విభజనపై ఏడుస్తున్న లగడపాటి

      సమైక్యవాదుల సభలో రాష్ట్రవిభజనను తలుచుకొని లగడపాటి రాజగోపాల్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఢిల్లీలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రామ్‌లీలా మైదానంలో సోమవారం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ...మరో నాలుగు రోజులు పార్లమెంటు నడుస్తుందని, తమను సస్పెండ్ చేసి బయట పెట్టినా ఈ నాలుగు రోజుల్లో కచ్చితంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తెలంగాణ బిల్లు పార్లమెంటులో వచ్చే సమయానికి లోపల అడుగుపెట్టి తీరుతామని ఆవేశంగా ప్రకటించారు. ఆ సమయంలో ఆయన హఠాత్తుగా విలపిస్తూ కూర్చుండిపోయారు. మధ్యలోనే తన ప్రసంగాన్ని ఆపేశారు. కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. వేదికపై ఉన్న అశోక్‌బాబు తదితరులు లగడపాటిని సముదాయించారు.

నేడు తెలంగాణ బిల్లు ఆమోదం

      తెలంగాణ బిల్లుకు మంగళవారం లోక్ సభలో ఆమోదం లభిస్తుందని, పార్టీ శ్రేణులు సంబరాలకు సన్నాహాలు చేసుకొండనీ టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఫోన్ చేసి స్పష్టం చేసినట్లు సమాచారం. లోక్‌సభలో మంగళవారం టీ బిల్లుపై స్వయంగా సోనియాగాంధీ చర్చను ప్రారంభిస్తారని, ఓటింగ్ ద్వారా బిల్లును ఆమోదం లభిస్తుందని అన్నారు. ఈ రోజు సీఎం కిరణ్ రాజీనామా చేయడానికి ముందే బిల్లు ఆమోదం పొందుతుందని, సాయంత్రానికి బిల్లును రాజ్యసభకు పంపుతున్నట్లు ప్రకటన వస్తుందని చెప్పారు. గురువారం నాటికి రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందుతుందని వివరించారు. హైదరాబాద్ యూటీ లేదా యూటీ తరహా ఏర్పాట్లకు లేదా రాయల తెలంగాణ ప్రతిపాదనకు ఒప్పుకోవాలంటూ జైరాం తనను కోరిన అంగీకరించలేదని స్పష్టం చేశారు.

కిరణ్ రాజీనామా చేస్తారా?

      నేడు పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ చేపట్టి, బిల్లు ఆమోదించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సీఎం కిరణ్ రాజీనామాపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చర్చ ప్రారంభమై బిల్లు ఆమోదం పొందే దిశగా వాతావరణం కన్పిస్తే తక్షణమే రాజీనామాను గవర్నర్‌కు సమర్పించాలని కిరణ్ భావిస్తున్నారు. ఇదే సమయంలో సీఎం శిబిరంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. మంగళవారం లోక్‌సభలో బిల్లుపై చర్చ ప్రారంభం కావడంపైనే వీరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చర్చ మొదలైతే మాత్రం రాజీనామా చేస్తారని పేర్కొంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించేందుకు కిరణ్ సన్నద్ధమవుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వివరిస్తున్నాయి.

రాష్ట్ర విభజనతో రాహుల్ గాంధీ భవిష్యత్తుకి దెబ్బ

  ఒకవైపు జంతర్ మంతర్ వద్ద వైకాపా సమైక్య ధర్నా మరో వైపు రామ్ లీలా మైదానంలో ఏపీయన్జీవోల సమైక్య సభ ఈరోజే జరిగాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం వాటి గురించి అసలు పట్టించుకొనే లేదు. లక్షలాది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి రెండున్నర నెలలు ఉద్యమించినా పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం, స్వయంగా తన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, కేంద్రమంత్రులు, యంపీలు డిల్లీలో తన కళ్ళెదుటే ధర్నా చేసినప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొన్న కాంగ్రెస్ అధిష్టానం, ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు భయపడి వెనక్కి తగ్గుతుందని ఎవరూ భావించరు. అయితే, ప్రజాభిప్రాయాన్ని పెడచెవినబెట్టి కాంగ్రెస్ అధిష్టానం ఏవిధంగా రాష్ట్ర విభజనకు పూనుకొంటోందో ఈ సభలు, ధర్నాలతో, పార్లమెంటులో నిత్యం జరుగుతున్న ఆందోళనలతో యావత్ దేశానికి తెలిసింది.   బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ తన ప్రతీ సభలో కూడా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతుంటే, అదే సమయంలో అద్వానీ, వెంకయ్య నాయుడు, సుష్మాస్వరాజ్, జైట్లీ, జవదేకర్ వంటి బీజేపీ నేతలందరూ మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతున్నారు. జాతీయ మీడియా తెలుగు ప్రజల గోడు పట్టించుకోకపోవచ్చునేమో కానీ, ఈ వ్యవహారంలో బీజేపీ అగ్రనేతలు చెపుతున్న విషయాల గురించి ప్రముఖంగా ప్రచురిస్తున్నందున, వారి ద్వారా తెలుగు ప్రజల ఆవేదన దేశ ప్రజలందరికీ ఎప్పటికప్పుడు చేరుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పట్ల వ్యతిరేఖతతో ఉన్న దేశ ప్రజలలో ఇదంతా మరింత వ్యతిరేఖత పెంచడం తధ్యం. దానివలన కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలుగుతున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం అంత దూరం ఆలోచించే స్థితిలో లేదు కనుక, మొండిగా ముందుకే పోతోంది.   రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణాలో 15 యంపీ సీట్లను తన ఖాతాలో పడేలా చేసుకొని రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలని తపిస్తున్న సోనియాగాంధీ, సరిగ్గా ఇదే వ్యవహారంతో దేశవ్యాప్తంగా మరింత వ్యతిరేఖతను చేజేతులా సృష్టించుకొని కనీసం నూరు యంపీ సీట్లయినా సాధించుకోలేకపోతే, ఇక తెలంగాణా లో ఎన్ని సీట్లు వస్తే మాత్రం ఏమి లాభం? అప్పుడు కాంగ్రెస్ పని వ్రతం చెడినా ఫలం దక్కనట్లవుతుంది. దురాశకు పోయి దురాలోచన చేసినందుకు కాంగ్రెస్ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ఈసారి అధికారం దక్కించుకోలేకపోతే ఇక రాహుల్ గాంధీ మరొక పది పదిహేనేళ్ళవరకు ప్రధాని కుర్చీ వైపు కన్నెత్తి చూసేపని కూడా ఉండదు.

'టీ' బిల్లుపై 4 గంటల చర్చ ...

      తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో బిజెపి నేత వెంకయ్యనాయుడుతో భేటీ అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా తెలంగాణా బిల్లుపై మద్దతు కోరారు. వెంకయ్యనాయుడు తాము సూచించిన సవరణలు చేస్తే తాము మద్దతుకు వ్యతిరేకం కాదని అన్నారు. అలాగే బిజెపి అగ్రనాయకులైన అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీతో కాంగ్రెస్ నాయకులు జైరామ్ రమేష్, షిండే కూడా సమావేశమయ్యారు. తెలంగాణా బిల్లుపై వారి మద్దతును కోరి సవరణలపై చర్చ కొనసాగించారు. రేపటి సమావేశాల్లో బడ్జెట్ పై చర్చ జరిగిన తరువాత తెలంగాణా బిల్లుపై చర్చకు 4 గంటల సమయాన్ని కేటాయించారు. పార్లమెంటు నుంచి వచ్చిన బిల్లును రాజ్యసభలో చర్చిందుకు 2 గంటల సమయాన్ని కేటాయించనున్నారని సమాచారం.

ఆరునూరైనా 'టి' బిల్లుపై చర్చ

      లోక్ సభలో తెలంగాణా బిల్లుపై మంగళవారం చర్చ జరుగుతుందని పార్లమెంటరీ శాఖ మంత్రి కమల్‌నాథ్ వెల్లడించారు. లోక్ సభలో చిదంబరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో సీమాంధ్ర మంత్రులు సమైక్య నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. ఈ సమయంలో సభలో అటూ ఇటూ తిరుగుతూ హడావుడి చేస్తున్న కమలనాథ్, సీమాంద్ర మంత్రుల వద్దకు వెళ్లి మీరు ఏమైనా చేసుకోండీ..రేపు తెలంగాణా బిల్లుపై చర్చ జరిగితీరుతుంది అని చెప్పారు. సీమాంధ్ర సభ్యులు సభలో నినాదాలు చేస్తున్నప్పుడు.. చిదంబరానికి తమిళనాడుకు చెందిన ఎంపీలు ఆ పక్కనే రక్షణగా నిలబడ్డారు. మధ్యలో సమాజ్‌వాది సభ్యులు సీమాంధ్ర మంత్రులకు మద్దతుగా ముందుకువచ్చినప్పుడు కమల్‌నాథ్ వెంటనే ములాయంవద్దకు వెళ్లి మీ వాళ్లను గొడవ చేయవద్దని వెనక్కి పిలిపించండీ అని బ్రతిమలాడారు. 

సుప్రీంకోర్ట్ లో సమైక్య పిటిషన్ల తిరస్కరణ

      ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై దాఖలైన మూడు పిటిషన్లను సుప్రీంకోర్టు మళ్లీ తిరస్కరించింది. బిల్లు లోక్ సభ పరిధిలో ఉండగా ఎలా జోక్యం చేసుకుంటామని జస్టిస్ దత్ ప్రశ్నించారు. సరైన సమయంలో మళ్లీ పిటిషన్లు వేయాలని, ఇది విభజన వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సరయిన సమయం కాదని న్యాయస్థానం సూచించింది. గతంలో సీనియర్ న్యాయవాదులు వాదించినప్పుడు కూడా ఇదే సమాధానం ఇచ్చామని న్యాయస్థానం వెల్లడించింది. కొద్ది రోజులు క్రితం టీడీపీ నేత పయ్యావుల కేశవ్, బీజేపీ నేత రఘురామకృష్ణం రాజులతో పాటు మరో ఐదుగురు సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. పలు అంశాల మీద న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పుడు కూడా సుప్రీంకోర్టు పిటీషన్లను తిరస్కరించింది.

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2014-2015 ముఖ్యాంశాలు

      సామాన్యునికి ముందుంది బంగారు భవిష్యత్తు అనే భరోసా ఇస్తూ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం 2014-2015వ సంవత్సరానికి సోమవారంనాడు పార్లమెంటులో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర సరకుల ధరలు త్వరలోనే దిగివస్తాయని ఆయన హామీ ఇచ్చారు. రక్షణ శాఖకు, కుటుంబ సంక్షేమానికి, విద్య, వ్యవసాయ రంగాలకు పెద్ద పీట వేస్తున్నట్టు ఆయన తమ బడ్జెట్‌లో పేర్కొన్నారు. చిదంబరం బడ్జెట్ ముఖ్యాంశాలు: 1. ద్రవ్యలోటు 4.6 శాతానికే పరిమితమైంది 2. జనవరి చివరినాటికి ద్రవ్యోల్బణం 5.5 శాతం ఉంది 3. 2013-2014 నాటికి 225 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది 4. 2014 లో 263 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి అంచనా 5. 2013-2014లో 7 లక్షల 35కోట్ల వ్యవసాయ రుణాలు అందించాం 6. 2012-2013లో 326 బిలయన్ డాలర్ల ఎగుమతి జరిగింది. 7. దేశంలో మరో మూడు తయారీరంగ పారిశ్రామిక జోన్లు 8. 2011-2012 ఆర్థిక సంవత్సరం నుంచి మందగమనం ప్రారంభమైంది. 9. పదేళ్లక్రితం దేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తి లక్ష 20 వేల మెగావాట్లు. 10. ప్రస్తుతం 2లక్షల 44వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగింది 11. ఉన్నత విద్యకు 79,459 కోట్లు కేటాయింపు 12. వైద్యరంగానికి 36,300 కోట్లు కేటాయింపు 13. 1999-2004 నాటికి జీడీపీ వృద్ధి రేటు 5.9 శాతం 14. 2004-2009 నాటికి జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతం 15. చక్కెర పరిశ్రమలపై నియంత్రణలను పూర్తిగా తొలగించాం 16. డిజిల్ ధరలను మార్కెట్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం 17. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 67 శాతం ప్రజలకు ఆహార భద్రత అందిస్తున్నాం 18. దేశంలో 50 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి 19. విదేశీ పెట్టుబడులకు సానుకూల వాతావరణం కల్పించాం 20. ఫార్మా, విమానయాన, మల్టీబ్రాండ్, రిటైల్‌రంగంలో నిబంధనలు సరళతరం చేశాం 21. 45 బిలియన్ డాలర్లుగా కరెంట్ ఖాతా లోటు ఉంది. 22. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనా 5.2శాతం 23. 2013-2014 మూడు, నాలుగు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ కోలుకుంది 24. ఈశాన్య రాష్ర్టాలైన హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు 12 వేల కోట్లు అదనపు కేటాయింపు 25. అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రోకు అదనపు సాయం. 26. రూ.1000 కోట్లతో నిర్భయ ఫండ్ 27. యూపీఏ సగటు వద్ధి రేటు సూచీలు ఎన్‌డీఏ హయం కంటే మెరుగ్గా ఉన్నాయి 28. జాతీయ నైపుణ్య అభివద్ధి పథకానికి రూ. 1000 కోట్లు 29. 27 పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టాం 30. ఆధార్‌కు ప్రభుత్వం కట్టుబడే ఉంది. 31. ఇప్పటి వరకు 57 కోట్ల మంది ఆధార్‌లోకి వచ్చారు. 32. 2013-2014 నాటికి వద్ధిరేటు అంచనా 4.9 శాతం. 33. 2014-2015లో రూ. 5 లక్షల 55 వేల 333 కోట్లుగా ప్రణాళిక వ్యయం

కిరణ్ కు పోటీగా బొత్స సమావేశం

  పీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ పైకి సమైక్యవాదం చేయవచ్చు గాక. చివరికి ముఖ్యమంత్రితో కలిసి డిల్లీలో ధర్నా చేయవచ్చు గాక. కానీ అధిష్టానం, సమైక్యవాదం రెంటిలో దేనినో ఒకదానిని ఎంచుకోమంటే మాత్రం ఆయన ఖచ్చితంగా అధిష్టానంవైపే మొగ్గు చూపుతారని అందరికీ తెలుసు. అందుకే ఆయన పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్న వారితో తరచు యుద్ధం చేస్తూ కనబడుతుంటారు. అయితే, తనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న కారణంగా ముఖ్యమంత్రిని విమర్శించే దైర్యం చేయలేకపోతున్నారు. కానీ, ఆయన సన్నిహితులయిన గంటా శ్రీనివాసరావు వంటి వారిని విమర్శిస్తూ పరోక్షంగా ముఖ్యమంత్రికి చురకలు అంటించే ప్రయత్నం చేస్తుంటారు.   కానీ ఇప్పుడు ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా నేడో రేపో రాజీనామా చేసి బయటకి పోవడం ఖాయమని తెలుస్తోంది గనుక, "ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడూ ఇటువంటి సమయంలో రాజీనామా చేయడు, కొత్త పార్టీ పెట్టడు. పెట్టినా అందులో ఎవడూ చేరడు" అని ముఖ్యమంత్రి మీద నేరుగా, కొంచెం ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిని విమర్శిస్తూ నేరుగా ఆయనకే ఒక లేఖ వ్రాసారు. నామినేటడ్  విప్  పదవులకు అధిష్టానం సూచించినవారిని కాదని, తనకు నచ్చిన వ్యక్తులను నియామకం చేయడాన్ని తప్పు పడుతూ లేఖ వ్రాసారు. ఆ పదవులను బలహీన వర్గాలకు చెందిన వారికి ఇవ్వకపోవడాన్ని కూడా ఆయన ఆక్షేపించారు. కిరణ్ కుమార్ రెడ్డి తన రాజీనామా, కొత్త పార్టీ స్థాపనపై తుది నిర్ణయం తీసుకొనేందుకు నిన్న తన సహచరులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడంతో, మరిక తను కూడా రంగంలో దూకవలసిన సమయం ఆసన్నమయిందని భావించిన బొత్ససత్యనారాయణ, ఈరోజు సాయంత్రం తన ఇంట్లో అధిష్టానానికి విధేయులు, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేఖించేవారితో ఒక సమావేశం నిర్వహించ బోతున్నారు.   మంత్రులు కొండ్రు మురళి, రఘువీరారెడ్డి, బాలరాజు, కాసు కృష్ణారెడ్డి తదితరులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీలో ఉండేదెవరో? పోయేదెవరో అందరి పేర్లతో కూడిన లిస్టు తన వద్ద సిద్దంగా ఉందని చాలా రోజుల క్రితమే ప్రకటించిన బొత్ససత్యనారాయణ, ఇప్పుడు వాళ్ళంతా బయటకి పోగానే పార్టీపై పూర్తి పట్టు సాధించి రానున్న ఎన్నికలలో చక్రం తిప్పాలని ఆశపడటం సహజమే. బహుశః అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉండవచ్చును. ఈ సమావేశానికి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడయిన మంత్రి శైలజానాథ్ ని కూడా ఆహ్వానించడం విశేషం. ముఖ్యమంత్రి మరియు ఆయన వర్గం ఎప్పుడు పార్టీ నుండి తప్పుకోబోతున్నారో ఆయన ద్వారా తెలుసుకోవాలని బొత్స ఆశిస్తున్నరేమో!   ఇంతవరకు అందరూ ఒకే పార్టీలో ఉంటున్న కారణంగా బొత్స సత్యనారాయణ పెద్దగా విమర్శించలేకపోయినా, రేపు వారందరూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకి పోగానే ఆయన కిరణ్ కుమార్ రెడ్డితో సహా అందరిపై తన బాణాలు ఎక్కు బెట్టి ఇంతకాలంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసిన తప్పులను ఎండగట్టడం ఖాయం.

కాంగ్రెస్ అసమదీయులు, తసమదీయులెవరంటే

  ఈరోజు ఆర్ధికమంత్రి చిదంబరం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మొత్తం సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, మంత్రులు అందరూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగుతారని అందరూ భావించారు. కానీ, కేంద్ర మంత్రులు జేడీ.శీలం, పనబాక లక్ష్మి, యంపీ బొత్స ఝాన్సీ తమ తమ సీట్లకే పరిమితమయి కాంగ్రెస్ అసమదీయుల లిస్టులో తమ పేర్లను నమోదు చేసుకొనగా, మరో ఇద్దరు మంత్రులు పల్లంరాజు, కిల్లి క్రుపారాణిలు కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా అటు అధిష్టానానికి, ఇటు సమైక్యవాదులకు ఆగ్రహానికి గురికాకుండా తప్పించుకొనేందుకు సభలో కనబడకుండా మాయమయిపోయారు. ఇంతవరకు అధిష్టానానికి విధేయులుగా ముద్రపడ్డ కేంద్రమంత్రులు కావూరి సాంభశివరావు, చిరంజీవి, పురందేశ్వరి, యంపీ కనుమూరి బాపిరాజు మరియు పార్టీ నుండి సస్పెండ్ చేయబడిన హర్షకుమార్ సోనియా గాంధీ వారిస్తున్నా వినకుండా స్పీకర్ పోడియం వద్ద నిలబడి ససమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తూ తసమదీయులుగా మారిపోవడం విశేషం.   మరో విశేషమేమిటంటే ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో చేసిన నిరసన దీక్షలో ఆయన పక్కన కూర్చొని దీక్ష చేసిన జేడీ.శీలం, బొత్స ఝాన్సీ లు సభలో మిన్నకుండిపోగా, మన రాష్ట్రంతో, విభజనతో ఎటువంటి సంబంధమూ లేని త్రిణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ యంపీలు సభలో ఆందోళన చేస్తున్ననలుగురు కేంద్రమంత్రులతో కలిసి సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ వారికి తమ మద్దతు తెలిపారు.   మొన్న లోక్ సభలో గొడవ జరిగినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తమ ఇతర రాష్ట్రాల యంపీలనే మార్షల్స్ గా చేసుకొని సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలపై దాడికి ప్రయోగించిందనే ఆరోపణలను గట్టిగా ఖండించింది. కానీ ఈరోజు చిదంబరం బడ్జెట్ ప్రసంగానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తమిళనాడు కు చెందిన కాంగ్రెస్ యంపీలను ఆయన చుట్టూ రక్షణ కవచంగా ఏర్పాటు చేయడం గమనిస్తే ఆ ఆరోపణలు నిజమేనని అర్ధమవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం బహుశః ఇందుకు సిగ్గుపడకపోవచ్చును. కానీ యావత్ దేశ ప్రజలు, ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ దుస్థితికి జాలిపడుతున్నారు.

గందరగోళ౦గా తెలంగాణ ఆమోదం సరికాదు: జైరాం

      తెలంగాణ బిల్లును గందరగోళ పరిస్థితుల మధ్య ఆమోదించడం సరికాదని, ముఖ్యమైన బిల్లులపై సభలో తప్పనిసరిగా చర్చ జరగాలని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లుపై ఏకపక్షంగా వెళ్లడం సాధ్యం కాదని, బీజేపీతో కలిసి విస్తృత ఏకాభిప్రాయాన్ని కూడగట్టాల్సి ఉందని తెలిపారు. ఇప్పుడు బిల్లును అమోదించుకోవడానికి నాలుగు రోజులే సమయం మిగిలివుందని, అయినా బిల్లు ఆమోదానికి కావలిసిన మద్దతును కూడగడతామన్న విశ్వాసం తనకు ఉందని జైరాం రమేశ్ తెలిపారు. ఇప్పటికే హోం మంత్రి షిండేతో మాట్లాడానని, బిల్లు ప్రవేశపెట్టామని ఆయన స్పష్టం చేశారని, కమల్‌నాథ్ కూడా ఇదే విషయం చెప్పారని జైరాం తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైన జైరాం రమేశ్ మండిపడ్డారు. నాకు తెలిసినంత వరకు పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన లక్ష్మణ రేఖను ఆయన దాటేశాడని వ్యాఖ్యానించారు.

త్వరలోనే ధరలు దిగివస్తాయి : చిదంబరం

  నేడు లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు సభలో నిరసనకు దిగారు. సమైక్యాంద్ర నినాదాలు చేస్తూ వెల్ లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. సీమాంధ్ర ఎంపీల నిరసనల మధ్యనే కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం చిదంబరం బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుంది. త్వరలోనే ధరలు దిగివస్తాయని, ఆహార ఉత్పత్తులు పెరిగాయి. కష్టపడి పనిచేయడం వల్లే వృద్ధిరేటు పెరిగింది. బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని,ప్రభుత్వ రంగంలో 10లక్షల ఉద్యోగాలు. దేశంలో 50వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అలాగే కొత్తగా 7 విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయని ఆయన అన్నారు.

పార్లమెంట్లో చిదంబరం బడ్జెట్...గందరగోళం

      స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. చిదంబరం స్పీకర్ కు సీరియల్ నెం. 1 ఒట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై బిల్లు ప్రవేశపెడుతున్నట్టు స్పీకర్ కు తెలిపారు. అలాగే గులాం నబీ ఆజాద్ కూడా సీరియల్ నెం. 2 గా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం బిల్లును ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. చిదంబరం ఒట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. పార్లమెంటు ప్రారంభమైన కొద్ది నిముషాలలోనే సమైక్య నినాదాలతో సీమాంధ్ర ఎంపిలు, మంత్రులు కావూరి, పురందేశ్వరి వెల్ లోకి దూసుకెళ్లారు. సమైక్యాంధ్ర ప్లే కార్డ్ లు పట్టుకుని నినాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా చిదంబరం తన ఒట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశ పెడుతున్నారు. స్పీకర్ సభ్యులను పలుమార్లు సహకరించాలని కోరినా వుయ్ వాంట్ జస్టీస్ అంటూ సీమాంధ్ర మంత్రులు, ఎంపిలు నినాదాలతో సభలో గందరగోళం సృష్టిస్తున్నారు.

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠ

  ఢిల్లీలోని రాంలీల మైదానంలో రెండు రోజులపాటు జరిగే "సేవ్ ఆంధ్రప్రదేశ్" సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ.... కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా విభజన బిల్లు పెట్టిందో జాతీయ పార్టీలకు తెలపడానికే ఈ సభ నిర్వహించబోతున్నాం అని అన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సభకు సుమారు 15 నుంచి 20 వేల మంది హాజరవుతారని, ఇది పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే తమ నిరసన తెలుపుతామని ప్రభుత్వానికి హామీ ఇస్తున్నామన్నారు. అయితే ఇప్పటికే ఈ సభ మొత్తం కూడా సమైక్యాంద్ర శ్రేణులతో నిండిపోయింది. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి చాలా వేడిగా ఉండి. ఈ క్రమంలో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరు ఎలా స్పందిస్తారో అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఆ విషయంపై మీరా గరం గరం

      లోక్ సభలో తెలంగాణా కాంగ్రెస్ యంపీలను అడ్డుకొనేందుకు యంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే వాడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పీకర్ మీరాకుమార్ స్పందించారు. దీనికి సంబంధించిన విషయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆమె సభాహక్కుల కమిటీకి నివేదించారు. సభా వ్యవహారాలు, ప్రవర్తనా నియమావళిలోని 227 నిబంధన కింద ఆమె ఈమేరకు నివేదించారని లోక్ సభ సెక్రటేరియట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇలాంటి పరిణామాలు మరోసారి జరగకుండా భద్రత కమీటి అత్యాధునిక సాంకేతిక పరికరాలను, మెటల్ డిటెక్టర్లను అమర్చారు. ప్రతిఒక్కదానినీ తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు.