లీ గడువు ఇచ్చి పిలిపిస్తున్నారు.