దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళ ఘటనకు ఏడాది
posted on Feb 21, 2014 @ 4:42PM
గత ఏడాది సరిగ్గా ఇదే రోజు హైదరాబాద్ నగరం బాంబు పేలుళ్ళతో ఉలిక్కి పడింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు రాత్రి ఏడుగంటల సమయంలో దిల్ సుఖ్ నగర్ లో కోణార్క్ ధియేటర్ వద్ద, 107 బస్ స్టాప్ వద్ద, ఎ1 మిర్చి సెంటర్ వద్ద బాంబు పేలుళ్లు జరపడంతో 17మంది మృతి చెందగా, 138 మంది గాయాలపాలయ్యారు. ఇప్పటికి బాధితుల కుటుంబాలను ఆ విషాదఛాయలు వెంటాడుతూనే వున్నాయి. చాలా మంది కుటుంబాలు తమ ఆధారాన్ని కోల్పోయాయి. ఉజ్వల భవిష్యత్తు కనుమరుగై మంచానికే పరిమితమయ్యారు మరికొ౦దరూ, ఆదుకుంటామన్న ప్రభుత్వ౦ చేయూత నివ్వకపోవడంతో...ఇప్పటికి చాలా కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా ఘటనా స్థలంకోణార్క్ థియేటర్ వద్ద పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు నివాళులర్పించారు. ఘటనలో మృతి చెందిన వారికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడికి చేరుకున్న మృతుల బంధువులు ఘటనను తల్చుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలువురు విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.