పాత సిండికేటే శాసిస్తోందా?
posted on Jul 4, 2012 @ 11:34AM
రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సయిజ్ పాలసీని అమలు చేసినా పాత సిండికేట్ శాసిస్తోందని పరిస్థితులు నిరూపిస్తున్నాయి. కొత్తగా ఎంపికైన వ్యాపారులు పాతవ్యాపారుల నీడలో బతికేస్తున్నారు. ఒకవైపు బెదిరింపులు, మరోవైపు వాటాల ఎరలు చూపి కొత్తవ్యాపారుల పేరిట పాతవారే దుకాణాలు నడుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అయితే మద్యం షాపుల్లో పాత యజమానులే కనిపిస్తున్నారు. ఇదే ఒక విచిత్రమైతే సిండికేట్ అదిలాబాద్ జిల్లా దుకాణానికి ఒక్కరినే ధరఖాస్తు చేసుకునేలా శాసించింది. గతంలో 207 దుకాణాలకు ధరఖాస్తులు ఆహ్వానిస్తే వాటిలో 44 దుకాణాలకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. తాజాగా ఆ దుకాణాలకూ ధరఖాస్తులు ఆహ్వానించి రెండోతేదీ గడువు విధించారు. ఇందులో 18దుకాణాలకు ఒక్కో ధరఖాస్తు మాత్రమే వచ్చాయి. దీంతో హతాశులైన అధికారులు ఈ ధరఖాస్తులను ఖరారు చేశారు. అంటే నూతనపాలసీ ప్రకారం లాటరీ కూడా వేయకుండా సిండికేట్ పరోక్షంగా అడ్డుపడిరదన్న మాట. మిగిలిన 26 దుకాణాలకూ ఎవరూ ధరఖాస్తు చేసుకోలేదన్న విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ అశోక్ తెలిపారు. ఇలానే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుల్లో మద్యం దుకాణాలపై పాతవారే పెత్తనం చేస్తూ వాటాదారులుగా ఎక్సయిజ్ రికార్డుల్లోకి చేరారని సమాచారం.