కరువురైతులపై బ్యాంకర్ల కసాయితనం
posted on Jun 29, 2012 @ 10:52AM
కరువురైతుల విషయంలో బ్యాంకర్లు కసాయితనంగా వ్యవహరిస్తున్నారు. తినటానికి తిండి లేకపోయినా అలవాటుపడిన వ్యవసాయం ఆపలేని రైతుల అసహాయతపై దెబ్బకొడుతున్నారు. అనంతపురం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడి రైతులను బ్యాంకర్లు తిప్పుకుంటున్నారు. కనీసం రైతుల ఖాతాల నెంబర్లు తీసుకోడానికి కూడా ఖాళీ లేదన్నట్లు బ్యాంకర్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలనూ బ్యాంకర్లు బేఖాతరు చేశారు. కలెక్టర్ లేఖలను పట్టించుకోకుండా రైతులను బాధల్లోకి నెట్టేస్తున్నారు. ఇతర పనులతో లింక్‌పెట్టుకుని కరువురైతు కష్టాలను పెంచొద్దన్న కలెక్టర్ అభ్యర్థనను బ్యాంకర్లు తోసిపుచ్చారు. 2011`2012 ఆర్థికసంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన ఇన్‌పుట్‌సబ్సిడీ ఇప్పటి వరకూ రైతులకు చేరకపోవటంలోనే బ్యాంకర్ల పనితనం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఇదే అంశంపై ఒకదశలో బాధ్యతారాహిత్యమంటూ ముగ్గురు ఆర్డీఓలకు, జెడిఎలకు కలెక్టర్ దుర్గాదాస్ మెమోలు జారీ చేశారు. 2011`12 ఇన్‌పుట్ సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.398.71కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకూ రూ.245కోట్లు బ్యాంకులకు పంపించామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తాము ఆ డబ్బులో రూ.165కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని బ్యాంకుల ఉన్నతాధికారులు అంటున్నారు. అయితే వాస్తవానికి బ్యాంకర్లు ఇంకా రైతుఖాతాల నెంబర్లు పూర్తిస్థాయిలో సేకరించలేదు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రతీగ్రీవెన్స్‌సెల్‌లోనూ కరువు రైతులు కలెక్టర్‌కు ఈ ఇన్‌పుట్‌సబ్సిడీ గురించే మొరపెట్టుకుంటున్నారు.