గౌతమ్‌కుమార్ రాజీనామా సమంజసమేనా?
posted on Jun 27, 2012 @ 11:46AM
రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి విసిగిన హోంశాఖ కార్యదర్శి గౌతమ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఒకరకంగా ప్రభుత్వంలో నాటుకుపోయిన కులతత్వాన్ని చాటుతోందని ప్రతిపక్షాల విమర్శలు మిన్నంటుతున్నాయి. అదే డిజిపి దినేష్‌రెడ్డి కాకపోయుంటే? ఆయన స్థానంలో ఇంకెవరైనా ఉంటే? అన్న ప్రశ్నలను తెరపైకి తెస్తోంది. వాస్తవానికి క్యాట్ ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన రాష్ట్రప్రభుత్వం దాన్ని కాదని హైకోర్టులో సవాల్ చేయటం గౌతమ్‌కుమార్‌ను మానసికంగా కుంగదీసింది. మూడు వారాల్లోపు కొత్త డిజిపిని నియమించమని క్యాట్ ఆదేశాలివ్వటం న్యాయమైనదేనని మొత్తం పోలీస్‌శాఖ భావిస్తోంది. దీన్ని ప్రభుత్వం ఎందుకు తన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుంది? డిజిపి దినేష్‌రెడ్డికి పాలకులతో ఉన్న సంబంధాలు, వ్యక్తిగతంగాను, సామాజిక కులపరంగాను ఎక్కువ అని ప్రభుత్వం సవాల్ చేయటంలో వెల్లడవుతోంది.
సీనియర్‌ను వదిలేసి జూనియర్‌కు పదోన్నతి కల్పించటం రాష్ట్రప్రభుత్వం ప్రకటించే న్యాయమయితే తనకు ప్రతీసారి అన్యాయం జరుగుతోందన్న బాధలో గౌతమ్‌కుమార్ ఉండటమూ సబబే. ఏమైనా హోంశాఖ కార్యదర్శి గౌతమ్‌కుమార్ రాజీనామా అధికార వర్గాల్లో తీవ్రచర్చకు దారి తీసింది. ఈ రాజీనామాపత్రం ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగానికి పంపించారు. ఉద్యోగపదోన్నతుల్లో ఆశ్రితపక్షపాతం అన్న ధోరణి ప్రజలకు చేరింది. పోలీసులకూ ఇదే భావన నెలకొంది. ప్రతిపక్షాలకూ కొత్తసబ్జెక్టు దొరికింది. అయితే అవి ఎంత వరకూ ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయగలవన్నది మాత్రం తెరపైనే చూడాలి.