సోనియా 'ఇటాలియన్ గాడ్సే'

      తెలుగుజాతి మధ్య విభజన చిచ్చు పెట్టి, కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న సోనియాని గాంధీ అనాలా? గాడ్సే అనాలా? అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన 'ప్రజాగర్జన' సభలో పాల్గొన్న బాబు సోనియా గాంధీ, కాంగ్రెస్ పై నిప్పులు కురిపించారు. తెలుగుజాతి మధ్య చిచ్చు పెట్టి, కుట్రలు పన్ని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విభజన సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి...ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మన్మోహన్ అసమర్థ ప్రధాని అని, సోనియా చేతిలో రోబోలాంటివాడని,ఆమె ఏమి చెబితే అది చేస్తాడని దుయ్యబట్టారు. రిపబ్లిక్ డే నాడు రాష్ట్రపతి మాట్లాడుతూ... చిన్న రాష్ట్రాలు కావాలంటున్నారు, కానీ, బలవంతం చేయడానికి వీలులేదన్నారు. మరి ఇప్పుడు సోనియా ఏమి చేశారు? రాష్ట్రపతి ఎందుకు ఏమీ చేయలేకపోయారు? అని ప్రశ్నించారు. కొత్తగా వచ్చాడో సైకో, తెలంగాణలో పార్టీని మూసేసి ఇప్పుడు సోనియావాదాన్ని పట్టుకు తిరుగుతున్నారు అని జగన్‌ను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ఒక కుట్రలో భాగంగా చేరాయని ఆరోపించారు. వచ్చె ఎన్నికల్లో వైకాపా, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ది చెబుతారని జోస్యం చెప్పారు.  ప్రజాగర్జనకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. పదునైన విమర్శలు చేస్తున్నప్పుడు హర్షధ్వానాలు చేశారు.

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన

      ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచాలని పేర్కొంది. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసిన తరువాత ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేదని గవర్నర్ నజీబ్ జంగ్ కేంద్రానికి తెలియజేశారు. కేజ్రీవాల్ రాజీనామా అనంతరం అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసిన గవర్నర్ పట్టించుకోలేదు. అసెంబ్లీని రద్దు కాకుండా..రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిపారసు చేశారు. గవర్నర్ నజీబ్ జంగ్ సిపారసు కేజ్రీవాల్ తప్పుబట్టారు. మెజారిటీ ఉన్న ప్రభుత్వ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలన్న రాజ్యాంగ నిబంధనను ఉల్లంఘించారని మండిపడ్డారు. ఢిల్లీలో ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడంలేదని, అందుకే రాష్ట్రపతి పాలనకు కేంద్రమంత్రివర్గం  ఆమోదం తెలిపిందని ఆరోపించారు. 

లోక్ సభ ఎన్నికలకు 'ఆమ్ ఆద్మీ' సిద్ధం

      లోక్ పాల్ బిల్లు కోసం ఢిల్లీలో అధికారాన్ని వదులుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠ౦ చెప్పాలని భావిస్తోంది. కేజ్రీవాల్ నేతృత్వంలో లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగబోతున్నామని ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. 'ఝాడూ చలావ్‌యాత్ర' పేరుతో ఈ నెల 23 నుంచి దేశంలోని లోక్ సభ నియోజకవర్గాల ప్రచార హోరుకు ఆప్‌వర్గాలు సిద్దమవుతున్నాయి. అవినీతిపై కాంగ్రెస్, బీజేపీల తీరును ఎండగట్టేందుకు ఆప్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్, బీజేపీల వల్లే తమ ప్రభుత్వం కుప్పకూలిందని ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు. జన్‌లోక్‌పాల్‌ను అమలు చేయడమే తమ ప్రాధాన్యాంశమని, ఆ బిల్లునే అడ్డుకున్న తర్వాత అధికారంలో ఉండి ప్రయోజనం లేదని ఆయన అన్నారు.

వీరు త్యాగమూర్తులేనా?

  శాసనసభ తిరస్కరించిన తెలంగాణా బిల్లుని యధాతధంగా పార్లమెంటులో ప్రవేశపెడితే రాజకీయ సన్యాసం చేస్తానని భీకర ప్రతిజ్ఞ చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ‘లాస్ట్ బాల్స్’ మిగిలే ఉన్నాయని చెప్పడంతో ఆయన మరికొంత కాలం పదవిలో కొనసాగుతారని స్పష్టమయింది. కానీ మహాయితే మరో రెండు మూడు రోజులు మాత్రమే కొనసాగుతారని ఆయన సన్నిహితుడు మరియు క్యాబినేట్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మీడియాకు తెలిపారు. ఆయన కొత్త పార్టీ పెడతారా లేక రాజకీయ సన్యాసం తీసుకొంటారా లేకపోతే మంత్రి కొండ్రు మురళి చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? అనే విషయంపై రేపు సీమాంధ్ర నేతలతో జరుగబోయే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చును.   ఆయన మిగిలిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చాలా గట్టిగా ప్రయత్నించి విఫలమయినట్లు ప్రజలందరికీ నమ్మకం కలిగించాగాలిగారు. కానీ, విభజన జరుగుతోందని చాలా ముందే వీరందరికీ తెలిసి ఉన్నపటికీ ఎవరూ ఆపే ప్రయత్నం చేయకుండా, అందరూ సమైక్యంగా విభజన బిల్లుని జాగ్రత్తగా పార్లమెంటుకు చేర్చి ఇప్పుడు సమైక్యహీరోలుగా, తమ పదవీ కాలం పూర్తయ్యేవరకు కూడా పదవులలో కొనసాగి, ఇప్పుడు ఎన్నికల ముందు పదవులను, పార్టీని కూడా వదులుకొన్న త్యాగమూర్తులుగా ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగబోతున్నారు. మరి వీరందరూ త్యాగ మూర్తులే అయితే మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయడం ఎందుకు? ప్రజలని ఓట్లు కోసం అర్ధించడం ఎందుకు? అని ఆలోచిస్తే వీరి త్యాగాలు దేనికో అర్ధమవుతాయి. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు ఓపికగా వేచిచూచిన తరువాత, కొత్తపార్టీలు పెట్టుకోనో లేకపోతే వేరే పార్టీ కండువా కప్పుకోనో ప్రజల ముందుకు వచ్చి రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని తిడుతూ ప్రజలలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేఖతను, రాష్ట్రం విడిపోయిందనే వారి ఆవేదనను తమకు అనుకూలంగా మార్చుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికే ఈ తిప్పలన్నీ. పోనీ వీరిని నమ్మి ఓటేస్తే మళ్ళీ వీళ్ళు అదే కాంగ్రెస్ పార్టీలో చేరరని నమ్మకమేమిటి? ప్రజలే ఆలోచించుకొని ఓటేయాలి.       

గూడెంలో చంద్రబాబు ప్రజాఘర్జన

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మళ్ళీ ‘ప్రజాగర్జన’ సభలు నిర్వహించనున్నారు. మొదటగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో సభ నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై మరొక రెండు మూడు రోజుల్లో పార్లమెంటు కీలకమయిన నిర్ణయం తీసుకోనున్నఈ తరుణంలో ఆయన ఈ సభ నిర్వహించడం ఆయన రాజకీయ చతురతకి అద్దం పడుతోంది. విభజన బిల్లుపై కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీమాంధ్ర ప్రజల మనోభావాలు ప్రతిబింబిస్తూ ఆయన ప్రసంగం సాగవచ్చును గనుక, వారి నుండి మంచి స్పందనే ఉంటుంది. పైగా అదే జిల్లాకు చెందిన కొత్తపేట కాంగ్రెస్ శాసనసభ్యుడు బండారు సత్యానంద రావు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ను వీడి ఈ సభలోనే చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరనున్నారు కనుక, చంద్రబాబు చేసే ఆరోపణలు కేవలం ఆరోపణలు కాక వాస్తవాలని ద్రువీకరించినట్లవుతుంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరెవరితో కలిసి ఏవిధంగా కుట్రలు పన్నుతోందో ఈ సభలో సత్యానందరావు చేతనే చెప్పించిన తరువాత తెలుగుదేశం పార్టీకి కాక మరే ఇతర పార్టీకి ఓటేసినా అది తిరిగి కాంగ్రెస్ ఖాతాలోనే జమా అవుతుందని చంద్రబాబు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయవచ్చును.

19న తెలంగాణ బిల్లు ఆమోదం..!!

      లోక్ సభలో గందరగోళ పరిస్థితుల మధ్య నాటకీయంగా బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, దానిని ఆమోదింపజేసుకోనేందుకు కొత్త వ్యూహాలను రచిస్తున్నట్లు సమాచారం. మూడు రోజులు సెలవుల అనంతరం సోమవారం ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాలలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపట్టనుంది. బడ్జెట్‌ సమావేశానికి సీమాంధ్ర ఎంపీలు అడ్డుతగిలినా..చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేసి తన ప్రసంగాన్ని ఆర్ధిక మంత్రి ముగించేయాలని చూస్తున్నారు. ముఖ్యమైన బిల్లుల ఆమోదం అనంతరం 19న లోక్ సభలో తెలంగాణ బిల్లుపై చర్చించి వెంటనే ఆమోదింపజేసుకోనేందుకు కేంద్రం కొత్త ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటాన్‌ అకౌంట్‌ సమావేశాలు ముగిసేలోపే ఉభయసభల్లో బిల్లును పాస్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా తమ నేతలకు ఈ మేరకు సూచనలు కూడా ఇచ్చారు. ఈ నెల 19 లోగా పార్లమెంట్‌లో టీ బిల్లు ఆమోదం పొందుతుందని, దానికి అవసరమైన సహకారాన్ని అందరూ అందించాలని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ పై సిన్సియర్ గా వున్నారని, మజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. బిల్లు ఆమోదానికి తీవ్రంగా కృషి చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతానని చెప్పినట్లు సమాచారం. 

సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా

      ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించిన కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగలడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలంటే ముందుగా కేంద్రం అనుమతి తీసుకోవాలని కేంద్ర న్యాయ శాఖ చెప్పింది. అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు అసెంబ్లీలో బిల్లు పెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్, బీజేపీలు సభలో గందరగోళం సృష్టించాయి. గవర్నర్ సూచనపై ఓటింగ్ నిర్వహించాలని కూడా డిమాండ్ చేశాయి. బిల్లును ప్రవేశపెట్టే తీర్మానానంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. దీనికి 42 మంది వ్యతిరేకంగా, 27 మంది అనుకూలంగా ఓటు వేశారు.  దీంతో మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నందున బిల్లును అనుమతించడం లేదని స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టలేకపోవడంతో ఆయన మనస్తాపం చెందారు. తమ ప్రధాన లక్ష్యాన్నే చేరుకోలేనప్పుడు ఇక అధికారంలో ఉండటం అర్థ రహితమని భావించిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు.

విజయానికి చేరువలో బీజేపీ: టైమ్స్ సర్వే రిపోర్ట్

  కాంగ్రెస్ మళ్ళీ అధికారం చేజికించుకొంటే రాహుల్ గాంధీ, బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారనే విషయం నిర్ధారణ అవడంతో ప్రజలకు, మీడియాకు కూడా ఎన్నికల పట్ల, ఆయా పార్టీల విజయావకాశాల పట్ల ఆసక్తి పెరిగింది. కాంగ్రెస్, బీజేపీలు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచార యుద్ధం కూడా పెద్ద ఎత్తున మొదలుపెట్టడంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. అందుకే నిత్యం ఏదో ఒక మీడియా సంస్థ ఎన్నికలు సర్వేలు నిర్వహిస్తూ నివేదికలు ప్రకటిస్తున్నాయి. అయితే ఇంతవరకు వెలువడిన దాదాపు డజనుపైగా సర్వే నివేదికలలో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలుస్తుందని కానీ, కనీసం గెలిచే అవకాశముందని కానీ ద్రువీకరించకపోవడం విశేషం. తాజాగా టైమ్స్-సి ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ఎన్నికలలో గెలిచే అవకాశం ఉందని మరోమారు ద్రువీకరించింది.   ఆ నివేదిక ప్రకారం త్వరలో జరుగనున్నఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కేవలం 89 సీట్లు, బీజేపీ 202 సాధించుకొనే అవకాశమున్నట్లు ప్రకటించింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న206 సీట్లలో సగానికి పైగా కోల్పోబోతుంటే, 112 సీట్లుగల బీజేపీ దాదాపు రెట్టింపు సీట్లు స్వంతంగా గెలుచుకోబోతోంది. ఇక ప్రస్తుతం 259 సీట్లున్న కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమి కేవలం 101 సీట్లతో సరి పెట్టుకోవలసి వస్తే, 159సీట్లుగల బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమికి 227 సీట్లు వరకు రావచ్చని సర్వే నివేదిక స్పష్టం చేసింది.   కానీ, 543 సీట్ల లోక్ సభలో కనీసం 272 సీట్లు సాధించగలిగినప్పుడే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. అంటే ఎన్డీయే కూటమికి ఇంకా మరో 45 సీట్లు అవసరముంటుంది. అయితే, ఎన్నికల సమయం దగ్గరపడేలోగా నరేంద్ర మోడీ ఈలోటుని కూడా క్రమంగా పూడ్చుకొనే విధంగా వ్యూహాలు అమలు చేస్తూ ప్రచారం చేయకపోరు. అదీగాక, ఇంతవరకు ఎన్డీయే కూటమిలో లేని తెదేపా, వైకాపా, తెరాస వంటి అనేక ఇతర పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి గనుక బీజేపీ అవలీలగా మెజార్టీ సాధించగలదని భావించవచ్చును.   ఈ ఎన్నికలలో బీజేపీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, గుజరాత్, డిల్లీ, హర్యాన, ఛత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వే నివేదిక తెలియజేస్తోంది. ఇక మన రాష్ట్రానికి సంబందించిన వరకు చూసుకొంటే, గత ఎన్నికలలో 33 సీట్లు గెలుచుకొన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి కేవలం 6సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే.

తెలంగాణ బిల్లు పెట్టలేదు: లగడపాటి

      లోక్ సభలో హోంమంత్రి షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు సభ నియమాలను పాటించలేదని ఎంపీ లగడపాటి రాజగోపాల్ మండిపడ్డారు. ఇదే విషయంపై తాము పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని, త్వరలో విపక్ష పార్టీల నేతలందరికీ ఈ విషయంపై లేఖలు రాస్తామని లగడపాటి తెలిపారు. లోక్ సభలో నిన్న జరిగిన పరిణామాలు చాలా దురదృష్టకరమని అన్నారు. తన సహచర ఎంపీపై దాడి జరుగుతుంటే, తాను అడ్డుకోవడానికి వెళ్లానని, అప్పుడు వందమంది ఎంపీలు తనపై దాడికి ప్రయత్నించారని వారితో పోరాడలేక, విధిలేని పరిస్థితుల్లోనే పెప్పర్ స్ప్రేను ఉపయోగించానన్నారు. ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదన్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఎంపీ కొనకళ్ల కు బైపాస్ సర్జరీ!

      లోక్ సభలో గుండెపోటుకు గురైన కృష్ణా జిల్లా మచిలీపట్నం తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రి నుంచి శుక్రవారం ముంబైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కొనకళ్లకు బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. అయితే సర్జరీ ఎప్పుడు చేయాలనేది ఇవాళ నిర్ణయిస్తారు. ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో ఉన్న కొనకళ్లను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్లమెంటు సభ్యులు కెవిపి రామచందర్ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరిలతో పాటు పలువురు ఎన్జీవో నేతలు పరామర్శించారు. కొనకళ్ల ఆరగ్యో పరిస్థిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లగడపాటిపై కేంద్ర మంత్రుల బ్లేమ్ గేమ్

      తనను సభ నుంచి సస్పెండ్ చేయడంపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియంలోకి వచ్చినందుకే తనను సస్పెండ్ చేస్తే.. తనతోపాటు మరో వందమంది కాంగ్రెస్ ఎంపీలు కూడా వెల్‌లోకి వచ్చారని, మరి.. వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీల అంతు చూడండి అంటూ కేంద్ర మంత్రులే వీరిని వెల్‌లోకి పంపించారని ఆరోపించారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, లేకపోతే వందమందినీ సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని చెప్పారు. స్పీకర్ ఏకపక్షంగా అధికార పక్షంతో కలిసిపోయి దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో సీటు కోసం, టికెట్ కోసం, బీఫారం కోసం స్పీకర్ పని చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ విభజన వాదమే ఆమె వాదమని దుయ్యబట్టారు. ప్రాణ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే వాడొచ్చని పార్లమెంటు సాక్షిగా రుజువు చేశానన్నారు. తనపై నింద మోపేలా కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మంత్రులే బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.

బిల్లుకి మద్దతు ఇస్తే తెదేపా-బీజేపీ దోస్తీ కటీఫ్

  పార్లమెంటు ఉభయసభలు సోమవారానికి వాయిదా పడటంతో ప్రళయం ముందు ప్రశాంతత నెలకొన్నట్లుగా, ఉంది. ఆంధ్ర, తెలంగాణా నేతలందరూ వారివారి శిబిరాలలో చేరి మిగిలిన ఐదు రోజుల్లో బిల్లుని ఏవిధంగా ఆమోదింపజేసుకోవాలా, అడ్డుకోవాలా? అని మంతనాలు చేస్తున్నారు. అయితే, ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే జరుగబోతోంది. మిగిలినవారు వాటికి పావులుగా ముందుకు, వెనక్కి నడవవలసి ఉంటుంది.   బీజేపీ బిల్లుకి మద్దతు ఇస్తే క్షణాల మీద విభజన బిల్లు ఆమోదం పొందుతుంది. ఇవ్వకపోతే, ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో తమ తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, ఒకదానిపై మరొకటి నెపం నెట్టి వేసే ప్రయత్నంలో ధాటిగా మాటల యుద్ధం చేయడం ఖాయం. రానున్న ఎన్నికలలో బీజేపీని ఓడిస్తేనే కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టగలదు. కనుక, బీజేపీ బిల్లుకి మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా దానిపై నిందలు మోపి అన్నివిధాల అభాసుపాలు చేయక మానదు. మరి ఇది తెలిసి కూడా కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న ఈ బిల్లుకి బీజేపీ మద్దతు ఇస్తుందని భావించలేము.   బిల్లుకి మద్దతు ఈయడం వలన ఆ పార్టీకి తెలంగాణాలో కొత్తగా ఒరిగేదేమీ లేకున్నా, తెదేపాతో ఎన్నికల పొత్తుల ప్రసక్తి ఇక మరిచిపోవలసి ఉంటుంది. ఒకవేళ బీజేపీ తెలంగాణా బిల్లుకి అనుకూలంగా ఓటు వేసినట్లయితే, రాష్ట్ర విభజనకు సహకరించిన కారణంగా ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్యతో సమానమవుతుంది గనుక, ఇక చంద్రబాబు బీజేపీతో పొత్తులకు అంగీకరించకపోవచ్చును.   తెదేపాతో పొత్తులు పెట్టుకొంటే తప్ప బీజేపీ ఈసారి సీమాంధ్రలో ఒక్కసీటు కూడా దక్కించుకోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందుకంటే, ఈసారి తెదేపా, వైకాపాలకు జీవన్మరణ పోరాటంగా సాగబోతున్న ఎన్నికల కురుక్షేత్రంలో మధ్యలో ఎవరు దూరినా మిగలరు. అదీగాక, బీజేపీకి సీమాంధ్ర ప్రజలలో మంచి గుర్తింపు, పలుకుబడి ఉన్న నాయకుడు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు కొత్తగా ఆ పార్టీలో చేరుతున్నకృష్ణంరాజు వంటివారయినా గెలవాలంటే తప్పనిసరిగా తెదేపాతో పొత్తులు పెట్టుకోవలసి ఉంటుంది. అందువల్ల బీజేపీ తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేయడమో లేక అది ఆమోదం పొందకుండా ఏదోవిధంగా అడ్డుపడటమో చేయవచ్చును.

సీమాంధ్ర నేతల మధ్య చిచ్చుకి కాంగ్రెస్ కొత్త ఐడియా

  లోక్ సభలో నిన్న జరిగిన గొడవ, ఏకంగా 18మంది సభ్యులను సస్పెండ్ చేయడం, తన సభ్యులను అదుపుచేయలేని కాంగ్రెస్ అధిష్టానం అసమర్ధతని ఎండగడుతూ బీజేపీతో సహా దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీల విమర్శలు, కాంగ్రెస్ (సభ్యులకి) వ్యతిరేఖంగా దేశవ్యాప్తంగా మీడియాలో విమర్శలు, కదనాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేసాయి. రాష్ట్ర విభజన చేసి రాజకీయ లబ్ది పొందుదామని దురాశకు పోతే ఉన్న పరువు కూడా ఈవిధంగా పోతుండటంతో, ఈ సమస్య నుండి ఎలాగయినా గట్టేకేందుకు కాంగ్రెస్ అధిష్టానం మరో కొత్త ఆయుధం బయటకు తీసింది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని అంశం. మొన్న ప్రధానిని కలిసిన బీజేపీ అగ్ర నేతలు కూడా రాజధాని గురించే ప్రశ్నించడంతో, ఇప్పుడు అదే అంశంతో ఇప్పటికే గ్రూపులుగా, పార్టీల వారిగా విడిపోయున్న సీమాంధ్ర నేతల మధ్య చిచ్చుపెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్దపడుతోంది.   నిజానికి రాష్ట్ర విభజన ప్రకటన చేసినప్పుడే నిపుణుల కమిటీని వేసి 45రోజులలోగా కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి? దానికి ఎంత నిధులు కావాలి? తదితర అంశాలపై ఓ నిర్ణయం తీసుకొని బిల్లులో చేరుస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ఆ తరువాత హామీని పక్కన పడేసి కధ ఇంతవరకు నడిపించింది. బహుశః రాష్ట్ర విభజన చేయగలనని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా పూర్తిగా నమ్మకం లేనందునే, ఈవిషయం పట్టించుకోలేదేమో? ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానానికి నిజంగా తెలంగాణా ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉండి ఉంటే, రాష్ట్ర విభజనకు మానసికంగా సిద్దపడి సీమాంధ్ర కోసం ప్యాకేజీలు కోరిన పురందేశ్వరి, చిరంజీవి వంటి వారికి పూర్తి భరోసా కల్పించి, వారిని ప్రోత్సహించి, వారి ద్వారా కొత్త రాజధాని ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లి ఉండేది. కానీ, ఎంతసేపు రాష్ట్ర విభజన చేసి ఏవిధంగా రాజకీయ లబ్ది పొందుదామా? అనే కుత్సిత ఆలోచనలు తప్ప, వేరే ధ్యాస లేకపోవడంతో చివరి నిమిషం వరకు కూడా అంతా అయోమయమే, అనుమానాస్పదమే!   ఇక పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, పరువు పోగొట్టుకొన్న తరువాతయినా కాంగ్రెస్ అధిష్టానానికి జ్ఞానోదయం కలగకపోగా, ఇప్పుడు రాజధాని అంశంతో సీమాంధ్ర నేతల మధ్య చిచ్చుపెట్టి ఎలాగయినా బిల్లుని ఆమోదింపజేసుకోవాలని యోచించడం చూస్తుంటే కాంగ్రెస్ కి పోయే కాలం దాపురించినట్లే కనబడుతోంది.

ఇంకా లాస్ట్ బాల్స్ మిగిలే ఉన్నాయి: కెప్టెన్ కిరణ్

  పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే తన పదవి నుండి తప్పుకొంటానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెపుతూ వచ్చినందున, ఆయన ఈరోజు తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేస్తారని అందరూ భావించారు. కానీ చేయలేదు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అయితే ఇక ఉండబట్టలేక “రాజీనామా చేస్తానన్నారు కదా? ఇంకా చేయలేదేమిటి?” అని మీడియా ద్వారా ప్రశ్నించారు కూడా. అయితే కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం లాస్ట్ బాల్స్ ఇంకా చాలా మిగిలే ఉన్నాయని టక్కున సమాధానం ఇచ్చారు.    రాజీనామా చేయడమనేది తన ముందున్న అనేక ఆప్షన్లలో ఒకటని, తన సహచరులతో చర్చించిన తరువాతనే ఏ నిర్ణయమయినా తీసుకొంటానని తెలిపారు. తనకు లాస్ట్ బాల్స్ చాలా మిగిలే ఉన్నాయని చెపుతూనే, పనిలోపనిగా తన అధిష్టానానికి మళ్ళీ గుగ్లీలు వేసారు. "   మతతత్వ పార్టీ అని మనం నిత్యం విమర్శించే బీజేపీతో ప్రధానమంత్రి లంచులు, డిన్నర్లు చేయడాన్ని ఏమనుకోవాలి? మన స్వంత పార్టీ నేతలని పక్కనపడేసి మన రాజకీయ ప్రత్యర్దులని సహాయం కోసం అర్దించడం ఏమిటి? స్వంత పార్టీనే నమ్మనివారు ప్రత్యర్ధి పార్టీని ఏవిధంగా నమ్ముతున్నారు? ఏవిదంగా సహాయం ఆశిస్తున్నారు? పార్లమెంటులో జరిగిన సంఘటనలకు ప్రధాని తన హృదయం రక్తం కారుస్తోందని అన్నారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం తీసుకొన్న తప్పుడు నిర్ణయానికి ఇక్కడ కోట్లాది ప్రజల హృదయాలు రక్తం స్రవిస్తున్న సంగతి ఆయనకి తెలియదా? తెలిసీ పట్టించుకోవడం లేదనుకోవాలా?” అని సమాధానాలు దొరకని అనేక యక్షప్రశ్నలు వేసారు.   కానీ, మళ్ళీ అంతలోనే తన మాటలతో సోనియమ్మ మనసు నొప్పించినందుకు బాధపడుతూ, “నేటికీ సోనియాగాంధీయే మా అధినేత. ఆమె అంటే నాకు అపారమయిన గౌరవం ఉంది. నేను రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మాత్రమె వ్యతిరేఖిస్తున్నాను తప్ప ఆమెను, మా పార్టీని కాదు,” అని ముగించారు.   ఇక అటువైపు నుండి దిగ్విజయ్ సింగ్ కూడా అంతే ఇదిగా స్పందిస్తూ, “కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి విధేయుడయిన మంచి క్రమశిక్షణ గల నేత” అని కిరణ్ కాండక్ట్ సర్టిఫికేట్ ని ఈరోజు మరోమారు రెన్యువల్ చేసారు.   మరి తెదేపా, వైకాపా నేతలు ఆయనపై అనుమానం పడిపోతున్నారంటే ఎందుకు పడరూ? అందుకే “ఆయన సమైక్య ముసుగులో దాగిన విభజనవాదని” జగన్మోహన్ రెడ్డి కూడా సర్టిఫై చేసేసారు.

'పెప్పర్ స్టార్' లగడపాటి

  డ్రామా కింగ్ అని పేరుపొందిన కాంగ్రెస్ బహిష్కృత యంపీ లగడపాటి రాజగోపాల్ ఇంతకాలంగా రాష్ట్ర విభజన విషయంలో ఎంతగా గొంతు చించుకొన్నా, ఎక్కడ, ఎన్ని డ్రామాలు ఆడినా రాని గుర్తింపు, ఈ ఒక్క రోజులోనే సంపాదించుకొన్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ మీడియాలో ఆయన చేసిన పని గురించే చర్చ జరగడంతో ఒకే ఒక్కరోజులో ఆయన పెద్ద ‘స్టార్ అట్రాక్షన్’గా మారిపోయారు. చివరికి ఆయన రాజకీయ ప్రత్యర్ధి జగన్ మోహన్ రెడ్డి సైతం లగడపాటి మంచిపనే చేసారని మెచ్చుకొన్నారు. ఇంతకీ ఆయన చేసిన ఘన కార్యం ఏమిటంటే ,ఈరోజు లోక్ సభలో తెలంగాణా కాంగ్రెస్ యంపీలను అడ్డుకొనేందుకు ఆయన వారిపై మిరియాల పొడి స్ప్రే చేయడమే. దానితో సభలో అందరూ ఉలిక్కిపడి భయంతో బయటకి పరుగులు తీయవలసి వచ్చింది. భాద్యతగల ఒక సభ్యుడిగా ఆయన ఆవిధంగా చేయడం ఎవరూ హర్షించరు. అందుకు ఆయనపై కేసులు పెట్టవచ్చును. తప్పనిసరి అయితే నిర్భందించవచ్చును కూడా. కానీ దానివల్ల ఆయనకు సీమాంధ్ర ప్రజలలో మరింత సానుభూతి పెరిగి మేలు చేస్తుందే తప్ప ఎటువంటి నష్టము లేదు. పైగా ఆయనకీ మరింత ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతునందుకు చాలా సంతోషిస్తారేమో కూడా!  

చంద్రబాబు సూటి ప్రశ్న

  ఈరోజు లోక్ సభలో కాంగ్రెస్ యంపీలు అనుచితంగా వ్యవహరించిన తీరుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ గట్టిగా ఖండించారు. అనుచితంగా ప్రవర్తించిన వారిపై పార్లమెంటు నియమ నిబంధనల ప్రకారం కటిన చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు కూడా. అయితే ఆయన మీడియాతో ఈ మాటలు చెప్పే కొద్దిసేపటి ముందు, లోక్ సభలో తీవ్ర అలజడి చేసి, సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలపై దాడికి పాల్పడ్డాడని ఆరోపింపబడుతున్న టీ-కాంగ్రెస్ యంపీ పొన్నం ప్రభాకర్ ను ఆప్యాయంగా కౌగలించుకొని భుజం తట్టడం చూస్తే, కాంగ్రెస్ అధిష్టానమే దగ్గరుండి ఈ కధంతా నడిపిస్తోందా అనే అనుమానం కలుగుతోంది. అంతేకాక, కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్ర, తెలంగాణా విషయంలో ఎటువంటి ద్వంద వైఖరి అవలంభిస్తోందో అర్ధమవుతోంది.   ఇక తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ "అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈరోజు లోక్ సభ లో జరిగిన దురదృష్టకర ఘటనలను గట్టిగా ఖండించారు. కానీ సోనియా, రాహుల్ గాంధీలు మాత్రం ఎందుకు పెదవి విప్పలేదు?" అని ప్రశ్నించారు.  బీజేపీ నేత సుష్మాస్వరాజ్ కూడా సోనియాగాంధీని తీవ్రంగా విమర్శించారు. “ఆమె సభలో ఉన్నపటికీ చోద్యం చూస్తూ కూర్చోన్నారే తప్ప, తన యంపీలను నియత్రించాలని అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ దేశంపై క్రమంగా తన పట్టు కోల్పోయింది. ఇప్పుడు పార్టీపై కూడా పట్టుకోల్పోయిందని ఈరోజు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి,” అని విమర్శించారు.   రాహుల్ గాంధీ ఈ దేశాన్ని, ప్రభుత్వ పనితీరుని, ఈ రాజకీయ వ్యవస్థని పూర్తిగా మార్చేయాలని తరచూ లెక్చర్లు ఇస్తుంటారు. కానీ, ముందుగా తన స్వంత ఇంటిని కూడా చక్కబెట్టుకోలేరు. చక్కబెట్టుకోలేకపోతే పోయే, కనీసం ఇటువంటప్పుడయినా దైర్యం చేసి ఒక మాట మాట్లాడలేరు. కానీ ప్రధానమంత్రి పదవికి తాను అన్నివిధాల అర్హుడనని భావించడం విశేషం.

తెలంగాణ బిల్లు 'టైమ్' ఇదికాదు

      లోక్ సభలో తెలంగాణ బిల్లు పెట్టేందుకు ఇది సరైన సమయం కాదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ అన్నారు. గందరగోళ పరిస్థితుల మధ్య సభలో బిల్లు పెట్టడం దురదృష్టకరమని... సభలో ఓటాన్ అకౌంట్ తప్ప మరేబిల్లు చేపట్టేందుకు సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్ నేతలే హింసను సృష్టించారని, ఈరోజు జరిగిన సంఘటనలు పార్లమెంట్ చరిత్రకే చెరగని మచ్చని అద్వానీ అవేధన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందే కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు బిల్లు ప్రతులను చింపి గాలిలోకి విసిరేయడం, సభా ఆస్తులను ధ్వంసం చేయడం చాలా బాధకరమని ఆయన అన్నారు. ఇంత వివాదాస్పదమైన బిల్లు సమస్య కేవలం కాంగ్రెస్ ఎంపీలను, మంత్రులను సస్పెండ్ చేసినంత మాత్రాన పరిష్కారం కాదని ..అందుకు తాము అ౦గీకరించబోమని స్పష్టం చేశారు.