మంది ఎక్కువయితే...
posted on Feb 22, 2014 @ 12:16PM
రాష్ట్ర విభజన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేసింది గనుక ఇక రాజకీయ పార్టీలన్నీ మరో రెండు నెలలలో జరగనున్న ఎన్నికల కురుక్షేత్రానికి తమ సేనలను, వ్యూహాలను సిద్దం చేసుకొని కత్తులు పదును పెట్టుకొంటున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెస్, వై.కాంగ్రెస్, తెదేపాల మధ్యే పోటీ ప్రధానంగా ఉంటుందని చెప్పవచ్చును. ఆమూడు కాక బీజేపీ, లోక్ సత్తా పార్టీలు కూడా బరిలో ఉండగా, కొత్తగా ఆమాద్మీ, మందకృష్ణ, బైరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి (పెట్టబోయే) కొత్త పార్టీలు కూడా వచ్చి చేరబోతున్నాయి. గతంలో 23జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్తా ఒకేసారి 13 జిల్లాలకు కుచించుకుపోవడంతో, ఒకేసారి ఇన్ని పార్టీలు వచ్చి చేరడంతో ‘మంది ఎక్కువయితే మజ్జిగ పలచబడుతుందన్నట్లు’ ఇన్ని పార్టీల మధ్య ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఇప్పటికే అస్తవ్యస్తమయి, ఇంకా ఇప్పుడు పునర్నిర్మాణం కూడా కావలసిన ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. అత్యంత క్లిష్టమయిన ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్త్రప్రజలు, కులం, మతం వంటి బలహీనతలకు, పార్టీలు పంచిపెట్టే తాయిలాలకు లొంగిపోకుండా విజ్ఞత ప్రదర్శించి సరయిన పార్టీకే పూర్తి మెజారిటీతో గెలిపించవలసి ఉంటుంది. అలాకాదని ప్రజలు ఈ రాజకీయ పార్టీల నడుమ చీలిపోయినట్లయితే, డిల్లీలో ప్రభుత్వ పరిస్థితే ఎదురవుతుంది.