అవును ! ఈ మధ్య సోనియా వింటున్నారు
posted on Jul 5, 2012 @ 1:41PM
అవును ఈ మధ్య సోనియా గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మాటలు వింటున్నారు. గతంలో స్వయానా ముఖ్యమంత్రి, పి.సి.సి. అధ్యక్షుడు వంటి వారు వెళ్ళినా ఆమె దర్శన భాగ్యం అప్పుడప్పుడు మాత్రమే లభించేది. ఇప్పుడు పరిస్ధితి పూర్తిగా మారింది. రాష్ట్రంనుంచి ఏ కాంగ్రెస్ నాయకుడు వెళ్ళినా అతన్ని కలుసుకోవడానికి ఆమె ఆసక్తి చూపుతున్నారు. వారు చెప్పింది శ్రద్దగా వింటున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనందంగా చెబుతున్నారు.
ఇటీవల కాలంలో సోనియాతో కెవిపి రామచంద్రరావు చెప్పిన పలు విషయాలు సోనియా ఆసక్తిగా విన్నారట. ఆంధ్రప్రదేశ్‌లో ఒక వైపు తెలంగాణ వాదం, మరోవైపు జగన్ ప్రభంజనంతో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను సీనియర్ నాయకులు ఎవరు చెప్పినా సోనియా సీరియస్‌గా వినడమే కాదు, అవసరమైతే పక్కనే నోటు పుస్తకంలో రాసుకుంటున్నారట. దీంతో తెలంగాణ, జగన్మోహన్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ సీరియస్‌గా వ్యవహరిస్తుందని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. మరో వైపు రాహుల్ గాంధీకూడా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఆయన కూడా తరచుగా రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. అవసరమైతే నేరుగా వారిని డిల్లీకి ఆహ్వానిస్తున్నారు.