మద్యం విమోచన కేంద్రాల ఏర్పాటుకు హైకోర్టు ఆదేశం!
posted on Jul 4, 2012 @ 11:29AM
మద్యం సేవించటం వల్ల కలిగే అనర్థాలను ప్రచారం చేసే మద్యం విమోచన కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశమిచ్చింది. మద్యపానం, మత్తుపదార్థాలు నిషేధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఎం.వేణుమాథవ్ వేసిన ప్రజాప్రయోజనవాజ్యంపై ధర్మాసనం పైవిధంగా స్పందించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ఈ ధర్మాసనం మద్యపానం వల్ల కలిగే అనర్థాలపై చర్చించింది. న్యాయవాది ఎం.వేణుమాథవ్ తన ఫిర్యాదులో ఐదుజిల్లాల్లో మాత్రమే మద్యం విమోచన కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇటువంటి కేంద్రాలు అవసరమని భావించింది. ప్రత్యేకించి మత్తుపదార్థాల పట్ల అవగాహన లేని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ విమోచన కేంద్రాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడిరది. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి విమోచన కేంద్రాలు పని చేస్తే అన్ని జిల్లాల్లోనూ మద్యం వల్ల అనర్థాలపై అవగాహన పెరుగుతుందని భావించి రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
యువత మత్తు మందుకు ఎంత వరకూ అలవాటు పడ్డారో వాటి వినియోగంపై నివేదిక కూడా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రేవ్‌పార్టీ సంఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు పైవిధంగా తీర్పు ఇచ్చింది. తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆ సంఘటనకు సంబంధించి ప్రజాహితవ్యాజ్యంగా రూపొందించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీనిపై జస్టిస్ చంద్రఘోష్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతూ మత్తుపదార్థాల నిరోధానికి చేపట్టాల్సిన చర్యలతో నివేదిక సమర్పించాలని పోలీసుశాఖను ఆదేశించింది. న్యాయవాది వేణుమాథవ్ పేర్కొన్నట్లు మద్యం విమోచన కేంద్రాలున్న ఐదు జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా కూడా ఒకటి. జిల్లా కేంద్రమైన కాకినాడలో డాక్టర్ కొల్లి సత్యన్నారాయణ ప్రైవేటుగా ఈ మద్యం విమోచన కేంద్రాన్ని నడుపుతున్నారు.
ఈయన ప్రతీరోజూ మత్స్యకారులను, రిక్షా, ఆటో డ్రైవర్లను కలుస్తూ మద్యం వల్ల తనకు జరిగిన హాని వివరిస్తుంటారు. దీనితో పాటు హైదరాబాద్ మొదలుకుని అన్ని జిల్లాల్లోనూ పెద్ద సెమినార్‌లు ఎక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ కొల్లి తన సొంతఖర్చులతో అక్కడికి వెళ్లి మద్యం వల్ల అనర్థాలను స్లైడ్‌షోల రూపంలో విశదీకరిస్తారు. ఇప్పటి వరకూ వందకు పైగా సెమినార్లు కూడా ఈయన నిర్వహించారు. అలానే విశాఖ, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ మద్యం విమోచన కేంద్రాలు నడుస్తున్నాయని సమాచారం.