హ్యాపీ క్లబ్‌లో పట్టుబడిన పేకాటరాయుళ్లంతా హ్యాపీయేనా!
posted on Jul 4, 2012 @ 11:20AM
గుంటూరు జిల్లా మంగళగిరికి ఆనుకుని వుండే హైవే 5 లో ఉన్న హ్యాపి క్లబ్‌పై పోలీసులు దాడి చేసి అనేక మంది ప్రముఖులతో సహా 450 మంది పేకాట రాయళ్ళను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ దాడిలో పోలీసులు 40 లక్షల నగదు కూడా స్వాధీన పర్చుకున్నారు. అయితే పోలీసులు ఎంత స్పీడ్‌గా ఈ దాడులు జరిపారో అంతే హడావిడిగా కేసును నీరుగార్చడం పలు అనుమానాలకు తావిస్తోంది.
దీనికి తోడు పోలీసులు స్వాధీన పర్చుకున్న సొమ్ము ఏమయ్యిందో తెలియడం లేదు. ఈ దాడిలో దొరికిన వారంతా ప్రముఖ రాజకీయ నాయకుల బందువులు, స్నేహితులు, విజయవాడ, గుంటూరుకు చెందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. కొందరు సినీపరిశ్రమకు సంబందించిన పేకాట రాయుళ్ళు కూడా ఈ బృందంలో ఉన్నారని సమాచారం. వీరిని సమీపంలోని మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు ప్రవేటు వాహనాల్లో చేరవేయటానికే 2 గంటల సమయం పట్టింది. పలుకుబడిరాయుళ్ళంతా వచ్చే ఈ క్లబ్ మీద దాడిచేయటానికి గతంలో ఎంతోమంది పోలీసాఫీసర్లు ప్రయత్నించి విఫలం అయ్యారు.
దాంతో గుంటూరు అర్బన్ ఎస్‌పి పకడ్బందీగా పధకం అమలు జరపాల్సివచ్చింది. కాని వారిలో ఎవరినీ ఎందుకు అరెస్టు చేయలేదని కూపీలాగితే ఆసక్తి కరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్‌లు చూపించి తమను కోర్టులో హాజరు పరిస్తే తమ పరువు పోతుందని అదే జరిగితే పోలీసుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటామని కొందరు ప్రముఖులు బెదిరించినట్లు తెలిసింది. ఇదే సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక రాష్ట్రమంత్రి , పార్లమెంట్ సభ్యుడు రంగంలోకి దిగి జిల్లా ఎస్.పి.పై వత్తిడి తెచ్చి ఎటువంటి కేసులు లేకుండా చేసినట్లు తెలిసింది. పోలీసులు స్వాధీనపర్చుకున్న డబ్బు ఆచూకి మాత్రం తెలియడం లేదు .