కాంగ్రెస్ ప్యాకేజ్ ఎన్నికల కోసమేనా
posted on Feb 22, 2014 @ 12:34PM
రాష్ట్ర విభజనతోనే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖరారయిపోయిందని అందరూ భావిస్తున్నపటికీ, అ పార్టీ అధిష్టానం బొత్స, డొక్కా, వట్టి, చిరంజీవి, అనం, రామచంద్రయ్య, సుబ్బిరామిరెడ్డి వంటి విదేయులైన వారినందరినీ ఒక త్రాటి పైకి తీసుకు వచ్చిన తీరు చూస్తే ఎన్నికలలో కాంగ్రెస్ కూడా గట్టిగానే పోటీ ఇవ్వబోతునట్లు స్పష్టమవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు పార్టీ నుండి నిష్క్రమించడంతో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అసమతి గళం వినిపించే అవకాశం లేకుండా పోయింది. బహుశః టికెట్స్ కేటాయింపు సమయంలో కొంత వినిపిస్తుందేమో. సీమాంధ్రకు ఇవ్వబోయే ప్యాకేజీ గురించి, రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ తెదేపా, వైకాపాలు ఇచ్చిన లేఖలు, రాష్ట్రాన్ని విడదీయడానికి సహకరించిన కిరణ్ కుమార్ రెడ్డి ని నిందిస్తూ ఎన్నికలలో నెగ్గుకు రావాలని కాంగ్రెస్ ఆలోచన. కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడని నిరూపించుకొన్నారు గనుక కనీసం వారికి ఆ అవకాశం కల్పించేందుకయినా కొత్త పార్టీ పెట్టవలసి ఉంటుంది.
ఎన్నికల తరువాత మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో ఉన్నకాంగ్రెస్ పార్టీ తను ఎలాగు ఆ వాగ్దానాలను అమలు చేయనవసరం లేదు గనుక అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఈ రెండు మూడు నెలలలో సీమాంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు ఎన్ని వరాలు, ప్యాకేజీలయినా ప్రకటించవచ్చును. అందువల్ల అందరూ ఊహిస్తున్నట్లుగా కాంగ్రెస్ పోరాడకుండా చేతులెత్తేయబోదని స్పష్టమవుతోంది.