జగన్ కోప్పడినా విజయసాయిరెడ్డి కోర్టుకు వెళ్లినా ఒక్కటేనా?
posted on Jun 27, 2012 @ 11:34AM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి కోప్పడినా, ఆయన ఆడిటరు విజయసాయిరెడ్డి పరువు నష్టం దావా అంటూ కోర్టుకు వెళ్లినా ఒక్కటేనా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం విజయసాయిరెడ్డి చర్యల్లోనే దాగుంది. ఆయన ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, టిడిపి నేత దాడి వీరభద్రరావుపైనా పరువునష్టం దావా వేశారు. జగన్ కూడా ఈ ముగ్గురిపైనే కోపంగా ఉన్నారు. వీరి వల్లే తాను ఇరకాటంలో పడ్డానని జగన్ భావిస్తున్నారు. కుట్రపూరితమైన ఆరోపణలు, ఈ ఆరోపణలతో పాటు దుష్ప్రచారం, పోస్టర్ల ద్వారా, పత్రికల ద్వారా మానసిక క్షోభకు గురి చేయటం వంటి అంశాలు సాయిరెడ్డి ఫిర్యాదులో ఉన్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో ఎ`2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి బయటకు వచ్చినది మొదలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆయన కోర్టులో వేసిన పరువునష్టం దావా తెలియజేస్తోంది.
జగన్‌ను ఇబ్బంది పెట్టే ప్రతీ అంశాన్నీ తనకూ ఆపాదించుకునే సాయిరెడ్డి ఈ ఫిర్యాదు చేశారని తెలుగుదేశం శ్రేణుల అభిప్రాయపడుతున్నాయి. ఇటువంటి నోటీసులు ఇవ్వటం ద్వారా ఈనాడు యాజమాన్యాన్ని, తెలుగుదేశం నేతలను లొంగదీసుకోవాలని చూడటం కూడా కుట్రలాంటిదేని ఆ పార్టీ నేతలంటున్నారు. ఏమైనా జగన్ చెప్పినా, చెప్పకపోయినా ఆయన మనస్సులో ఉన్నది విజయసాయిరెడ్డి చర్యల్లో కనబడుతుందని మాత్రం తెలుస్తోంది. అందుకే ఇకపై విజయసాయిరెడ్డి కదలికలపై దృష్టి పెడితే జగన్ భవిష్యత్తు కార్యాచరణ అర్థం అవుతుందని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఓ అంచనాకు వచ్చేశాయి.