పార్టీ ప్రక్షాళన దిశగా చంద్రబాబు
posted on Jul 5, 2012 @ 6:57PM
ఉప ఎన్నికలలో ఒక్క సీటుకూడా తెచ్చుకోలేక చతికిల పడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చైతన్యాన్ని నింపేదుకు కష్టపడి ఓడి పోయిన వారికి కూడా చంద్రబాబు సన్మానాలు చేసిన సంగతి తెలిసిందే. అంతటితో చాలదనుకొన్న బాబు పార్టీని బలోపేతం చేయటానికి భారీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. మొదటి దిశగా పది జిల్లాల అధ్యక్షులను ఆయన మార్చాలనుకుంటున్నారు. హైదరాబాద్‌నుండి మొదలు పెట్టాలని చూస్తున్న చంద్రబాబునాయుడు చాలా కాలంనుండి నగర అధ్యక్షుడిగా పని చేయుచున్న తీగల కృష్ణారెడికి బదులుగా బీఎన్‌రెడ్డి, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి కూన వెంకటరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు.
మహబూబ్‌నగర్‌లో పోకల మనోహర్ స్థానంలో ఎమ్మేల్యే జైపాల్‌రెడ్డికి భాద్యతలు అప్పచెప్పాలని చూస్తున్నారు. విశాఖజిల్లాలో చింతకాయల అయ్యన్న పాత్రుడి బదులుగా బండారు సత్యన్నారయణను, పశ్చిమగోదావరి జిల్లాలో తోట మహాలక్ష్మిని మార్చి మాగంటి బాబుకు అవకాశం ఇవ్వనున్నారు. గుంటూరు జిల్లా అద్యక్షుడుగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు స్ధానే మాజీ మంత్రి కోడెల శివప్రసాద్, మాదాల రాజేశ్వరరావు పేర్లను పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్ధానంలో రవిచంద్రయాదవ్‌ను నియమించనున్నారు. వరంగల్‌జిల్లాలో ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మార్చి పరకాల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చల్లాధర్మారెడ్డిని నియమించనున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గోనె హన్మంతరావుని మార్చి ఎమ్మేల్యే నగేష్‌ని నియమిస్తారని తెలుస్తోంది. ఖమ్మంజిల్లాకు గాను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ని నియమించనున్నట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లాలో వంగాల స్వామిగౌడ్‌ను మార్చి మల్లిఖార్జున రెడ్డి, కృష్ణారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు.