భూగర్బంలోనే సమాధిఅవుతున్న గని కార్మికులు
posted on Jul 5, 2012 @ 7:38PM
పారిశ్రామిక వాడల్లో కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారు. యాజమాన్యం భద్రతా నిబంధనలను గాలికి ఒదిలి మొద్దు నిద్రపోతుంది. దీనికి తార్కాణంగా ఆదిలాబాద్‌జిల్లా శ్రీరాంపురంలోని ఆర్కే 6వ గనిలో 4వ సీమ్ 30డిప్ 19వ లెవల్లో ఎర్రంశెట్టి రాజేశం (50) మరణించారు. వివరాల్లోకి వెళితే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో టబ్బు బొగ్గులను నింపిన తర్వాత ఊపిరి ఆడటం లేదని వేడిగా వుందని సహచర కార్మికులతో చెప్పి సొమ్మసిల్లిపడిపోయారు. తోటి కార్మికులు పైకి తీసుకొచ్చేటప్పటికే మృతి చెందారు. మృతుడుకి భార్య, ముగ్గురు కూతుళ్లు,కొడుకు ఉన్నారు. గాలి ఆడకే మృతిచెందాడని, తామంతా గాలిలేక చాలా బాధపడ్డామని తోటి కార్మికులు చెబుతున్నారు. మృతుని కుటుంబానికి 25 లక్షలు పరిహారం ఇవ్వాలని టిబికెజియస్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. విశాఖ ఉక్కులో జరిగిన ప్రమాదంలో వారికి అంతే పరిహారం చెల్లించారని తమకు కూడా అదేనిబంధన వర్తింప చేయాలని జియంను కోరారు. శ్రీరాంపురం జియం నాగేశ్వరరావు మేనేజ్‌మెంటుకు వివరిస్తానని తెలిపారు.
సింగరేణి కార్మికులు ఏడాదికి 12 మంది మృత్యువాత పడుతున్నా మేనేజ్‌మెంట్ పట్టించుకోవడం లేదని కనీస రక్షణచర్యలు పాటించనందువల్లే ఊపిరాడక భూగర్బంలోనే సమాధి అవుతున్నారని కార్మికులు వాపోతున్నారు..భూగర్బపనుల్లో 284 క్యూబిక్ మీటర్లు వెంటిలేషన్ తగ్గకుండా (ఇంటెక్) సరఫరా చేయాలి,4.5 మీటర్లసమీపం వరకు గాలి ఉండాలని, ఒక వ్యక్తికి నిముషానికి 6 క్యూబిక్ మీటర్లు లేదా టన్ను బొగ్గు ఉత్పత్తికి 2.5 క్యూబిక్ మీటర్లచొప్పున వెంటిలేషన్ సరఫరా ఉండాలని మైన్స్ యాక్టు చెబుతుంది. వెంటిలేషన్ ప్రకారం గాలి సరఫరాకానందునే కార్మికులు చనిపోతున్నారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. బయట ఫ్యాన్లు పెట్టినప్పటికి గనుల్లోకి గాలిని మళ్లించడంలో అధికారులు విఫలమవుతున్నారన్నారు. విషవాయువులను అధికారులు పరిశీలించాకే అనుమతించాలి గాని ఆ దాఖలాలు లేవని కార్మికులు ఆందోళనకు గురిఅవుతున్నారు. ఇకనైనా అధికారులు తగు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.