తెదేపా బీజేపీతో పొత్తులు పెట్టుకొనే సాహసం చేయగలదా?
posted on Feb 21, 2014 9:21AM
సీమాంధ్ర ప్రజలు తమ అభిప్రాయాలను పూచికపులల్లా తీసి పక్కనపడేసి రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీపై పగతో రగిలిపోతున్నారు. విభజనను అడ్డుకొంటామన్నట్లు మాట్లాడి చివరి నిమిషంలో విభజనకు పూర్తి మద్దతు తెలిపిన బీజేపీపై కూడా వారు అంతే కక్షతో, పగతో రగిలిపోతున్నారు. రానున్న ఎన్నికలలో ఆ రెండు పార్టీలకు తగిన గుణపాటం చెప్పేందుకు వారు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీతో ఎన్నికల పొత్తులకు తెదేపా సాహసిస్తుందని ఎవరూ భావించలేరు. ఒకవేళ దైర్యంచేసో, కక్కుర్తి పడో పొత్తులు పెట్టుకొంటే అది తేదేపాకు రాజకీయంగా ఆత్మహత్యతో సమానమవుతుంది. గనుక పొత్తులు పెట్టుకోకపోవచ్చును.
అంటే, ఆ రెండు పార్టీలు కూడా ఆంధ్ర తెలంగాణా ప్రాంతలలో ఒంటరి పోరాటం చేయక తప్పదన్నమాట! ఆ రెండు పార్టీలు చేతులు కలిపినట్లయితే ఎంత బలంగా ఉంటాయో అందరికీ తెలుసు. కానీ రాష్ట్ర విభజన అంశం వారి మధ్య కూడా చిచ్చుపెట్టి వాటిని పూర్తిగా బలహీనపరిచింది. రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ ఆశించిన అనేక ప్రయోజనాలలో బహుశః ఇది కూడా ఒకటని చెప్పక తప్పదు.
కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు ఎన్నికల పొత్తులు పెట్టుకోకపోయినా ఎన్నికల తరువాత ఒకవేళ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే గనుక తెదేపా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాలలో శాశ్విత శత్రువులు లేదా మిత్రులు ఉండరనే సిద్ధాంతం ఉండనే ఉంది.