ఈ (చిరం)జీవి ప్రయాస దేనికో?
posted on Feb 21, 2014 @ 12:09PM
నిన్న రాజ్యసభలో చిరంజీవి మొట్ట మొదటిసారిగా ప్రసంగించబోతుంటే, అంతవరకు సభ్యుల నినాదాలతో హోరెత్తిన సభ ఒక్కసారిగా నిశబ్దమయింది. ఆయన ఈ అంశం గురించి చాలా అద్భుతంగా ప్రసంగిస్తారని అందరూ ఎదురు చూసారు. కానీ షరా మామూలుగానే ఆయన తడబడుతూ మొదలు బెట్టిన ప్రసంగంలో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనే పనిలో బీజేపీ, తెదేపా, వైకాపాలను విమర్శిస్తూ కాంగ్రెస్ చర్యలను సమర్దించే ప్రయత్నం చేయబోగా ప్రతిపక్షాలు ఇంతకీ “తమరు ఏ పార్టీ తరపున ఏ వైఖరితో మాట్లాడుతున్నారని?”నిలదీయడం చూస్తే ఆయన ప్రసంగం ఎంత అయోమయంగా ఉందో అర్ధమవుతుంది. తాను వ్యక్తిగతంగా, కాంగ్రెస్ వాదిగా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నాని చెపుతూనే, క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా తన అధిష్టానం తీసుకొన్న నిర్ణయాన్ని పూర్తిగా సమర్దిస్తున్నానని తెలిపి సోనియమ్మను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసారు. హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని, సీమాంధ్రకు నిర్దిష్టమయిన ప్యాకేజీలు కావాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.
అయితే, ఇంతవరకు సీమాంధ్ర యంపీలు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఎన్నిసార్లు ప్రాదేయపడినా పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం, రాజ్యసభలో బిల్లుని ఆమోదింపజేయడానికి సిద్దమవుతున్న తరుణంలో తన విన్నపాలను ఎందుకు చెవికెక్కించుకోదనే సంగతి తెలిసి ఉన్నపటికీ చిరంజీవి తన డిమాండ్ల చిట్టాను మరోసారి సభలో బిగ్గరగా చదివి వినిపించారు. బహుశః తను కూడా సీమాంధ్ర కోసం చాలా గట్టిగా పోరాడానని సీమాంధ్ర ప్రజలు గ్రహించాలనే ఆశతోనే శ్రమపడి ఉంటారు. కానీ, ఆయన తన ప్రసంగం మొదలుపెట్టగానే మొట్ట మొదట తన అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి రాష్ట్ర విభజనకు అంగీకరిస్తున్నాని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పిన తరువాత ఇంకా ఈ వృదా ప్రయాస అంతా దేనికో? ఏమి సాధించాలనో? ఆయనకే తెలియాలి. రానున్న ఎన్నికలలో అయన పోటీ చేసేమాటయితే తన గురించి సీమాంధ్ర ప్రజలు ఏమని భావిస్తున్నారో తప్పకుండా తెలుసుకొనే గొప్ప అవకాశం కలుగుతుంది. మరి ఆయన అవకాశం వినియోగించుకొంటారో లేదో మరి!