త్వరలో పి.సి.సి. ప్రక్షాళన ?
posted on Jul 4, 2012 @ 11:27AM
ఉప ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చవి చూసిన కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు ఆ పార్టీ పీసిసి చీఫ్ బొత్సాసత్యనారాయణ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో చర్చిస్తున్నారు. ఈ చర్చల కోసం బొత్సా ఢల్లీ చేరుకున్నారు. ప్రత్యేకించి స్థానిక ఎన్నికల్లో క్యాడర్ బలహీనపడటం వల్లే కాంగ్రెస్ ఓటమి చవిచూసిందని గుర్తించిన పీసిసి ఈ విషయాన్ని ఆజాద్‌తో చర్చించనుంది. పి.సి.సి. ని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందన్న అభిప్రాయంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పీసిసి కొత్త కార్యవర్గ ఏర్పాటు, డిసీసీ అధ్యక్షుల నియామకం వంటి కీలకాంశాలతో బొత్సా ఢల్లీి చేరుకున్నారు. తాము ప్రతిపాదించిన అంశాల్లో మార్పులు ఏమైనా ఉంటే తెలియజేయాలని ఆజాద్‌ను బొత్సా కోరుతున్నారు. ఆజాద్ చెప్పిన మార్పులు చేసిన తరువాత అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి ఓ స్పష్టమైన జాబితాతోనే తిరిగి రావాలని బొత్సా భావిస్తున్నారు.
అంతే కాకుండా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా బొత్సా అడిగి తెలుసుకోనున్నారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ నియామకాల్లో చేయాల్సిన మార్పుల గురించి సూచించినట్లు సమాచారం. సిఎం చెప్పిన మార్పులు చేశాక బయలుదేరిన బొత్సా తుది జాబితాతో తిరిగి వస్తారని పీసిసి శ్రేణులు భావిస్తున్నాయి. సోనియాకు ఆజాద్ కమిటీల విషయం వివరించి జాబితాను సమగ్రంగా ఉండేలా చూస్తారు. వీరితో వాయలార్ రవి కూడా ఏదో ఒక సమయంలో భేటీ అయ్యే అవకాశముంది.