ఓడినా నెల్లూరు ఓటర్ల మదిలో నిలుస్తున్న టిఎస్సార్?
posted on Jun 29, 2012 @ 11:49AM
ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో తిక్కవరపు సుబ్బరామిరెడ్డి గెలిచారు. ఆయన పేరు నెల్లూరు జిల్లాలో మారుమ్రోగుతోంది. ఎప్పుడో నెల్లూరు వదిలేసి విశాఖలో స్థిరపడిన ఆయన జన్మభూమి రుణం తీర్చుకోవాలని సంకల్పించటం నెల్లూరు జిల్లాలో పెద్ద చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ ఆయనకు నెల్లూరు ఎంపీ టిక్కెట్టు ఇవ్వటం యాధృచ్ఛికం. అయితే ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనే తన జన్మభూమి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. పార్టీ తనకు టిక్కెట్టు ఇచ్చి ఓ గొప్పఅదృష్టాన్ని కల్పించిందని టిఎస్సార్ మనస్ఫూర్తిగా చెప్పుకున్నారు. రాజకీయనాయకులందరూ ఇలానే మాట్లాడతారని నెల్లూరు ప్రజలు ఆయన్ని నమ్మలేదు. తాను హృదయపూర్వకమైన సేవనే నమ్ముతానని అంటూ నియోజకవర్గంలో ప్రజలందరూ తనకు బంధువులని అంటూ ఆయన అభిమానంగా పలకరించారు. టిఎస్సార్ నెగ్గితేనే సేవ చేస్తారని, ఓడిపోతే ఇచ్చిన మాట కూడా మరిచిపోతారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. అప్పట్లోనే టిఎస్సార్ తాను ఆచరించగలిగినదే చెబుతానని అన్నారే తప్ప వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సమాధానం మాత్రం చెప్పలేదు. నియోజకవర్గంలో ప్రచారం చేసేటప్పుడు తన నోటితో చెప్పిన ప్రతీహామీని ఒక పద్దతి ప్రకారం రాసుకున్నారు. ఏ చిన్న హామీనీ మరిచిపోకుండా రికార్డు చేసుకున్న సుబ్బరామిరెడ్డి ఎన్నికల ఫలితాలు ప్రకటించిన పదోనిమషమే నియోజకవర్గాన్ని వదిలేశారు. అలా నెల్లూరు వదిలేసిన ఆయన అక్కడ పరిచయమైన వారిని మాత్రం పలకరిస్తూనే వచ్చారు. ఢల్లీ చేరిన వెంటనే తనకున్న రాజ్యసభ సభ్యత్వం అధికారాన్ని, పలుకుబడిని ఇచ్చిన హామీల పరిష్కారానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
అందుకే సేవకు గెలుపు ఒక్కటే అర్హత కాదని నమ్మిన టిఎస్సార్ ముందుగా కేంద్రస్థాయిలో అయ్యే పనులను పూర్తి చేయదలుచుకున్నారు. దానిలో భాగంగానే శ్రీకాళహస్తి`నడికుడి రైల్వేలైన్ మంజూరు చేయాలని ఆయన కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. ఈ రైల్వేలైను వల్ల కలిగే ప్రయోజనాలు, ఆదాయం వంటి పలు అంశాలను ఆయన విశదీకరించారు. వీలైనంత త్వరగా బడ్జెట్‌లో పెడతానని రైల్వే మంత్రి హామీ ఇచ్చేంత వరకూ తన విలువైన సమయాన్నీ అక్కడ వెచ్చించారు. దీని తరువాత మెట్టవాసులకు సాగు,తాగునీరు సమస్యను పరిష్కరిస్తానని సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. దాని ప్రకారం సోమశిల జలాలు తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ఈ జలాలు తరలిస్తే ఎన్ని ఎకరాలు సస్యశ్యామలం అవుతాయో మ్యాప్‌పాయింట్ల సహితంగా వివరిస్తూ ముఖ్యమంత్రిని ఆకట్టుకున్నారు. అలానే నెల్లూరులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి ప్రతిపాదనలు రూపొందించాల్సిన అవసరాన్నీ సిఎంకు వివరించారు. దీని వల్ల రోడ్ల మాలిన్యం తగ్గటమే కాకుండా మురికినీటిపారుదల వ్యవస్థ మెరుగవుతుందని స్పష్టం చేశారు. పైగా, వ్యాపారకేంద్రమైన నెల్లూరులో ప్రతీసెంటరులోనూ చెత్త కాలువల్లో చేరి వర్షాకాలం రోడ్లు మడుగులవుతున్నాయని తెలిపారు. దుర్గంధం ప్రబలి ప్రధానసెంటర్లలో నిమషం నిలబడలేని పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపారు. దీంతో సిఎం ఈ రెండు ప్రతిపాదనలకు సుముఖత వ్యక్తం చేశారు. వైద్యకళాశాల లేకపోవటం వల్ల నెల్లూరు జిల్లా నుంచి వైద్యవిద్యకు ఇతర జిల్లాలకు వెళుతున్న విద్యార్థుల ఇబ్బందినీ ఆయన సవివరంగా తెలియజేశారు. ఈ వైద్యకళాశాల కట్టించాలని గతంలో పలువురు చేసిన ప్రయత్నాలనూ, అక్కడ ఉన్న న్యాయవిద్యాకళాశాల, ఇంజనీరింగు కళాశాల పరిస్థితులనూ తెలిపారు. వైద్యకళాశాల మంజూరు చేస్తే స్థానికంగా ఉండే వైద్యుల సంఖ్య పెరిగి రోగులకు సేవలు ఎలా అందుతాయో ఆయన వివరించిన తీరు కూడా ఆకట్టుకుంది. దీని విషయంలో కూడా సహకరిస్తామని టిఎస్సార్ హామీని తీసుకున్నారు. తానిచ్చిన మాట ప్రకారం సొంత డబ్బుతో కళాకారుల కోసం పది కోట్ల రూపాయల విలువైన ఓపెన్ ఆడిటోరియం నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. పెద్దాసుపత్రిలో రోగులకు షెడ్లు కట్టించి ఇచ్చేందుకు టిఎస్సార్ రూ.2.50కోట్లు కేటాయించారు. త్వరలో షెడ్ల నిర్మాణం కోసం భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తరుచుగా ప్రమాదాలను ఎదుర్కొంటున్న మత్స్యకారులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా ఎఫ్‌ఎం స్టేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేర్చుకునేందుకు ఆయన కేంద్ర సమాచార శాఖా మంత్రి అంబికాసోనీ నుంచి అనుమతి కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చటం ద్వారా నెల్లూరు ప్రజల హృదయాలను టిఎస్సార్ గెలుచుకున్నారు. తరువాత ఎప్పుడు(2014) ఎన్నికలు జరిగినా ఈయన వేసుకున్న గట్టిపునాది విజయలక్ష్మిని వరించి పెడుతుందని నెల్లూరు ప్రజలే చెబుతున్నారు.