సీమాంధ్రకు ఐదేళ్ళు ప్రత్యేక హోదా: ప్రధాని మన్మోహన్

      ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పైన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రసంగించారు. సీమాంధ్రకు ఐదేళ్ళపాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని తెలిపారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని తగిన ఆర్ధిక సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని షిండే ఇంతకుముందే తెలిపారని గుర్తు చేశారు.   ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణ బిల్లు ప్రతులని చింపి ప్రధానిపై తృణమాల్ కాంగ్రెస్ సభ్యులు విసిరారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని చుట్టూ రక్షణగా నిలిచారు. మధ్యలో కలుగచేసుకున్న బీజేపీ నేత వెంకయ్యనాయుడు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి పదేళ్ళు పెంచాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో కూడా ఇప్పడే స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే వెంకయ్య నాయుడు డిమాండ్‌కు స్పందిస్తూ ప్రత్యేక ప్రతిపత్తి పదేళ్ళు ఇవ్వడం కుదరదని హోంశాఖ మంత్రి షిండే సమాధానమిచ్చారు. సీమాంధ్రలోని పదమూడు జిల్లాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నామన్నారు. పారిశ్రామిక హోదా కోసం పన్ను రాయితీ ప్రకటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ఆర్థికంగా ఎదగడానికే ప్రత్యేక హోదా ఉపకరిస్తుందన్నారు. పోలవరం నిర్మాణానికి యూపిఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీమాంధ్రకు తొలి ఏడాది ద్వారా ఏర్పడే లోటును కేంద్ర బడ్జెట్ ద్వారా పూడ్చుతామన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహానికి పన్ను రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసంపై అవసరమైతే సవరణలు త్వరలో చేద్దామన్నారు.

సమైక్యవాదినే..పార్టీ నిర్ణయానికి మద్దతు:చిరు

      రాజ్యసభలో కేంద్రమంత్రి చిరంజీవి తన తొలి ప్రసంగాన్ని తెలంగాణ బిల్లుపై చేశారు. రాష్ట్ర విభజనకు తానూ వ్యతిరేఖం అంటూనే, పార్టీ తీసుకున్న విభజన నిర్ణయానికి కట్టుబడి వున్నానని తెలిపారు. లోక్ సభలో కేంద్రం తెలంగాణ బిల్లును ఆమోదించిన తీరు దారుణమని అన్నారు. తెలుగు ప్రజల సమస్యలును అసలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తెలుగు ప్రజలందరినీ దిగ్బ్రాంతికి గురిచేసిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీని మాత్రమే దోషిగా చూడవద్దని, అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని గుర్తు చేశారు. ఏది ఏమైనా రాష్ట్ర విభజన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

టి బిల్లుకు మద్దతు..సీమాంధ్రకు ఇవి ఇవ్వండి: వెంకయ్య

      రాజ్యసభలో సభ్యుల గందరగోళం మధ్యే తెలంగాణ బిల్లుపై వెంకయ్య నాయుడు ప్రసంగించారు. రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కాంగ్రెస్సే కారణమని మండిపడ్డారు. పదేళ్ళ క్రితం తెలంగాణపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. మూడేళ్ళ కిందటే విభజన చేసి ఉంటే ఈ వివాదం ఉండేదికాదని వెంక్యనాయుడు అభిప్రాయపడ్డారు.   ఒకవైపు ప్రధాని విభజన చేయాలంటారు..మరోవైపు వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు కట్టుబడి వుందని, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలన్నదే తమ డిమాండని వెంకయ్య స్పష్టం చేశారు.  సీమాంధ్రకు రూ. 15 వేల కోట్ల ద్రవ్యలోటు ఇవ్వలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ కంపెనీలను సీమాంధ్రలో కూడా పెట్టాలని ఆయన అన్నారు. సీమాంధ్రను ప్రత్యేక ప్రతిపత్తి రాష్ట్రంగా ప్రకటించాలని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముగూడెం-సాగర్ టేల్‌పాండ్ పనులు ప్రభుత్వం చేపట్టాలని దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టుల పని వెంటనే ప్రారంభించాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు.

రాజ్యసభలో తెలంగాణ బిల్లు..గందరగోళం

      తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో సభలో తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడింది. సభ సజావుగా సాగేందుకు సభ్యులు ఎవరూ సహకరించకపోవడంతో సభ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. దీంతో సభను సజావుగా నడిపేందుకు సభ్యులు సహకించాలని చైర్మన్ కురియన్ కోరినా సభ్యులు పట్టించుకోలేదు. సభను ఎన్ని సార్లు వాయిదా వేసినా సీమాంధ్ర నేతల తీరు మాత్రం మార్చుకోకుండా తమ నిరసనలు యధావిధిగా కొనసాగిస్తున్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ 'సేవ్ ఆంధ్రప్రదేశ్' ఫ్లకార్డులను పట్టుకుని సీమంధ్ర నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం 3-30 గంటలకు రాజ్యసభకు చేరుకున్నారు. సీమాంధ్రకు ప్యాకేజీ విషయమై ఆయన సభలో ప్రసంగించనున్నారు.

బిల్లు రాజ్యాంగ విరుద్దం: నోటీసు ఇచ్చిన బీజేపీ

  రాష్ట్ర విభజన బిల్లులో బీజేపీ సూచించిన కొన్ని సవరణలను చేర్చకుండా హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే బిల్లుని యదాతధంగా రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అరుణ్ జైట్లీ బిల్లు రాష్ట్ర విభజన బిల్లులో బీజేపీ సూచించిన కొన్ని సవరణలను చేర్చకుండా హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే బిల్లుని యదాతధంగా రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అరుణ్ జైట్లీ బిల్లు రాజ్యాంగ వ్యతిరేఖంగా ఉంది గనుక దానిని తాము వ్యతిరేఖిస్తున్నట్లు ఉపసభాపతి కురియన్ కి నోటీసు ఇచ్చారు. ఆయనతో బాటు సుజన చౌదరీ, రాజీవ్ చంద్ర శేఖర్, నరేంద్ర గుజ్రాల్ తదితరులు కూడా బిల్లుని వ్యతిరేఖిస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. సభలో సీమాంధ్ర మరియు తమిళనాడుకు చెందిన సభ్యులు బిల్లుకి వ్యతిరేఖంగా ఆందోళన చేస్తుండటంతో సభ పావుగంట సేపు వాయిదాపడింది.   పార్లమెంటు బయట బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ “మేము బిల్లుని వ్యతిరేఖిస్తున్నట్లు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సభను, మీడియాను తప్పు దోవ పట్టిస్తోంది. కానీ అది నిజం కాదు. బిల్లులో మేము సూచించిన సవరణలను చేర్చకుండా సభలో ప్రవేశపెట్టడంతో మా సభ్యుడు అరుణ్ జైట్లీ బిల్లు రాజ్యంగా విరుద్దంగా ఉందని, దానిపై చర్చ కోరుతూ నోటీసు ఇచ్చారు తప్ప బిల్లుని వ్యతిరేఖించలేదు. మేము తెలంగాణా ఏర్పటుకు కట్టుబడి ఉన్నాము. కానీ, అదే సమయంలో సీమాంధ్రకు నష్టం కలగకూడదని కోరుకొంటున్నాము,” అని తెలిపారు.   లోక్ సభలో బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చిన బీజేపీ అదే బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేఖించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నపటికీ దానికి ప్రధాన కారణం ఆ పార్టీకి వ్యతిరేఖంగా సీమాంధ్రలో ఎగసిపడిన వ్యతిరేఖతే కాకుండా, అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఒకవేళ బీజేపీ సూచించిన సవరణలను బిల్లులో ప్రవేశపెడితే, బిల్లుని తిరిగి లోక్ సభకు పంపవలసి ఉంటుంది గనుక, కాంగ్రెస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో బిల్లుని యధాతధంగా ఆమోదింపజేసే ప్రయత్నం చేయవచ్చును. సీమాంధ్రలో వ్యతిరేఖతను చూసి బిల్లు విషయంలో నాటకాలు ఆడుతున్న బీజేపీ, సభలో ప్రధానమంత్రి ప్రసంగం తరువాత బిల్లుకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. నాలుగు గంటలకి తిరిగి సమావేశమయిన సభ సభ్యుల అందోళనల కారణంగా మళ్ళీ వాయిదా పడింది.

రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన షిండే

      రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు షిండేకు రక్షణగా కాంగ్రెస్ ఎంపీలు, మార్షల్స్ నిలబడ్డారు. సభలో బిల్లును ప్రవేశపెట్టగానే తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎంసీ బిల్లును అడ్డుకొనేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల మధ్య సభలో తోపులాట జరిగింది. బిల్లు రాజ్యంగా విరుద్దమని సభలో సభ్యులు నినాదాలు చేశారు. తెలంగాణ బిల్లు రాజ్యంగ బద్దంగా లేదని పలువురు సభ్యులు స్పీకర్ కు నోటిసులు ఇచ్చారు. సభలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొనడంతో సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.

విభజన చేసింది కాంగ్రెస్ కాదట

  రాష్ట్ర విభజన ప్రక్రియలో తన పాత్ర పూర్తయిపోగానే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి తప్పుకొన్నారు. పోతూపోతూ సోనియాగాంధీ తనను పదవిలో కొనసాగమని ఆదేశించినందునే ఇంతకాలం కొనసాగాననే చల్లటి కబురు కూడా తెలుగు ప్రజల చెవినవేసి మరీ పోయారు. ఆయన బ్యాటు, బాలు అన్ని పక్కన పడేసి మైదానం ఖాళీ చేసి వెళ్లిపోతుంటే, ఇంతకాలంగా ఆయనే వెనుకే ఫీల్డింగ్ చేస్తున్నఏపీయన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కూడా ఇక తాముమాత్రం ఇంకా మైదానంలో ఉండి చేసేదేముందని, మళ్ళీ ‘బ్యాక్ టూ పెవిలియన్’ అంటూ డ్యూటీలో చేరిపోయారు. సరయిన ఆటగాళ్ళను ఎంపిక చేసుకోక పోవడం వలనే ఓడిపోయామని ముక్తాయింపు కూడా ఇచ్చారు.   ఇంతకాలంగా లాస్ట్ బాల్ మిగిలే ఉంది, ద్వారము తెరిచే యున్నది అంటూ మురిపించి మురిపించిన కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి ఫౌల్ గేమ్ ఆడుతూ తమకి బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశం లేకుండా అన్నీ తానే ఆడేసి మోసం చేసేసాడని అనేక కాంగ్రెస్ జీవులు కూడా వాపోతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీలోకెల్లా అత్యంత శీలవంతుడయిన కేంద్ర మంత్రి జేడీ.శీలం అయితే , సోనియా, రాహుల్ గాంధీలు రాష్ట్ర విభజన చేసినప్పటికీ సీమాంధ్ర ప్రజల పట్ల అపారమయిన దయ జాలి కలిగినందునే ప్యాకేజీలు విదిలించారని అందుకు ప్రతిగా సీమాంధ్ర ప్రజలందరూ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే ఎన్నుకొని వారికి కృతజ్ఞతలు తెలపడం కర్తవ్యమని సూచించారు. మరి సోనియాగాంధీ దయతోనే ముఖ్యమంత్రి అయ్యాయని, ఆమె ఆదేశంతోనే పదవిలో కొనసాగానని ఆయనే స్వయంగాప్రకటించి తప్పుకొన్నారు గనుక, ఈ విభజన పాపం కూడా ఆయన అకౌంటు లోనే జమా చేయడం సముచితమని భావించిన కాంగ్రెస్ జీవులన్నీ రాష్ట్ర విభజన జరగడానికి కాంగ్రెస్ అధిష్టానం కానీ, తాము గానీ  ఎవరూ కారణం కాదని కేవలం కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం, వైకాపాలే కారణమని  తీర్మానించేసాయి. బహుశః కాంగ్రెస్ అధిష్టానం ఈస్క్రిప్ట్ అంతా చాలా ముందే తయారుచేసి కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో పెట్టినందునేనేమో, ఆయన కూడా తన పాత్ర ముగింపుకి సరిపోయేలా "శాసనసభ తిరస్కరించిన టీ-బిల్లుని కేంద్రం యధాతధంగా పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లయితే నేను రాజకీయ సన్యాసం తీసుకొంటానని" ముందే క్లూ ఇచ్చేసి పాపం! ఆ పాపం నెత్తిన బెట్టుకొని మౌనంగా నిష్క్రమించారు.

రాజ్యసభలో 3గంటలకు టీ బిల్లు

      ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో మధ్యాహ్నం 3గంటలకు ప్రవేశపెట్టనున్నారు. లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో కూడా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. విభజన బిలుపై చర్చ జరిగిన వెంటనే ఆమోదం పొందే అవకాశం వుంది. రాజ్యసభలో ప్రధాని సీమాంధ్ర ప్యాకేజీ పైన ప్రకటన చేసే అవకాశముంది. మరోవైపు బిల్లు విషయంలో బిజెపి సూచించిన ఆరు ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు బిజెపి నేతలకు కేంద్రం లిఖిత పూర్వకంగా తెలిపింది. బిజెపి ప్రతిపాదనలపై ప్రధాని రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు.

రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు

    రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారస్ చేస్తూ కేంద్రానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నివేదిక పంపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఎవరూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో, రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కేంద్రానికి నివేదికనిచ్చారు. దీనిపై సాయంత్రం కేంద్ర కేబినేట్ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కేంద్ర కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ తో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏర్పడ్డ పరిస్థితులు, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదంపై చర్చిస్తున్నారు.

బిజెపి ఓకే..టీ బిల్లు ఆమోదం లాంఛనమే

      తెలంగాణ బిల్లును రాజ్యసభలో ఆమోదించడానికి బిజెపి అ౦గీకరించినట్లు తెలుస్తోంది. బిల్లులో సూచించిన సవరణలను చేపట్టాల్సిందేనని పట్టుబట్టిన బిజెపి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సీమా౦ధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి ప్రధాని అ౦గీకరించడంతో బిజెపి వెనక్కి తగ్గినట్లు సమాచారం. దీనిపై ఈరోజు ఆయన రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు.   మరోవైపు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలంటూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరారు. ఐదేళ్ల పాటు ఈ ప్రత్యేక హోదా కొనసాగడం వల్ల సీమాంధ్రకు పెద్ద యెత్తున నిధులు అందుతాయి. ప్రత్యేక ప్రతిపత్తి కల్పనకు ప్రభుత్వం ముందుకు రావడంతో బిజెపి బిల్లును ఆమోదించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

నేడు రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం!

      ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదంపొందే అవకాశం వుంది. బుధవారమే రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేంద్రం భావించిన..తాము సూచించిన సవరణలు చేపట్టాల్సిందేనని బీజేపీ పట్టుబట్టడంతో బిల్లు ప్రవేశం వాయిదా పడింది. అయితే ఈరోజు విభజన బిల్లును ఎలాగైనా సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంటులో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ముఖ్యమంత్రి కిరణ్ రాజీనామాపై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చిస్తున్నారు. బిజెపి సూచించిన సవరణలపైన మలగుల్లాలు పడుతున్నారు. నేడు పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో బయట భారీ బందోస్తు ఏర్పాట్లు చేసారు.

ముఖ్యమంత్రి కుర్చీ కోసం డిల్లీలో పైరవీలు షురూ

  రాష్ట్ర విభజన ప్రక్రియ అంతిమ దశకు చేరుకోవడం, కిరణ్ కుమార్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో, ఇక అందరి దృష్టి ముఖ్యమంత్రి పీఠంపై పడింది. ఎన్నికలకు ఇంకా కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నఈ సమయంలో కూడా ముఖ్యమంత్రి పదవికి ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల నుండి అనేకమంది బారులు తీరి డిల్లీలో పైరవీలు చేయడం చూస్తుంటే, ప్రజాసేవ కోసమే పుట్టామని చెప్పుకొనే మన నేతలకి పదవీ లాలస ఎంతగా ఉందో అర్ధమవుతుంది. తెలంగాణా ఏర్పడుతున్న కారణంగా సంతోషంగా ఉన్న టీ-కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ఆరటపడినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, రాష్ట్ర విభజన జరుగుతునందుకు సీమాంధ్రలో ప్రజలు బాధతో అక్రోశిస్తుంటే, కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు డిల్లీలో తిష్టవేసి ఏ కాంగ్రెస్ అధిష్టానం, సోనియమ్మ అందుకు కారకులయ్యారో వారి చుట్టూనే ఏ మాత్రం సిగ్గులేకుండా ప్రదక్షిణాలు చేస్తూ ముఖ్యమంత్రి పదవి పైరవీలు చేస్తుండటం సీమాంధ్ర ప్రజల దౌర్భాగ్యమే. రేపు రాష్ట్రం విడిపోయిన తరువాత, రెండు నెలలు ముఖ్యమంత్రి పదవి కోసం ఇంతగా దిగజారిన వీరి చేతికే అధికారం అప్పజెప్పితే రాష్ట్ర భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందో చెప్పలేకపోయినా, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్రం నుండి విడుదలయ్యే భారీ నిధులతో వీరందరి భవిష్యత్తు ఉజ్వలంగా మారిపోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.

బళ్ళారి ఉక్కు మహిళ మనసెలా కరిగిపోయిందో?

  బళ్ళారి ఉక్కు మహిళగా పేరొందిన బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ తెలంగాణాకు బేషరతుగా మద్దతు ఇస్తామని మొదట ప్రకటించినప్పటికీ ఆ తరువాత మారిన పార్టీ వైఖరికి అనుగుణంగా తను కూడా మాట మార్చి సీమాంధ్రకు న్యాయం చేయనిదే బిల్లుకి మద్దతు ఈయలేమని చిలుక పలుకులు పలకడం మొదలుపెట్టారు. కానీ, అకస్మాత్తుగా ఆమెను ఎవరో హిప్నటయిజ్ చేసినట్లు లోక్ సభలో బిల్లుకి మద్దతు పలికి వచ్చారు. ఆ తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ “తాము ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చామని, అందువల్ల తెలంగాణా ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణా ప్రజలు తలుచుకొన్న ప్రతీసారి కూడా ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోవాలని” అని విజ్ఞప్తి చేసారు.   సభలో వెళ్ళేవరకు బిల్లుని అడ్డుకొని తీరుతామని ప్రగల్భాలు పలికిన బళ్ళారి ఉక్కు మహిళ సభలో అడుగుపెట్టగానే కాంగ్రెస్ ప్రతిపాదించిన బిల్లుని చూసి వెన్నలా కరిగిపోయి మద్దతు ఇవ్వడం అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. బళ్ళారి, ఓబులాపురం గనులను మేసిన గాలి సోదరులను ఆశీర్వదించిన పాపానికి, కాంగ్రెస్ పార్టీ తన అలావాటు ప్రకారం తన పెంపుడు చిలుకలను ఆ గనుల మీదకు వదులుతానని బెదిరించి ఆ ఉక్కుమహిళ మనసును కరిగించివేసిందా? అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, నిన్న లోక్ సభలో బిల్లుకి బేషరతు మద్దతు ఇచ్చిన బీజేపీ మళ్ళీ ఈరోజు అదే బిల్లు రాజ్యసభకు వచ్చినప్పుడు వ్యతిరేఖించడం కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈసారి వ్యతిరేఖించడానికి కారణం ఏమిటని అందరూ ఆలోచనలో పడ్డారు.

డిల్లీలో బొత్స లాబీయింగ్ దేనికో

  కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వార్తపై కేంద్రమంత్రి జైరాం రమేష్ స్పందిస్తూ అవసరమనుకొంటే రాష్ట్రపతి పాలన విధిస్తామని అన్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తన పదవి నుండి తప్పుకొంటున్నారని రూడీ చేసుకోగానే, ఆపదవిపై చాలా కాలంగా కన్నేసిన పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ డిల్లీలో వాలిపోయి లాబీయింగ్ చేస్తున్నారు. కానీ పైకి మాత్రం తను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే డిల్లీకి వచ్చినట్లు చెప్పుకొంటున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమయిన ఈ పరిస్థితుల్లో దానిని ఎలాగయినా ఆపెందుకే ప్రయత్నించాలి తప్ప, ముఖ్యమంత్రి రాజీనామా ఎందుకు చేసారు? ఆయన స్థానంలోకి ఎవరొస్తారు? రాష్ట్రపతి పాలన విదిస్తారా? వంటి రాజకీయాలు మాట్లాడటం సబబు కాదని ఆయన చాలా విచారపడుతూ తెలిపారు. అయితే ఆయన ప్రదాన్యాలేమితో, ఆయన డిల్లీలో ఎందుకు తిష్టవేసారో తేలికగానే ఊహించవచ్చును. ఈరోజు రాజ్యసభలో టీ-బిల్లుకి ఆమోదముద్ర పడగానే, ఇక ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాల ఏర్పాటు ఇక లాంచనప్రాయమే. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తనంతట తానే స్వయంగా అడ్డుతొలిగిపోయారు. పైగా ముఖ్యమంత్రి పదవికి సీమాంధ్ర నుండి చిరంజీవి, కన్నా లక్ష్మినారాయణ తప్ప గట్టి పోటీకూడా లేదు. కనుక ఇంతకంటే మంచి తరుణం ఉండదని బొత్స భావించడం సహజమే. అదీగాక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను, పీసీసీ అధ్యక్షుల నియామకాలకు ఎన్నికల నిబంధనలు అడ్డువచ్చేమాటయితే, అంతకంటే ముందుగానే ఎవరినో ఒకరిని అత్యవసరంగా ముఖ్యమంత్రిగా నియమించవలసి ఉంటుంది. అటువంటప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్రకు చెందిన వ్యక్తులను కంటే తెలంగాణా వ్యక్తులకే ప్రాధాన్యం ఈయవచ్చును. ఎందుకంటే, తెలంగాణాలో యంపీ సీట్లు సాధించుకోవడానికే ఇంత రిస్కు తీసుకొని ఇంత శ్రమపడింది గనుక. తెలంగాణాకు చెందిన వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా ప్రయోజనం పొందగలదు కానీ సీమాంధ్రకు చెందిన ఏ బొత్సకో కట్టబెట్టడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. బహుశః అందుకే పరిస్థితులు అంతా అనుకూలంగా ఉన్నాకూడా ఈ ఒక్క కారణంగా బొత్స లాబీయింగ్ చేయక తప్పడంలేదనుకోవాలి. అందువలన జైరాం రమేష్ చెప్పినట్లుగా ఎన్నికల ముందు కేంద్రం రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపకపోవచ్చును.

చిరంజీవి, కావూరి రాజీనామా చేయండి: కురియన్ ఆగ్రహం

      రాజ్యసభలో సమైక్య నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సా౦బ శివ రావులపై డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనపై సభలో నిరసన తెలపాలనుకుంటే తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి నిరసన తెలపాలని సూచించారు. బీజేపీ నేతలు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు కూడా కల్పించుకుని సొంత పార్టీ నేతలే సభలో గందరగోళం చేయడం సరికాదని, రాజ్యసభకు కేంద్రమంత్రులు సమాధానం చెప్పడానికే రావాలని, నిరసనలు తెలపకూడదని వారు సూచించారు. మరోవైపు మత్స్యకారుల బిల్లుపై తేల్చిన తర్వాతే వేరే బిల్లుల సంగతి చూడాలని అన్నాడీఎంకే సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ చైర్మన్ వెల్‌లో సీమాంధ్ర ఎంపీలు సీఎం రమేష్, సుజనాచౌదరి, కేవీపీ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలుపుతున్నారు.

రాజ్యసభకు సీఎం రమేష్ క్షమాపణ

      ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న సందర్బంగా సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర సభ్యులు సభ మధ్యలోకి చేరుకొని సమైక్యనినాదాలతో, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ముందున్న సెక్రటరి జనరల్ తెలంగాణ బిల్లుకు సంబంధించి లోక్ సభ నుండి వచ్చిన పేపర్లను చదవబోతుండగా వెనుకనే ఉన్న సీఎం రమేష్ ఆయన మీద పడి లాక్కున్నారు. దీనిని డిప్యూటీ చైర్మన్ కురియన్ తప్పుపట్టారు. ఈ సంఘటన జరిగిన వెంటనే రాజ్యసభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి మొదలుకాగానే టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సభకు క్షమాపణలు చెప్పారు."రాష్ట్ర విభజన అత్యంత భావోద్వేగమైన అంశం. అందుకే అలా వ్యవహరించాను. సెక్రటరీ జనరల్ నుంచి కాగితాలు లాక్కున్నందుకు క్షమాపణ చెబుతున్నాను" అని సి.ఎం.రమేశ్ సభా ముఖంగా తెలిపారు.