నీలంతో ఆరంభం .. నల్లారితో అంతం

  ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో 58 ఏళ్ళ తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్ గా మిగిలిపోయింది. 1956 నవంబర్ 1న ఏర్పడిన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి నేటివరకూ 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో ఎక్కువమంది రాయలసీమ నుంచి వచ్చిన వారే. సామాజిక న్యాయం అనేది అందని అందలమైంది. ఆంధ్రప్రదేశ్ జనాభా రీత్యా అత్యధికశాతం బీసీ వోటర్లు ఉన్నా ఒక్కరికి కూడా సీఎంగా అవకాశం దక్కలేదు. ఎస్టీలు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. ఎస్సీల్లో ఒక్క దామోదరం సంజీవయ్యకు సీఏంగా పని చేసే అవకాశం దక్కగా.. అదీ మూడేళ్ళ ముచ్చటగానే ముగిసింది.   రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 9 మంది సీఎంలుగా పనిచేశారు. కమ్మ కులం నుంచి ముగ్గురు, ఒకరు బ్రాహ్మణ, మరొకరు వైశ్య, వెలమల్లో ఒకరికి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది. రాయలసీమ నుంచి ఆరుగురు, కోస్తాంధ్రకు చెందిన ఆరుగురు, తెలంగాణలోని నలుగురు సీఎం కుర్చీని అధిరోహించారు. 16 మందిలో ఎక్కువ రోజులు పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు చంద్రబాబు సొంతం అవగా.. అతి తక్కువ రోజులు సీఎంగా వ్యవహరించిన వ్యక్తిగా నాదెండ్ల భాస్కరరావు చరిత్ర సృష్టించారు. అనంతపురం జిల్లావాసి అయిన నీలం సంజీవరెడ్డితో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల ప్రస్తానం చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ముగిసింది.   నీలంతో ఆరంభమైన సమైక్యాంధ్రప్రదేశ్ ..నల్లారి పాలనతో అంతమై అవశేషాంధ్రప్రదేశ్ గా మిగిలిపోయింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజికవర్గ ముఖ్యమంత్రుల హయాంలోనే ఇరుప్రాంతాల విలీనం.. రెండు ప్రాంతాలుగా విభజన జరగడం యాదృచ్చికమే అయినా చరిత్రపుటల్లో స్థానం సంపాదించుకుంది.

టిడిపికి సత్యవతి రాథోడ్ షాక్

      తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి వలసల జోరు కొనసాగుతుంది. టిడిపి ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, నగేష్ లు పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. సోమవారం టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. వీరేకాక మరికొంతమంది కూడా పార్టీని వీడడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కేసిఆర్ తో ఆమె ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. టిక్కెట్ పైన హామీ కూడా ఆయన హామీ ఇచ్చారట. సామాజిక తెలంగాణ టిడిపితోనే సాధ్యమని, తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని బడువర్గాలకు ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన వలసలు ఆగకపోవడంతో తెలంగాణ టిడిపి నేతల్లో కలవరం మొదలైంది.

కాంగ్రెస్ ని కాదు, విభజనని వ్యతిరేకించా: లగడపాటి

      ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలల్లోనే వుండాల్సిన అవసరం లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. విజయవాడలో తన అనుచరులతో జరిగిన సమావేశంలో రాజకీయాలలోకి తాను తిరిగిరానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో లేకపోయినా తాను ప్రజాసేవ చేస్తానని లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలు అర్ధం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర అందరి భవిష్యత్ అని తాను నమ్మినట్లు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. రాష్ట్ర విభజనకు విధి సహకరించిందని ఆయన అన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీను విమర్శించలేదని, ఒక్క విభజన విషయంలో కాంగ్రెస్ తీరును మాత్రమే వ్యతిరేకించానని రాజగోపాల్ స్పష్టం చేశారు. అయితే కొందరు అభిమానులు మాత్రం రాజకీయాల్లోకి తిరిగి రావాలని డిమాండ్ చేశారు. వారికి లగడపాటి సర్దిచెప్పారు.

సింగపూర్‌కు అంబరీశ్ తరలింపు?

      తీవ్ర అస్వస్థతకు గురై సుదీర్ఘ కాలంగా బెంగళూరులో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు, ఆ రాష్ట్ర మంత్రి అంబరీశ్‌ను సింగపూర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అంబరీశ్ శ్వాస కోశ ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. అప్పటి వరకు కృత్రిమ శ్వాసతోనే చికిత్సను కొనసాగిసాగించాలని, అయితే ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం నటుడు రజనీకాంత్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉన్నత చికిత్స కోసం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి తీసుకెళ్లాల్సిందిగా అంబరీశ్ సతీమణి సుమలతకు సూచించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ సూచన పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ దశలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్‌ను సంప్రదించారు. ఆయన సూచన మేరకు ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ రణదీప్ గులేరియా బెంగళూరు చేరుకుని అంబరీశ్ వైద్య పరీక్షల నివేదికలను పరిశీలించారు. ప్రస్తుతానికి సింగపూర్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. అయినా కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు అంబరీశ్‌ను సింగపూర్‌కు తరలించడానికి వైద్యులు చర్యలు చేపట్టారు.   

తెలుగు ఐఏఎస్ అధికారులు పనికిరారా?

      రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి పదవీ కాలాన్ని పొడిగించడం మీద తెలుగు ఐఏఎస్ అధికారులు మండిపడుతున్నారు. ఇక్కడి కేడర్ లో సమర్థులైన అధికారులు కావల్సినంత మంది ఉండగా వేరే రాష్ట్రానికి చెందిన ఆయనకు పొడిగింపు ఇవ్వడం ఏమిటని సీసీఎల్ఏ ఐవైఆర్ కృష్ణారావు నిలదీశారు. విభజన సమయంలో స్థానిక కేడర్‌లో సమర్థులున్నా గుర్తించకపోవడం దారుణమని ఆయన ఆగ్రహించారు. సమర్థులైన అధికారులు లేనప్పుడు, ప్రతిభావంతులైన అధికారులకు మాత్రమే పదవీ కాలం పొడిగింపు ఇవ్వాలనే నిబంధన ఉందని, ఆ నిబంధనను తుంగలో తొక్కారని విమర్శించారు.   రాష్ట్రానికి చెందిన అధికారులు పనికిరారనే భావన వచ్చేలా, మహంతి పదవీ కాలం పొడిగించడం అఖిల భారత సర్వీసు అధికారులను అవమానించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి శుక్రవారం ఐ.వై.ఆర్. ఘాటుగా లేఖ రాశారు. తెలుగు అధికారులను అవమానించేలా వ్యవహరించినందుకు నిరసనగా శనివారం నుంచి 10వ తేదీ వరకు పది రోజుల సెలవుపై వెళుతున్నట్లు సీఎస్‌కు రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. సీఎస్ మహంతి పదవీ కాలం పొడిగించడంపట్ల మిగతా తెలుగు ఐఏఎస్ అధికారులు కూడా భగ్గుమంటున్నారు. దీనిపై త్వరలో రాష్ట్రపతికి లేఖ రాయాలనే యోచనలో ఉన్నారు. చివరివరకు ఐ.వై.ఆర్. సీఎస్ అవుతారని భావించిన  మిగతా ఐఏఎస్ అధికారులు కూడా చివరి నిముషంలో జరిగిన పరిణామాల పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇది రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌లందరినీ అవమానించడమేనని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శామ్యూల్ కూడా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మావోయిస్టులు వర్సెస్ పోలీసులు

      పోలీసులు.. మావోయిస్టుల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టులపై పోలీసులు దాడిచేసి వారిని హతమార్చడంతో.. అందుకు ప్రతీకారంగా అన్నట్లు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో పోలీసు బృందంపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు.100 మంది మావోయిస్టులు పాల్గొన్న ఈ దాడిలో ఒక ఎస్.ఐ, నలుగురు కానిస్టేబుళ్లు మరణించారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఎస్‌ఐ వివేక్‌శుక్లాతో పాటు కానిస్టేబుళ్లు సందీప్‌సాహు, ఛవీలాల్ కాశి, ధనేశ్వర్ మండావి, నావల్‌కిషోర్ శాండిల్య అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు కానిస్టుబుళ్లు పుష్పేంద్ర కుమార్, పర్‌దేశీ రామ్, భగీరథీ మండావి గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్ తరలించినట్లు అదనపు డీజీపీ (నక్సల్ ఆపరేషన్) ఆర్.కె. విజ్ తెలిపారు.

బీజేపీ నేత బంగారు లక్ష్మణ్ కన్నుమూత

      బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ (74) మరణించారు. సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 2000-2001 మధ్య కాలంలో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. తెహల్కా పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ సమయంలో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో 1999-2000 మధ్య కాలంలో ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 1939 మార్చి 17న జన్మించిన బంగారు లక్ష్మణ్ 1996లో రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతని భార్య సుశీలా లక్ష్మణ్ కూడ 14వ లోక్సభకు రాజస్థాన్ నుంచి బిజెపి తరపున ఎంపికయ్యారు.

తొడగొట్టిన జగ్గన్న..దామోదరపై ఫైర్

      సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనను టీఆర్ఎస్ నాయకులే కాదని.. కాంగ్రెస్ పార్టీలోని ఒక నాయకుడు కూడా కదిలించలేడని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) తొడగొట్టారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సతీమణి పద్మిని ఈ స్థానం నుంచి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని తలపెడుతున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినే అయినా, అధిష్ఠానం నిర్ణయానికి మాత్రం తలొంచుతానని జగ్గారెడ్డి చెప్పారు. ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అయితే ఆయన ఒంటికాలిమీద లేచారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మాట మారుస్తున్నారని అన్నారు. దొంగ మాటలతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పునర్‌ నిర్మాణం కేసీఆర్‌కే కాదు, తమకూ తెలుసునని చెప్పారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కాకుంటే ఆ పార్టీకే నష్టమన్నారు. సొంతంగా పోటీ చేస్తే టీఆర్ఎస్ ఓడిపోతుందని, 10 సీట్లు కూడా రావని అన్నారు. టీఆర్ఎస్ విలీనం చేయకుంటే ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులే మిగులుతారని చెప్పారు. టీఆర్ఎస్‌ విలీనం చేయకపోవడం ప్రజలు, కాంగ్రెస్‌ను మోసం చేయడమే అన్నారు. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానని జగ్గారెడ్డి దీమా వ్యక్తం చేశారు.

నల్లారి వారి కాన్వాయ్ వెనక్కి

  'అధికారాంతమున చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్' అన్నారు పెద్దలు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి అలాగే అయ్యింది. లోక్ సభతో పాటు రాజ్యసభలో కూడా తెలంగాణా బిల్లు ఆమోదం పొందడంతో, ఇక చేసేది లేక.. తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఇన్నాళ్లూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇన్నాళ్ల బట్టి ఆయనకున్న కాన్వాయ్ విషయంలో అధికారులు వేలుపెట్టలేదు. ఇక రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని తెలిసిపోయిన తర్వాత ప్రోటోకాల్ అధికారులు నల్లారి వారి ఇంటికి వెళ్లి ఆయన కాన్వాయ్ నుంచి మూడు వాహనాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చల్లగా చెప్పారు. ఇక ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మాజీ ముఖ్యమంత్రికి కల్పించే స్థాయి భద్రత, ఆయనకు వ్యక్తిగతంగా ఉండే ముప్పును పోలీసులు అంచనా వేయడాన్ని బట్టి కల్పించే భద్రత మాత్రమే ఉంటాయన్న మాట. మొన్న దసరా సమయంలోనే కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి రెండు అత్యాధునిక ఎస్ యూ వీలను తన కాన్వాయ్ లో చేర్చారు. దాంతో దేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్ ఉన్న ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. కాన్వాయ్ లోకి కొత్త కార్లు కావాలంటూ ఆదేశాలతో అధికారులు రెండు ల్యాండ్‌ క్రూయిజర్ ప్రాడో కార్లను కొనుగోలు చేశారు. ఒక్కో కారు ధర కోటిన్నర కాగా, వాటిని బుల్లెట్ ప్రూఫ్ చేయించడానికి మరో అరకోటి వెచ్చించారు. దీంతో రెండింటికి కలిపి నాలుగు కోట్లు ఖర్చయింది. ఇప్పుడు వాటన్నింటినీ వెనక్కి తీసుకున్నట్లే అయ్యింది. దసరా కానుకగా కిరణ్ తనకు తానే ఈ రెండు ఎస్ యూవీలను కొనుగోలు చేసి గిప్ట్ గా ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయన్నమాట.

తల్లిని చంపేసి… బిడ్డకు జననమా: నరేంద్ర మోడీ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే విషయంలో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించాయని బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దుమ్మెత్తి పోశారు. రెండు రాష్ట్రాలుగా విభజించేటప్పుడు పాటించాల్సిన కనీస విషయాలేవీ పాటించలేదని, తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా చేశారని మండిపడ్డారు. తల్లిలాంటి సీమాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు ప్రకటించిన ప్యాకేజీలు, పన్ను రాయితీలు ఏవీ సామాన్యుడికి పనికొచ్చేవి కావని మోడీ తేల్చిచెప్పేశారు. తాను త్వరలోనే సీమాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తానని కూడా నరేంద్ర మోడీ చెప్పారు.   రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ఎంతవరకు కారణమో, బీజేపీ కూడా అంతే కారణమని మండిపడుతున్న సీమాంధ్ర ప్రాంత వాసులు ఇప్పటికే తమ ఆగ్రహాన్ని రకరకాల రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ లాంటి నాయకులు రాజ్యసభలో విభజనకు అనుకూలంగా మాట్లాడటంతో పలు ప్రాంతాల్లో నరేంద్ర మోడీ ఫ్లెక్సీలను కూడా తగలబెట్టారు. ఈ ఆగ్రహాన్ని కొంతవరకైనా చల్లార్చి, ఆ ప్రాంతంలో కనీసం ఒకటి రెండైనా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలలో భాగమే నరేంద్రమోడీ చేసిన ఈ వ్యాఖ్యలని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ తో కదం కలుపుదామా?

  మీ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి మార్నింగ్ వాక్ చేసేందుకు సిద్దమేనా? అయితే మరిచిపోకుండా రేపు ఉదయం 6 గంటలకి హైదరాబాదులో ఉన్న పీవీ ఘాట్ వద్దకు వచ్చేయండి. అక్కడ మీ కోసం మీ అభిమాన హీరో పవన్ కళ్యాన్ ఎదురు చూస్తుంటాడు. ఆయనతో బాటే దర్శకుడు త్రివిక్రమ్ కూడా వస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే వారిరువురూ రేపు (మార్చి 2, ఆదివారం) ప్రజాహిత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు హృదయ స్పందన ఫౌండేషన్ వారు కలిసి సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఓ వాక్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పాల్గొనబోతున్నారు. పీవీ ఘాట్ వద్ద సరిగ్గా ఉదయం 6గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమం నెక్లెస్ రోడ్డు వాడ ముగుస్తుంది. పవన్ కళ్యాన్ వస్తున్నాడంటే మరి ఆయన అభిమానులు రాకుండా ఉంటారా? అందువల్ల ఆయనతో కలిసి నడిచేందుకు సిద్దమయిపొంది మరి.

రాష్ట్రపతి పాలనకు ఆమోదముద్ర

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలుతున్నఈ సమయంలోనే మళ్ళీ 41సం. ల తరువాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించబోతున్నారు. కేంద్ర క్యాబినెట్ సూచించిన విధంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించేందుకు అంగీకరిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు ఆమోదముద్ర వేసారు. ఈరోజు రాత్రిలోగా గవర్నర్ నరసింహన్ కు కేంద్రం నుండి లేఖ అందగానే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుంది.   అయితే దీనివలన ప్రజలకు, రాజకీయ పార్టీలకు లేదా ఇతర సంస్థలకు ఎటువంటి ఇబ్బందీ లేకపోయినప్పటికీ, ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాన్ని నిద్రావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విదించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటు. అయితే, గత ఆరు నెలలుగా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, మంత్రి వర్గం అన్నీ ఉన్నపటికీ అవి ఉండీలేనట్టే సాగింది. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం,కాంగ్రెస్ మంత్రులందరూ రాష్ట్రాన్ని, పాలనను గాలికొదిలేసి ముఖ్యమంత్రి పదవి కోసం డిల్లీలో కూర్చొని కీచులాడుకొంటూ చివరికి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో రెండుగా విడిపోతున్న తెలుగు ప్రజలకు రాష్ట్రపతి పాలనను బహుమతిగా ఇచ్చారు. అందుకు తాము చాలా సంతోషిస్తున్నామని ఆనం రామినారాయణ రెడ్డి వంటి మంత్రులు నిసిగ్గుగా శలవిస్తున్నారు.

రేపు బీహార్ లో చప్పట్ల మోత

  సీమాంధ్రకు స్పెషల్ స్టేటస్ ప్రకటించిన కేంద్రంపై బీహార్ రాష్ట్రం ఆగ్రంతో ఉండి. బీహార్ కు కూడా ప్రత్యేక హోదా కల్పించాలంటూ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పలు రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఆందోళనకు దిగాయి. అధికారంలో ఉన్న జెడియూ భారీ సంఖ్యలో ఖగడాల ప్రదర్శన చేసారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రాష్ట్రానికి ప్రత్యేల హోదా బీహార్ వాసుల జన్మ హక్కు అని నినాదించారు. ఇదే అంశంపై బీహార్ బిజెపి నేతలు సైతం రైల్ రోకో నిర్వహించారు. ఈ విషయంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఉద్యమ బాట పట్టారు. ఈనెల 2న వినూత్న బంద్ కు జేడియూ పిలుపు. ఆరోజున ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఐదు నిమిషాల పాటు గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరారు. ఈ మోతకు అదిరిపడి ఢిల్లీ పెద్దలు బీహార్ కు ప్రత్యేక హోదా తెచ్చిపెడుతుందని అన్నారు.

అప్పటివరకు పిచ్చామే చేతిలోనే అధికారం

  సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు పిచ్చామె చేతిలోనే అధికారం ఉంటుందని, తన చేతిలోని రాయి ఎక్కడ విసిరితే అక్కడే సీమాంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పడుతుందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆ పిచ్చామే విసిరిన రాయి నిజామాబాద్ లో పడిన కూడా ఆ ప్రాంతాన్ని సీమాంధ్ర రాజధానిగా ఒప్పుకోవాల్సి వస్తుందని జేసీ మండిపడ్డారు. వైకాపాలో చేరాలంటే ఎంపీ టిక్కెట్టుకు రూ.30కోట్లు, ఎమ్మెల్యే టికెట్ కు రూ.5 కోట్లు అడుగుతున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో కేవలం డబ్బు మాత్రమే పనిచేయదని, అభ్యర్థి గుణగణాలు, శక్తిసామర్థ్యాలు ముఖ్యమని పేర్కొన్నారు. తెలంగాణ సీఎంగా కేసీఆరే అవుతారని అన్నారు. ఇటు సీమాంధ్ర ప్రాంతంలో, అటు తెలంగాణ ప్రాంతంలోను కూడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని జేసీ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతో ఇన్నాళ్ళుగా ఉన్న అనుబంధం తెంచుకోవడం బాధగానే ఉందని, కానీ కాంగ్రెస్ ఉంటేనేం..పోతేనేం.. అని కొందరు చెప్పడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని ఆయన అన్నారు.

జేఏసీల రాజకీయ రంగ ప్రవేశం

  తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాలు కొత్త రాజకీయ నాయకులకు పురుడుపోశాయి. ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండే ప్రభుత్వోద్యోగులు, న్యాయవాదులు, విద్యార్ధులు తదితరులు ఈ ఉద్యమాల పుణ్యామాని రాజకీయ నేతలతో, వారి పార్టీలతో, మంత్రులతో భుజాలు రాసుకొని తిరిగే భాగ్యం పొందారు. ఉద్యమాల కోసం వారు స్థాపించుకొన్న జేఏసీలే వారికి సమాజంలో, రాజకీయాలలో ఒక సరికొత్త గుర్తింపుని, హోదాని, పలుకుబడిని కల్పించాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు వీధికొకటి చొప్పున జేఎసీలు పుట్టగొడుగుల్లా వెలిసాయి. అయితే అన్ని జేఏసీలను, నేతలను ఒకేగాట కట్టలేము. ఉద్యమాలు పతాక స్థాయిలో నడుస్తున్న తరుణంలో వాటిలో అనేకం చురుకయిన పాత్ర పోషించి, దారి తప్పుతున్న రాజకీయ నేతలను అదుపుచేస్తూ తమ భాద్యత నెరవేరగానే స్వచ్చందంగా తప్పుకొన్నవీ చాలానే ఉన్నాయి.   అయితే ఉద్యమాలు ముగిసిన తరువాత కూడా ఇంకా తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నవి కూడా ఉన్నాయి. అవి ఉద్యమంలో తము పడిన కష్టానికి రాజకీయ పార్టీల నుండి టికెట్స్ రూపంలో ప్రతిఫలం ఆశిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో ఇంకా సజీవంగా ఉన్న ఇటువంటి జేఏసీలు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి అధికారం చెప్పట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. అయితే ఇది తప్పని ఎవరూ అనకపోయినప్పటికీ, తమ ఉద్యమ లక్ష్యం నెరవేరిన తరువాత ఇంకా జేఏసీలను సజీవంగా ఉంచడం, దానిని తమ రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకోవాలనుకోవడం సబబు కాదు. జేఏసీ నేతలకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి, ప్రభుత్వంలో పాలు పంచుకోవాలనుకొంటే ముందుగా జేఏసీలను పూర్తిగా రద్దు చేసి, తమ ప్రభుత్వోద్యోగాలకు రాజీనామా చేసి, ఎన్నికలలో పోటీ చేస్తే ఎవరూ తప్పు పట్టలేరు.