జేసీది ఆవేదనా? ఆవేశమా?

  సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి సోనియాగాంధీని దిగిపొమ్మని డిమాండ్ చేసినందుకు ఆయనకి కాంగ్రెస్ పార్టీ షో-కాజ్ నోటీసు జారీ చేసింది, కానీ ఆ తరువాత దానిని పక్కన పడేసింది. రాష్ట్ర విభజన కూడా జరిగిపోవడంతో ఇక ఆయనే స్వయంగా పార్టీని వదిలేయాలనుకొంటున్నారు. అందుకే ఆయన తన ఆవేదనని, ఆక్రోశాన్ని వ్రేళ్ళగ్రక్కుతూ ఈరోజు సోనియా గాంధీ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు.   “ఆమె చేతిలో అధికారం పిచ్చోడు చేతిలో రాయిలా ఉంది. ఆమె ఆ రాయిని ఎప్పుడు ఎవరి మీదకి విసురుతుందో ఎవరికీ తెలియదు. అటువంటి ఆమె మా పార్టీకి అధ్యక్షురాలవడం మా దౌర్భాగ్యం. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ అవన్నీ వృధాశ్రమే. ఎందుకంటే ఆ సోనియమ్మ విసిరిన రాయి ఎక్కడ పడితే అదే మన రాజధాని అని సీమాంధ్ర ప్రజలు మహాప్రసాధంలా స్వీకరించాలి. తమ కర్మ అంతేనని తృప్తి పడటం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఈ నిపుణుల కమిటీలు, నివేదికలు అన్నీ వృధా శ్రమే. ఇదివరకు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి తయారు చేసిన కృష్ణా కమిటీకే దిక్కు లేనప్పుడు, మళ్ళీ రాజధాని కోసం కొత్త కమిటీలెందుకు? ఆమె వేలెత్తి ఏ ప్రదేశాన్ని చూపిస్తే అదే మన రాజధాని అవుతుంది. ఏ విషయంలోనయినా ఆమెదే అంతిమ నిర్ణయం. అదే అందరికీ మహా ప్రసాదం అని స్వీకరించాలి తప్ప ఎవరూ ప్రశ్నించకూడదు. వేరే ఏ పార్టీలు చేర్చుకొని కారణంగానే మా పార్టీ లో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి, సోనియమ్మకి భజన చేసుకొంటూ కాలక్షేపం చేసుకొంటున్నారు. ఈ ఎన్నికల తరువాత ఆంధ్ర రాష్ట్రంలో మరిక కాంగ్రెస్ కనబడదు. ఇక నుండి ఇక్కడ కూడా తమిళనాడులో లాగే ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తుంది.” అని మీడియాతో అన్నారు.   ఆయన వాడిన భాష చాలా కటోరంగా ఉన్న, ఆయన అభిప్రాయలు మాత్రం ప్రజలలో దాగిన ఆవేదన, అక్రోశాలను ప్రతిఫలిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు కేంద్రంలో అధికారంలో కొనసాగడానికి పెద్ద అండగా నిలిచిన తెలుగు ప్రజల పట్ల ఆమె, ఆమె చుట్టూఉన్న కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా చాలా హీనాతి హీనంగా వ్యవహరించారు. అయినప్పటికీ, కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పార్టీ టికెట్ల కోసం, మంత్రి పదవుల కోసం ఆమె చుట్టూ నిసిగ్గుగా ప్రదక్షిణాలు చేస్తున్నారు. రేపు ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని తెలిసి ఉన్నపటికీ, వేరే పార్టీలలోకి వెళ్లేందుకు సమస్యలు ఉన్నందునే వారు గత్యంతరంలేక కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. అయితే పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తమ భయాన్ని కప్పి పుచ్చుకోనేందుకు బయటకి పోయేవారే పిరికిపందలని నిందిస్తున్నారు.

వైకాపాకు అగ్నిపరీక్షగా మారనున్న ఎన్నికలు

  త్వరలో జరగనున్న ఎన్నికలు తెదేపా, వైకాపాలకు జీవన్మరణ పోరాటం వంటివి గనుక అవి గెలుపు కోసం శక్తికి మించి కృషి చేస్తాయి. ఈసారి వాటికి కలిసొచ్చే అంశం ఏమిటంటే ప్రజలలో తీవ్ర కాంగ్రెస్ వ్యతిరేఖత నెలకొని ఉండటం. అదేవిధంగా నష్టం కలిగించే అంశం ఏమిటంటే ఉన్న13జిల్లాలలో అనేక కొత్త, పాత పార్టీలు పోటీ పడటం.   వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన సమైక్యవాదంతో కాంగ్రెస్ వ్యతిరేఖతను తన పార్టీకి అనుకూలంగా మలుచుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే రాష్ట్ర విభజన జరిగిపోయినప్పటికీ ఎన్నికల వరకు ఆ వేడిని నిలిపి ఉంచేందుకు రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా సుప్రీం కోర్టులో మళ్ళీ న్యాయ పోరాటానికి సిద్దపడుతున్నారు. కానీ, ఇప్పుడు ఏదయినా ఒక పార్టీ ధర్నా చేసినా, రాష్ట్రపతిని కలిసినా మిగిలిన పార్టీలు కూడా దానిని అనుసరించక తప్పని విచిత్రమయిన పరిస్థితి, సంప్రదాయం నెలకొని ఉన్నందున సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, తెదేపా కూడా సుప్రీంకోర్టులో కేసులు వేయవచ్చును, రాష్ట్రపతిని కలిసినా ఆశ్చర్యం లేదు. అందువల్ల వైకాపా ఇతర ప్రయత్నాలు కూడా గట్టిగానే చేయవలసి ఉంటుంది.   బహుశః త్వరలోనే పెద్ద ఎత్తున సీమాంధ్ర అంతటా పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించి రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని అందుకు సహకరించిన బీజేపీని, విభజనకు లేఖ ఇచ్చినందుకు తెదేపాను ఎండగట్టవచ్చును. కానీ చంద్రబాబుతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిపాలనానుభవం లేదు. పైగా చాలా దుందుడుకు స్వభావం. గత పదేళ్లుగా అస్తవ్యస్తమయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి, సమర్ధంగా పాలన సాగిస్తూనే రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలంటే అందుకు చాలా అనుభవం, కార్యదక్షత, నేర్పు కావలసి ఉంటుంది. చంద్రబాబు తన దీక్షా దక్షతలను నిరూపించుకొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అవేమి లేకపోగా అతని వెనుక జైలు జీవితం, అనేక అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసులు మాత్రమే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. పైగా కాంగ్రెస్ పార్టీతో రహస్య సంబంధం కలిగి ఉన్నారనే ఆరోపణలు ప్రజలలో ఆయనపట్ల అపనమ్మకం కలిగిస్తున్నాయి. ఆయన ఇమేజే వైకాపాకు పెద్ద అండగా ఉంది గనుక, ఇప్పుడు కూడా ఆయన ఈ వ్యక్తిగత అంశాలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపకమానవు.   ఇక కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే అందులో జేరుదామని ఇంతకాలం ఎదురు చూసిన కాంగ్రెస్ నేతలు, మారిన పరిస్థితుల్లో కొంతమంది కాంగ్రెస్ లోనే ఉండేందుకు సిద్దపడుతుంటే మిగిలినవారు తెదేపా, వైకాపాలవైపు చూస్తున్నారు. అందువల్ల అటువంటి వారినందరినీ వైకాపా వైపు ఆకర్షించే ప్రయత్నం గట్టిగా చేసి పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. కానీ సరిగ్గా ఇదే కారణంతో పార్టీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు మొదలయి, జగన్మోహన్ రెడ్డి పార్టీపై అదుపు కోల్పోయినట్లయితే వైకాపా కూడా మరో ప్రజారాజ్యంగా మారి ఎన్నికలలో మునిగి కాంగ్రెస్ పార్టీలో తేలుతుంది. మరి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపాను జగన్మోహన్ రెడ్డి ఒడ్డుకు చేరుస్తారో లేక కాంగ్రెస్ నావ ఎక్కించి చిరంజీవిలా క్షేమంగా బయటపడతారో చూడాలి.

సోనియా గాంధీకి 'పిచ్చి'పట్టింది

      కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపైన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియా గాంధీకి పిచ్చి పట్టిందని అన్నారు. అధికారం అనే రాయి ఆమె చేతిలో వుందని, ఆ రాయితో ఏం చేస్తుందో తనకే తెలియదని ఆరోపించారు. ఆమె పిచ్చితో తెలుగు ప్రజలకు అనేక సమస్యలు సృష్టించిందని పేర్కొన్నారు. తానూ సృష్టించిన సమస్య ఫలితంగానే రాజధానికి ఎక్కడ అనేది సీమాంధ్ర ప్రజలకు అర్ధం కావడం లేదని అన్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ త్వరలో మాయమవుతుందని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలు పార్టీలలో దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. తమిళనాడు మాదిరి ఆంధ్రాలో కూడా ప్రాంతీయ పార్టీల రాజ్యం రాబోతుందని జోస్యం చెప్పారు. కొంతమంది రెండు రోజులు ముఖ్యమంత్రి పదవి కోసం గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారని ఆరోపించారు.

కాపు రిజర్వేషన్ లపై కాంగ్రెస్ దృష్టి!

      సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ అదిష్టానం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో బాగంగానే కాపుల రిజర్వేషన్ పై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కన్నా సత్యనారాయణ సోనియా గాంధీతో భేటి కావడం ప్రాధాన్యం సత్కరించుకుంది. రాష్ట్రంలోని కాపుల రిజర్వేషన్ లకు సంబంధించిన నివేదికను ఆయన సోనియా గాంధీకి అందజేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా కాపులకు రిజర్వేషన్ లు ఇవ్వలని ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజనతో సీమాంద్రలో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ బలోపేతం కావడానికి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్యాకేజ్ ఎన్నికల కోసమేనా

  రాష్ట్ర విభజనతోనే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖరారయిపోయిందని అందరూ భావిస్తున్నపటికీ, అ పార్టీ అధిష్టానం బొత్స, డొక్కా, వట్టి, చిరంజీవి, అనం, రామచంద్రయ్య, సుబ్బిరామిరెడ్డి వంటి విదేయులైన వారినందరినీ ఒక త్రాటి పైకి తీసుకు వచ్చిన తీరు చూస్తే ఎన్నికలలో కాంగ్రెస్ కూడా గట్టిగానే పోటీ ఇవ్వబోతునట్లు స్పష్టమవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు పార్టీ నుండి నిష్క్రమించడంతో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అసమతి గళం వినిపించే అవకాశం లేకుండా పోయింది. బహుశః టికెట్స్ కేటాయింపు సమయంలో కొంత వినిపిస్తుందేమో. సీమాంధ్రకు ఇవ్వబోయే ప్యాకేజీ గురించి, రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ తెదేపా, వైకాపాలు ఇచ్చిన లేఖలు, రాష్ట్రాన్ని విడదీయడానికి సహకరించిన కిరణ్ కుమార్ రెడ్డి ని నిందిస్తూ ఎన్నికలలో నెగ్గుకు రావాలని కాంగ్రెస్ ఆలోచన. కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడని నిరూపించుకొన్నారు గనుక కనీసం వారికి ఆ అవకాశం కల్పించేందుకయినా కొత్త పార్టీ పెట్టవలసి ఉంటుంది.   ఎన్నికల తరువాత మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో ఉన్నకాంగ్రెస్ పార్టీ తను ఎలాగు ఆ వాగ్దానాలను అమలు చేయనవసరం లేదు గనుక అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఈ రెండు మూడు నెలలలో సీమాంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు ఎన్ని వరాలు, ప్యాకేజీలయినా ప్రకటించవచ్చును. అందువల్ల అందరూ ఊహిస్తున్నట్లుగా కాంగ్రెస్ పోరాడకుండా చేతులెత్తేయబోదని స్పష్టమవుతోంది.

మంది ఎక్కువయితే...

  రాష్ట్ర విభజన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేసింది గనుక ఇక రాజకీయ పార్టీలన్నీ మరో రెండు నెలలలో జరగనున్న ఎన్నికల కురుక్షేత్రానికి తమ సేనలను, వ్యూహాలను సిద్దం చేసుకొని కత్తులు పదును పెట్టుకొంటున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెస్, వై.కాంగ్రెస్, తెదేపాల మధ్యే పోటీ ప్రధానంగా ఉంటుందని చెప్పవచ్చును. ఆమూడు కాక బీజేపీ, లోక్ సత్తా పార్టీలు కూడా బరిలో ఉండగా, కొత్తగా ఆమాద్మీ, మందకృష్ణ, బైరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి (పెట్టబోయే) కొత్త పార్టీలు కూడా వచ్చి చేరబోతున్నాయి. గతంలో 23జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్తా ఒకేసారి 13 జిల్లాలకు కుచించుకుపోవడంతో, ఒకేసారి ఇన్ని పార్టీలు వచ్చి చేరడంతో ‘మంది ఎక్కువయితే మజ్జిగ పలచబడుతుందన్నట్లు’ ఇన్ని పార్టీల మధ్య ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఇప్పటికే అస్తవ్యస్తమయి, ఇంకా ఇప్పుడు పునర్నిర్మాణం కూడా కావలసిన ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. అత్యంత క్లిష్టమయిన ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్త్రప్రజలు, కులం, మతం వంటి బలహీనతలకు, పార్టీలు పంచిపెట్టే తాయిలాలకు లొంగిపోకుండా విజ్ఞత ప్రదర్శించి సరయిన పార్టీకే పూర్తి మెజారిటీతో గెలిపించవలసి ఉంటుంది. అలాకాదని ప్రజలు ఈ రాజకీయ పార్టీల నడుమ చీలిపోయినట్లయితే, డిల్లీలో ప్రభుత్వ పరిస్థితే ఎదురవుతుంది.

60ఏళ్ళ కల నెరవేరింది: తెలంగాణపై ప్రధాని

      15వ లోక్‌సభ సమావేశాల ముగింపు సందర్బంగా ప్రధాని మన్మోహన్ సింగ్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఎలాంటి అస్థిరతకు తావు లేకుండా, ప్రాధాన్యం లేని లాభ నష్టాల గురించి చింతించకుండా క్లిష్టమైన కొన్ని నిర్ణయాలను ఈ దేశం తీసుకోగలదని తెలంగాణ ఏర్పాటైన తీరుతో స్పష్టమయ్యిందని చెప్పారు. కీలకమైన అంశాల విషయంలో వ్యక్తిగతవాదాలను వదిలిపెట్టి జాతి ఐక్యత కోసం కృషి చేసే సత్తా మనకు ఉందని లోక్‌సభ నిరూపించిందన్నారు. అణగారిన వర్గాల్లో ఆశలు రేకెత్తించిన ఆహార భద్రత చట్టం మరొక చారిత్రక చట్టమని ప్రధాని అన్నారు. 15వ లోక్‌సభకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. హోం మంత్రి షిండే మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అంశం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. పదేళ్ల కిందట తమ పార్టీ అధ్యక్షురాలు ఈ మేరకు హామీ ఇచ్చారని, దీన్ని అమలు చేసే క్రమంలో బీజేపీ కూడా తమకు సహకరించటం స్వాగతించాల్సిన విషయమన్నారు.

అద్వానీకి లోక్ సభ వీడ్కోలు!

      భారతీయ జనతా పార్టీ కులగురువు, రాజకీయ బీష్ముడు 87ఏళ్ళ అద్వానీ త్వరలో రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారా? లోక్ సభ సమావేశాలలో ఆఖరి రోజు జరిగిన సన్నివేశాలు చూస్తుంటే ఇది నిజమేనని అంటున్నాయి రాజకీయ వర్గాలు! 15వ లోక్ సభ సమావేశాల చివరి రోజు సభలో అద్వానీ అందరూ పొగడ్తలతో ముంచెత్తుతూ దాదాపు వీడ్కోలు స్థాయిలో ప్రశంసిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సభలో భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. సభలో సభ్యులందరూ ఆయన్ని 'ఫాదర్ ఆఫ్ ది హౌస్' గా అభివర్ణించారు. ఆయన అడుగుజాడల్లో నడిచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానంటూ సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ''అద్వానీజీ మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను...పార్టీ బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేసిన మీరు..పార్టీ బలోపేతం అవుతుంటే..మీరు బలహీనమవుతున్నారు'' అని ములాయంసింగ్ యాదవ్ అన్నారు.

కొత్త పార్టీకి ముహూర్తం ఖరారయిందా

  నిన్న మొన్నటి వరకు కిరణ్ కుమార్ రెడ్డి గురించే మీడియాలో ఎక్కువగా చర్చలు జరుగుతుండేవి. కానీ, రాజీనామా చేసిన తరువాత ఆయన మళ్ళీ మీడియాకు కనబడలేదు. అయితే ఈరోజు ఆయన సన్నిహిత సహచరుడు మరియు మంత్రి పితాని సత్యనారాయణ రేపు 23వ తేదీన కిరణ్ కుమార్ రెడ్డి తన కొత్త పార్టీని ప్రకటిస్తారని, అందులో తను తన అనుచరులు అందరం జేరుతామని మీడియాకు తెలపడంతో, కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ కోసం కసరత్తు చేస్తున్నట్లు అర్ధమవుతోంది.   ఇంతకాలంగా రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా గట్టిగా పోరాడినవారిలో ముఖ్యుడైన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం చేయగా, గంటా శ్రీనివాసరావు తెదేపాలో జేరెందుకు ఆసక్తి చూపుతునట్లు సమాచారం. ఇక టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు తాము ఏ పార్టీలో చేరుతామో ఇప్పుడే చెప్పలేమన్నారు. అందువలన ఇప్పుడు కిరణ్ కొత్త పార్టీ పెడితే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారనేది అనుమానమే. ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయినందున, సమైక్య నినాదం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. పైగా రాష్ట్ర విభజనను అడ్డుకొంటానని ఆయన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరినీ  త్రప్పు ద్రోవ పట్టించి విభజన జరిగేందుకు కారకుడయ్యాడని బొత్ససత్యనారాయణ, రామచంద్రయ్య, చిరంజీవి వంటివారు విస్పష్టంగా చెపుతున్నారు. అంటే ఈ విషయం వారికి కూడా తెలిసినప్పటికీ రాష్ట్ర విభజన జరిగే వరకు అందరూ మౌనంగా ఉండిపోయి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ అధిష్టానానికి అందరూ సహకరించారని వారే స్వయంగా అంగీకరిస్తున్నారన్న మాట!   ఇక కిరణ్ విషయానికి వస్తే ఆయన అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ రాజీనామా చేస్తున్న తరుణంలో కూడా సోనియా, రాహుల్ గాంధీలని తీవ్రంగా విమర్శించకపోగా, తనకు ఈ హోదా, గౌరవం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటూ పదవి నుండి సవినయంగా తప్పుకొన్నారు. అందువల్ల  నేటికీ ఆయన కాంగ్రెస్ విధేయుడేనని స్పష్టమవుతోంది. బొత్స తదితరులు చెప్పిన మాటల ప్రకారం చూసినట్లయితే రాష్ట్ర విభజనలో అధిష్టానానికి ఆయనే సహకరించారని అర్ధం అవుతోంది.   మరి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి, ఇంతగా విధేయత చూపిస్తున్న ఆయన ఎన్నికల తరువాత తన పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే కలిపేయకుండా ఉండరని భావించే ప్రజలకు ఏవిధంగా నమ్మకం కలిగించగలరు? ఇంతకీ ఆయన కొత్త పార్టీ దేనికోసం సాధిస్తున్నారు? అని ఆలోచిస్తే అది కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా ఓట్లు చీల్చి తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోనేందుకే తప్ప ఏదో సాధించడానికి కాదని అర్ధమవుతుంది.

మాతృభాషతోనే సృజనాత్మకత

      మీ పిల్లలు అమ్మ భాషలో మాట్లాడుతున్నారా? అంటే మాతృ బాషలో. అచ్చ తెలుగులో ఎంచక్కా మాట్లాడగలిగితే పరవాలేదు. లేకపోతె మాత్రం పరిశోధకులు చెప్తున్నా ఈ విషయాన్నీ గమనించండి.   ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది ఏంటంటే... మాతృభాషలో చక్కగా మాట్లాడగలిగే పిల్లల్లో సృజనాత్మకత, పరాయి బాషలలో మాట్లాడే పిల్లల్లో కంటే ఎక్కువ ఉంటుందట. అంటే ... పూర్తిగా మాతృభాషలో ఆలోచించటం మానేస్తే, వినూత్నతకు దూరమైపోయినట్లే. సహజంగా బాష బీజాలు తల్లి గర్భంలో ఉండగానే పడతాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. బిడ్డ పుట్టి పెరుగుతున్నప్పుడు చుట్టూ ఉండే వారిని గమనిస్తూ, మాటలు నేర్చుకుంటూ, భావాలను వ్యక్తీకరించటం మొదలు పెడతాడు. అన్నీ భావావేశాలను చక్కగా వ్యక్తీకరించగలుగుతాడు. ఎప్పుడైతే వేరే భాషలో మాత్రమే మాట్లాడవలసి వస్తుందో.. అప్పుడు తన భావవ్యక్తీకరణలో మార్పు రావడం మొదలు పెడుతుందట. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో మాతృభాషలోనే మాట్లాడటం మంచిది అంటున్నారు పరిశోధకులు. అలాగే గేయాలు, కథలు, పద్యాలు వంటి వాటిని మాతృభాషలో నేర్పిస్తే పిల్లల్లో మాతృభాష పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు వస్తుంది. అలాగే తన భావాలను చక్కగా, స్పష్టంగా వ్యక్తీకరించే నేర్పు కూడా వస్తుంది. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అంటే అమ్మ భాషను పది కాలాల పాటు కాపాడుకోవడానికి, అలాగే ఆ భాష తీయదనాన్ని ముందు తరాలకు చేరేలా చేయటానికి మనం ఏం చేయాలి అన్నది సమాలోచించుకోవలసిన రోజు. ప్రభుత్వం ఏం చేయాలన్నది పక్కన పెడితే.. వ్యక్తులుగా మన పరిధిలో మనం ఏం చేయగలం అన్నది ఆలోచించాలి. దానికి పునాది మన ఇంటినుంచే పడాలి. పరాయి భాషలను గౌరవిస్తూ, మన మాతృభాషను పూజించటం ఎలాగో పిల్లలకు నేర్పాలి. తేట తెలుగు తీయదనాన్ని రుచి చూపించాలి. అందుకు చేయవలసిందల్లా పిల్లలతో అచ్చ తెలుగులో మాట్లాడటం, చిట్టి చిలకమ్మా వంటి కధాగేయాలను, పద్యాలనూ నేర్పించటం, కథలు, పొడుపు కథలు, సామెతలు మొదలైన వాటిని పిల్లలకు చెప్పటం అలాగే మన తిధి, వార, నక్షత్రాలను నేర్చుకునేలా చేయటం. ఇవన్నీ పిల్లల్లో భాషపట్ల ఆసక్తిని రేకెత్తిస్తాయి. తెలుగులో మాట్లాడటమే కాదు. చదవటం, రాయటం నేర్పించటం కూడా ముఖ్యమే. అప్పుడే రేపటి తరం వరకు తెలుగు భాష నిలిచేది. ఇదంతా భాషకి మనం చేసే సేవ అని అనుకున్నా మంచిదే. ఎవరి పరిధిలో వారు ఎంతో కొంత చేయటం మొదలు పెడితేనే భాష మనగలిగేది. అంతకన్నా ముఖ్యంగా అమ్మ భాష పిల్లల సృజనాత్మక సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది అని అధ్యయనాలు గట్టిగా చెబుతున్నాయి కాబట్టి... పిల్లలను తెలుగులో మాట్లాడగలిగేలా, రాయగలిగేలా ప్రోత్సహిద్దాం. ......రమ

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళ ఘటనకు ఏడాది

గత ఏడాది సరిగ్గా ఇదే రోజు హైదరాబాద్ నగరం బాంబు పేలుళ్ళతో ఉలిక్కి పడింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు రాత్రి ఏడుగంటల సమయంలో దిల్ సుఖ్ నగర్ లో కోణార్క్ ధియేటర్ వద్ద,  107 బస్ స్టాప్ వద్ద, ఎ1 మిర్చి సెంటర్ వద్ద బాంబు పేలుళ్లు జరపడంతో 17మంది మృతి చెందగా,  138 మంది గాయాలపాలయ్యారు. ఇప్పటికి బాధితుల కుటుంబాలను ఆ విషాదఛాయలు వెంటాడుతూనే వున్నాయి.  చాలా మంది కుటుంబాలు తమ ఆధారాన్ని కోల్పోయాయి. ఉజ్వల భవిష్యత్తు కనుమరుగై మంచానికే పరిమితమయ్యారు మరికొ౦దరూ, ఆదుకుంటామన్న ప్రభుత్వ౦ చేయూత నివ్వకపోవడంతో...ఇప్పటికి చాలా కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.                       ఈ సందర్భంగా ఘటనా స్థలంకోణార్క్ థియేటర్ వద్ద పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు నివాళులర్పించారు. ఘటనలో మృతి చెందిన వారికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడికి చేరుకున్న మృతుల బంధువులు ఘటనను తల్చుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలువురు విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.  

టీ ఆవిర్భావ తేదీపై దృష్టి పెట్టాం: షిండే

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తేదీపై దృష్టి పెట్టినట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లు ఆమోదం, ముఖ్యమంత్రి రాజీనామాతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి నట్లు సమాచారం. గవర్నర్ పంపించిన నివేదిక తమకు ఇంకా అందలేదని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలా లేక కొత్త ముఖ్యమంత్రిని నియమించాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని అన్నారు. రాష్ట్రపాతి పాలన వద్దని ఇరుప్రాంత కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు.

ఈ (చిరం)జీవి ప్రయాస దేనికో?

  నిన్న రాజ్యసభలో చిరంజీవి మొట్ట మొదటిసారిగా ప్రసంగించబోతుంటే, అంతవరకు సభ్యుల నినాదాలతో హోరెత్తిన సభ ఒక్కసారిగా నిశబ్దమయింది. ఆయన ఈ అంశం గురించి చాలా అద్భుతంగా ప్రసంగిస్తారని అందరూ ఎదురు చూసారు. కానీ షరా మామూలుగానే ఆయన తడబడుతూ మొదలు బెట్టిన ప్రసంగంలో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనే పనిలో బీజేపీ, తెదేపా, వైకాపాలను విమర్శిస్తూ కాంగ్రెస్ చర్యలను సమర్దించే ప్రయత్నం చేయబోగా ప్రతిపక్షాలు ఇంతకీ “తమరు ఏ పార్టీ తరపున ఏ వైఖరితో మాట్లాడుతున్నారని?”నిలదీయడం చూస్తే ఆయన ప్రసంగం ఎంత అయోమయంగా ఉందో అర్ధమవుతుంది. తాను వ్యక్తిగతంగా, కాంగ్రెస్ వాదిగా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నాని చెపుతూనే, క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా తన అధిష్టానం తీసుకొన్న నిర్ణయాన్ని పూర్తిగా సమర్దిస్తున్నానని తెలిపి సోనియమ్మను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసారు. హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని, సీమాంధ్రకు నిర్దిష్టమయిన ప్యాకేజీలు కావాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.   అయితే, ఇంతవరకు సీమాంధ్ర యంపీలు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఎన్నిసార్లు ప్రాదేయపడినా పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం, రాజ్యసభలో బిల్లుని ఆమోదింపజేయడానికి సిద్దమవుతున్న తరుణంలో తన విన్నపాలను ఎందుకు చెవికెక్కించుకోదనే సంగతి తెలిసి ఉన్నపటికీ చిరంజీవి తన డిమాండ్ల చిట్టాను మరోసారి సభలో బిగ్గరగా చదివి వినిపించారు. బహుశః తను కూడా సీమాంధ్ర కోసం చాలా గట్టిగా పోరాడానని సీమాంధ్ర ప్రజలు గ్రహించాలనే ఆశతోనే శ్రమపడి ఉంటారు. కానీ, ఆయన తన ప్రసంగం మొదలుపెట్టగానే మొట్ట మొదట తన అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి రాష్ట్ర విభజనకు అంగీకరిస్తున్నాని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పిన తరువాత ఇంకా ఈ వృదా ప్రయాస అంతా దేనికో? ఏమి సాధించాలనో? ఆయనకే తెలియాలి. రానున్న ఎన్నికలలో అయన పోటీ చేసేమాటయితే తన గురించి సీమాంధ్ర ప్రజలు ఏమని భావిస్తున్నారో తప్పకుండా తెలుసుకొనే గొప్ప అవకాశం కలుగుతుంది. మరి ఆయన అవకాశం వినియోగించుకొంటారో లేదో మరి!

అన్నదమ్ముల్లా ఉందాం: కేసిఆర్

      రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో తెలంగాణ వాదులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ పార్లమెంట్ నుంచి తన నివాసానికి చేరుకున్న సమయంలో పార్టీ నేతలు ఆనందంతో బాణాసంచా పేల్చి తమ సంతోషాన్ని చాటారు. కేసిఆర్ మీడియాతో మాట్లాడుతూ...పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ దృడ సంకల్పతోనె తెలంగాణ కల సహకారమైందని అన్నారు. ఇది 'ఒక ప్రాంత ఓటమి..మరో ప్రాంత గెలుపు'కాదని అన్నారు. రాష్ట్ర విభజన ఉద్యమంలో ఇరు ప్రాంత మేధావులు, నేతలు మధ్య ఏర్పడిన వైషమ్యాలు మర్చిపోయి ఒకరికి ఒకరు పరస్పరం సహకరించుకుందామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా తెలుగురాష్ట్రాలను అభివృద్ధి చేసి, తెలుగు ప్రజలు ఎవరికి తీసిపోరని నిరూపిద్దమని చెప్పారు.  హైదరాబాద్ లో ఉన్నవాల్లందరూ మా వాళ్ళే, అందరం కలిసిమెలిసి హైదరాబాద్ ను విశ్వనగరంగా రూపాంతరం చేద్దామని పిలుపునిచ్చారు.  

తెదేపా బీజేపీతో పొత్తులు పెట్టుకొనే సాహసం చేయగలదా?

  సీమాంధ్ర ప్రజలు తమ అభిప్రాయాలను పూచికపులల్లా తీసి పక్కనపడేసి రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీపై పగతో రగిలిపోతున్నారు. విభజనను అడ్డుకొంటామన్నట్లు మాట్లాడి చివరి నిమిషంలో విభజనకు పూర్తి మద్దతు తెలిపిన బీజేపీపై కూడా వారు అంతే కక్షతో, పగతో రగిలిపోతున్నారు. రానున్న ఎన్నికలలో ఆ రెండు పార్టీలకు తగిన గుణపాటం చెప్పేందుకు వారు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీతో ఎన్నికల పొత్తులకు తెదేపా సాహసిస్తుందని ఎవరూ భావించలేరు. ఒకవేళ దైర్యంచేసో, కక్కుర్తి పడో పొత్తులు పెట్టుకొంటే అది తేదేపాకు రాజకీయంగా ఆత్మహత్యతో సమానమవుతుంది. గనుక పొత్తులు పెట్టుకోకపోవచ్చును.   అంటే, ఆ రెండు పార్టీలు కూడా ఆంధ్ర తెలంగాణా ప్రాంతలలో ఒంటరి పోరాటం చేయక తప్పదన్నమాట! ఆ రెండు పార్టీలు చేతులు కలిపినట్లయితే ఎంత బలంగా ఉంటాయో అందరికీ తెలుసు. కానీ రాష్ట్ర విభజన అంశం వారి మధ్య కూడా చిచ్చుపెట్టి వాటిని పూర్తిగా బలహీనపరిచింది. రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ ఆశించిన అనేక ప్రయోజనాలలో బహుశః ఇది కూడా ఒకటని చెప్పక తప్పదు.   కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు ఎన్నికల పొత్తులు పెట్టుకోకపోయినా ఎన్నికల తరువాత ఒకవేళ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే గనుక తెదేపా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాలలో శాశ్విత శత్రువులు లేదా మిత్రులు ఉండరనే సిద్ధాంతం ఉండనే ఉంది.

తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా?

  ఈ ఎన్నికలలో తెరాస తిరుగులేని మెజార్టీ సాధించవచ్చని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి గనుక, ప్రస్తుతానికి తెరాస-కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల పొత్తులతో సరిబెట్టుకోవడం ద్వారా తెదేపా, బీజేపీలను పూర్తిగా దెబ్బ తీసే ప్రయత్నం చేయవచ్చును. ఆవిధంగా చేయడం ద్వారానే తెరాసకు మేలు కలుగుతుంది. ఒకవేళ ఇప్పుడే విలీనం చేసినట్లయితే, ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రానట్లయితే, అది తెరాసకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అదే పూతుఉలతో సరిబెట్టేస్తే, అవసరమయితే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తెలంగాణాకు అవసరమయినవన్నీ సాధించుకొనే అవకాశం ఉంటుంది. గనుక తెరాస కాంగ్రెస్ తో పొత్తులతోనే సరిపెట్టవచ్చును.

విభజన తరువాత ఏమిటి?

  రాష్ట్రవిభజన వ్యవహారం ఒక కొలిక్కి రావడంతో ఇప్పుడు తరువాత ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిలో ప్రధానంగా చర్చించబడుతున్నవి 1. రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విధిస్తారా లేక తెరాస, మజ్లిస్ తదితర పార్టీల మద్దతుతో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ పగ్గాలు చేపడుతుందా? 2. చేపడితే ముఖ్యమంత్రి ఎవరు? 3. ఎన్నికలు సమైక్య రాష్ట్రంలో నిర్వహిస్తారా లేక ఎన్నికలలోగానే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసి వేర్వేరుగా నిర్వహిస్తారా? ఇటువంటి అనేక ప్రశ్నలు చాలానే ఉన్నపటికీ మొదట ఈ మూడు ప్రశ్నలకే సమాధానం తెలియవలసి ఉంది.   తాజా సమాచారం ప్రకారం నేడో రేపో రాష్ట్రపతి పాలన విదిస్తూ ప్రకటన వెలువడనుంది. అయితే, ప్రస్తుత శాసనసభను రద్దు చేయకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యేవరకు తాత్కాలికంగా నిద్రావస్థలో ఉంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల ముందు ఏ పార్టీ అధికారం వదులుకోవాలని భావించదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నయాన్నో భయాన్నో అందరి మద్దతు కూడగట్టి ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టె ప్రయత్నాలు చేయవచ్చును.   ఎన్నికలలోగా మిగిలిన రాష్ట్రవిభజన ప్రక్రియ అంటే రాష్ట్రపతి ఆమోదం, కొత్త రాష్ట్రా ఏర్పాటుకి గజిట్ నోటిఫికేషన్ విడుదల వంటివి పూర్తి కావడం కష్టం గనుక, అంతవరకు రాష్ట్రం యధాతధ స్థితిలో ఉంటుంది గనుక కొత్త ముఖ్యమంత్రి నియమించవచ్చును. రానున్న ఎన్నికలలో తెలంగాణాలో అన్ని యంపీ, యం.యల్యే. సీట్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, తెరాసలు భావిస్తున్నాయి గనుక, అందుకు మార్గం సుగమం చేసేందుకు తెలంగాణాకు చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా నియమించవచ్చును. అదే ఎవరనేది కాంగ్రెస్-తెరాసల మధ్య ఏర్పడే అవగాహనపై ఆధారపడి ఉంటుంది.

సీమాంధ్రలో శాసనసభ ఎన్నికలు వాయిదా?

  రాజ్యసభ నిన్న తెలంగాణా ఏర్పాటుకి మార్గం సుగమం చేయడంతో, త్వరలో జరగనున్న ఎన్నికలు సమైక్య రాష్ట్రంలో నిర్వహిస్తారా? లేక వేర్పడిన రాష్ట్రాలలో విడివిడిగా నిర్వహిస్తారా?అనే ప్రశ్న తలెత్తింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినట్లయితే తెలంగాణాలో తెరాస-కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం ఖాయమే. కానీ, సీమాంధ్రలో మాత్రం కాంగ్రెస్ దారుణంగా దెబ్బ తింటుంది. గనుక, పరిస్థితులు చక్కబడే వరకు శాసనసభ ఎన్నికలు వాయిదా వేయమని కొందరు సీమాంధ్ర మంత్రులు కోరుతున్నట్లు సమాచారం. అయితే విజయోత్సాహంతో ఉన్న తెరాస, టీ-కాంగ్రెస్ నేతలు ఎంత మాత్రం ఒప్పుకోకపోవచ్చు గనుక, ఎలాగయినా ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేయగలిగినట్లయితే, అప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కోరిన విధంగా పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తరువాత సీమాంధ్రలో ఎన్నికలు నిర్వహించవచ్చును.   కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర విభజన చేసింది గనుక, ఇప్పుడు కూడా బహుశః ఇదే విధంగా వ్యవహరించవచ్చును. ఎందుకంటే, ఆ పార్టీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావాలంటే కేవలం యంపీ సీట్లే అవసరం కానీ శాసనసభ సీట్లు కాదు. అందువలన వీలయితే సీమాంధ్రలో శాసనసభ ఎన్నికలు వాయిదా వేసినా ఆశ్చర్యం లేదు. అయితే, ఎన్నికలలోగా అది అధికారికంగా తెలంగాణా ఏర్పాటు చేయగలిగినప్పుడే ఈ ఆలోచన సాధ్యమవుతుంది. కానీ వీలుకాకపోతే సమైక్య రాష్ట్రంలోనే ఒకేసారి లోక్ సభ, శాసనసభ ఎన్నికలు నిర్వహించక తప్పదు.

తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

      రాజ్యసభ తెలంగాణా బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లుకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికాయి. ప్రొద్దున నుండి తీవ్ర గందరగోళం మధ్య అనేకసార్లు వాయిదాపడుతూ వచ్చిన రాజ్యసభ సమావేశాలలో ఊహించినట్లుగానే కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం చేసిన తరువాత అంతిమంగా రెండు పార్టీలు కూడా బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదింపజేసాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ బిల్లులో పలుసవరణలు సూచించినప్పటికీ, కొన్నిటిని సభ మూజువాణి ఓటుతో తిరస్కరించగా, మరికొన్నిటిని వారే స్వయంగా ఉపసంహరించుకొన్నారు. వెంకయ్య నాయుడు సీమాంధ్రకు న్యాయం చేయాలని గట్టిగా వాదిస్తూనే బిల్లుకి పూర్తి మద్దతు ఇస్తామని పదేపదే కాంగ్రెస్ పార్టీకి హామీ ఇవ్వడం విశేషం.   సీపీయం, తృణమూల్ కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీయంకే, అసోం గణపరిషత్, శివసేన, సమాజ్ వాడీ పార్టీలు బిల్లుని వ్యతిరేఖించగా, కాంగ్రెస్, బీజేపీ,సీపీఐ, అకాలిదళ్, బీయస్పీ తదితర పార్టీలు బిల్లుని సమర్ధించాయి. బిల్లుపై క్లాజులవారిగా మూజువాణి ఓటింగ్ నిర్వహించిన రాజ్యసభ ఉపసభాపతి కురియన్ అంతిమంగా తెలంగాణా బిల్లుని మొత్తంగా సభ మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు ప్రకటించారు. దీనితో ఇక రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు పూర్తయిపోయినట్లే. రాష్ట్రపతి ఆమోదముద్రపడటం కేవలం సాంకేతికమే గనుక ఇక తెలంగాణా ప్రజల ప్రత్యేక రాష్ట్రం కల నేటితో సాకారమయినట్లే.